Ala Vaikunthapurramloo Movie Review - పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

Ala Vaikunthapurramloo Movie Review - పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

(Ala Vaikunthapurramloo Movie Review)

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ సినిమాల తర్వాత.. త్రివిక్రమ్, బన్నీల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో 'అల వైకుంఠాపురంలో' పై అభిమానులు బాగానే ఆశలు పెట్టుకున్నారు. అందుకే దర్శక, నిర్మాతలు కూడా బాగా గ్యాప్ తీసుకొని మరీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. పైగా ఈ సినిమా ఆడియా కూడా సూపర్ హిట్ కావడంతో.. ఈ చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో మనం కూడా తెలుసుకుందాం 

ఓ డబ్బునోడి కొడుకు పేదోడి ఇంట్లో పెరగడం... అలాగే పేదోడి కొడుకు డబ్బునోడి ఇంట్లో పెరగడమనేది  చాలా పాత కాన్సెప్ట్.  ఇదే కాన్సెప్ట్ గతంలో అనేక సినిమాలలో.. అనేకసార్లు రిపీట్ అయ్యింది. ఇప్పుడు విడుదలైన 'అల వైకుంఠాపురంలో' కూడా అచ్చం అలా రిపీటైన కాన్సెప్టే. కాకపోతే కథను తనదైన శైలిలో త్రివిక్రమ్ నడిపిన తీరు మాత్రం కొత్తగా ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ సబ్జెక్టుకి కావాల్సినంత కామెడీని అద్దడంతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగానే సాగుతుంది. 

'అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల' ప్రేమకథ.. సినిమా కథని మరిపించేలా ఉంటుంది తెలుసా...!

ఇక సినిమా కథలోకి వెళితే కోటీశ్వరుడైన రామచంద్ర (జయరాం) ఆఫీసులో పనిచేసే ఉద్యోగి వాల్మీకి (మురళీ శర్మ). ఒకానొక సందర్భంలో పరిస్థితుల ప్రభావం వల్ల.. ఆ తర్వాత తను స్వార్థంతో తీసుకున్న ఓ నిర్ణయం వల్ల వాల్మీకి ఆసుపత్రిలో బిడ్డలను మార్చేస్తాడు.  దీంతో ధనికుడైన రామచంద్ర ఇంట్లోనే పెరగాల్సిన అతని సొంత కుమారుడు.. బంటుగా (అల్లు అర్జున్) వాల్మీకి ఇంట్లో పెరుగుతాడు. అలాగే వాల్మీకి కొడుకు రాజ్ మనోహర్‌గా (సుశాంత్)  రామచంద్ర ఇంట్లోనే పెరుగుతాడు. ఎన్నో కష్టాల మధ్య పెరిగిన బంటు ఓ ఆఫీసులో పనిచేస్తుంటాడు. అలాగే అమూల్యతో (పూజా హెగ్డే)  ప్రేమలో కూడా పడతాడు. కానీ ఓ సందర్భంలో బంటు తన తండ్రిని గురించి తెలుసుకున్నాక.. ఏం జరిగింది? తన సొంత ఇంట్లోకి తను ప్రవేశించడానికి వేసిన ఎత్తుగడలేమిటి.. అన్నదే చిత్రకథ. 

మన బన్నీ.. 'స్టైలిష్ స్టార్' ఎలా అయ్యాడు? (అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్)

ఇక ముందుగా చెప్పుకోవాల్సింది ఇక్కడ బన్నీ గురించి. నటన పరంగా ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం తనకు కొట్టిన పిండి. అందుకే తన పాత్రలో తాను సహజంగానే నటించాడు. ముఖ్యంగా కొన్ని సీన్లలో ఇమోషన్‌ను చాలా బాగా పండించాడు. ఇక తన డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అభిమానులను కచ్చితంగా ఉర్రూతలూగిస్తాయి. సామ‌జ‌వ‌రగ‌మ‌న‌, రాములో రాముల‌, బుట్ట‌బొమ్మ మొదలైన పాటలకు తమన్ సంగీతం సరిగ్గా కుదిరింది. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెమెరా పనితనం గురించి. పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలెట్. అలాగే నిర్మాతలు కూడా సినిమాని చాలా రిచ్‌గా తీయడానికి ప్రయత్నించారు.

'సామజవరగమనా'.. అంటూ ప్యారిస్‌లో రొమాన్స్ చేస్తున్న బన్నీ ..!

టబు, సముద్రఖని, నవదీప్, సునీల్, సచిన్ ఖేడ్కర్ మొదలైనవారు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. అయితే సెకండాఫ్ నిడివి కొంచెం తగ్గించుంటే బాగుండేది. ఇక త్రివిక్రమ్ మార్కు డైలాగ్స్ ఈ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చాయి. ఒకవైపు భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తూనే.. మరో వైపు ఫన్ జనరేట్ చేయడానికి ప్రయత్నించారు. మొత్తానికి ఈ సంక్రాంతికి ఫ్యామిలీలకు కాస్త ఫన్ పంచడానికి.. 'అల వైకుంఠాపురంలో' ఒక మంచి ఆప్షనే అని చెప్పుకోవచ్చు. 

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి... అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి