నిర్మాత కూతురిగా కాదు.. ఆర్జే విద్యగా ఉండటమే ఇష్టం

నిర్మాత కూతురిగా కాదు.. ఆర్జే విద్యగా ఉండటమే ఇష్టం

సాధారణంగా సినిమా రంగంలోని వారి పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తూ.. అదే రంగంలో తమకంటూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. దానికి ఉదాహరణలు మనకు ఎన్నో కనిపిస్తాయి. కానీ ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ‌ ప్రసాద్ కూతురు విద్య శివలెంక (Vidya sivalenka) దీనికి పూర్తిగా భిన్నం. అదేనండీ రెడ్ ఎఫ్ఎంలో ‘నాకు సినిమాలంటే పిచ్చి’ అంటూ  భాగ్యనగరవాసులకు సుపరిచితమైన RJ Vidya.


నిర్మాత కూతురిగా కాక తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొంది. అలా ఉండటమే తనకు ఇష్టమంటోన్న విద్య తనకు నచ్చిన కెరీర్ ఎంచుకొని ముందుకు సాగిపోతోంది. ఏ పనైనా చేపట్టే ముందు మన గురించి, మన గమ్యం గురించి తెలుసుకోవాలని చెబుతోంది విద్య శివలెంక. దీంతో పాటు తనకు, తన ఆలోచనలకు సంబంధించిన మరెన్నో విషయాలను మనతో పంచుకొంటోంది ఆర్జే విద్య.


సాధారణంగా తల్లిదండ్రులకు తమ కూతురు లేదా కొడుకు ఏ ఇంజనీరో, డాక్టరో అయితే బాగుండునని కోరుకొంటారు. అప్పటికే మనింట్లో ఓ ఇంజినీర్ ఉంటే.. ఇక మనం కూడా అదే చదవాలని పట్టుబడతారు. ఇలాంటి వారికి నాన్ సైన్స్ గ్రూపులో చేరతానని ఒప్పించడమంటే.. ఓ పట్టాన అయ్యే పని కాదు. విద్య శివలెంక కూడా అంతే. పైగా వాళ్లింట్లో ఎక్కువ మంది ఇంజనీర్లే ఉన్నారు. నాన్ సైన్స్ గ్రూప్ తీసుకొందామంటే ఒప్పుకోరు. అయినా కన్విన్స్ చేశారు విద్య. వారిని ఒప్పించి మరీ కామర్స్ గ్రూపులో చేరారు.


డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఓసారి ఆర్జే హంట్‌కి సంబంధించిన పోస్టర్ చూశారు. నిజానికి అప్పటికి ఆమెకు ఆర్జే అంటే ఏంటో తెలీదు. అసలు ఆర్జేలు ఏం చేస్తారో కూడా తెలీదు. కానీ మాట్లాడి కూడా డబ్బు సంపాదించవచ్చా? అనే పాయింట్ చాలా ఇంటరెస్టింగ్‌గా అనిపించిందట. అందుకే పోస్టర్లో ఉన్న నంబర్‌కి వాయిస్ రికార్డ్ పంపించారు. నిజానికి  అదే ఆడిషన్ అన్నమాట. చివరిలో చెప్పిన మాటే నన్ను ఆర్జేని చేసిందంటారు విద్య.


‘జస్ట్ బికాజ్ యు హావ్ మై నంబర్, డోంట్ కాల్ మీ’ అని చెప్పారట విద్య. ఆ ఆర్జేహంట్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు విద్య. ఆర్జే కావడానికి మరో కారణం కూడా ఉంది. ‘మా ఇంట్లో రేడియో వినే అలవాటు ఉంది. ఆర్జే అయితే రేడియోలో మనం మాట్లాడొచ్చు అనే ఆలోచన కూడా ఆర్జేగా మారడానికి కారణం’ అంటారు విద్య. ‘మా అన్నయ్య ఆర్జేకి ఆడిషన్ ఇచ్చానని చెప్పారు. సాధారణంగా అన్నాచెల్లెల మధ్య పోటీతత్వం ఉంటుంది. తనేనా? నేనెందుకు ఆడిషన్ ఇవ్వకూడదు? అనిపించి నేను కూడా నా వాయిస్ పంపించాను. రన్నరప్‌గా అయితే నిలిచాను. ఆర్జేగా పనిచేసే అవకాశం వచ్చింది. కానీ అందులో చేరలేదు. ఎందుకంటే.. ముందు చదువు పూర్తి చేయడం ముఖ్యం. ఆ తర్వాతే ఉద్యోగం అన్నారు. కానీ ఆర్జేగా పనిచేయాలన్న కుతూహలం నాలో ఏ మాత్రం తగ్గలేదు. అందుకే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నేను రేడియో మీద ప్రాజెక్ట్ వర్క్ చేశాను. ఇంటర్న్ షిప్ సైతం రేడియోలోనే చేశాను. ఆ సమయంలోనే రెడ్ ఎఫ్ఎంలో పనిచేసే అవకాశం దక్కింది’.


పనిలో చేరిన మొదటి రోజు ఎవరికైనా కాస్త భయంభయంగా.. కొత్త కొత్తగా ఉంటుంది. తాను ఆర్జేగా పనిచేసిన మొదటి రోజు గురించి విద్య ఏం చెబుతున్నారంటే..‘మొదటి రోజు చాలా భయంగా అనిపించింది. కానీ చాలా మంచిగా కూడా అనిపించింది. ఇప్పుడు ఆ రికార్డింగ్ వింటే.. నేనేనా ఇలా మాట్లాడింది అనిపిస్తూ ఉంటుంది. ఆర్జేగా నా మొదటి రోజు మాత్రమే కాదు.. రెండో రోజు కూడా నాకు ప్రత్యేకమే. ఎందుకంటే.. సందీప్ కిషన్, రాహుల్ ’రవీంద్రన్ ఇద్దరినీ ఇంటర్వ్యూ చేసే అవకాశం దక్కింది. అదే నా మొదటి సెలబ్రిటీ ఇంటర్వ్యూ. ఎలా చేస్తానా? అనుకొన్నాను.


కానీ వాళ్లిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇది స్టూడియోలో జరిగిన ఇంటర్వ్యూ. బయటకు వెళ్లి చేసిన మొదటి ఇంటర్వ్యూ సూర్య గారితో. ఇది కూడా నేను కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలోనే జరిగింది. ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఆయన నన్ను కంగ్రాచ్యులేట్ చేయడం, నా షో గురించి బైట్ చెప్పడం నేను ఎప్పటికీ మరచిపోలేని మంచి అనుభవం’.


తన జీవితం ఎప్పుడూ సినిమాలతోనే ముడిపడి ఉందని చెబుతుంటారు విద్య. ఆర్జేగా సైతం తాను సినిమాల గురించే చర్చించేవారు. ‘మా ఇంట్లో సీరియస్‌గా అందరూ మాట్లాడుకొనేది సినిమా గురించే. ఏదైనా గొడవ అవుతోందంటే అది సినిమా గురించే. సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ గారు మా తాతయ్య. అంటే మా నాన్నగారికి మేనమామ. నాన్న కూడా నిర్మాత కావడంతో ఇంట్లో  సినిమా వాతావరణం ఉండేది. మా నాన్నగారు కూడా సినిమా స్టోరీలను మాతో డిస్కస్ చేస్తుంటారు. ఇప్పుడైతే మమ్మల్ని కథాచర్చల్లోనూ భాగం చేస్తున్నారు. మా ఒపీనియన్ బట్టి నిర్ణయం తీసుకుంటున్నారు. సోషల్ మీడియా పరంగా ఆయనుకు కొంత హెల్ప్ చేస్తుంటాను’.


3-vidya-sivalenka


‘వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా ఒకట్రెండు సినిమాలకు పనిచేశాను. కానీ నాకు అంత సౌకర్యంగా అనిపించలేదు. కానీ ప్రకటనలకు నా గొంతు అరువిస్తుంటాను. ఓలా, ఉబెర్ లాంటి కొన్ని సంస్థలతో కలసి పనిచేస్తుంటాను. వారి ప్రకటనలకు నా వాయిస్ ఇస్తాను. కార్పొరేట్ ఈవెంట్లకు సైతం యాంకరింగ్  చేస్తుంటాను. జీ తెలుగు సినిమా అవార్డ్స్‌కి కూడా హోస్ట్ చేశాను.’


తాను కోరుకొన్న అవకాశం దక్కినప్పటికీ.. తన గమ్యం ఇది కాదని ఆమెకు అనిపిస్తూ ఉండేదట. తన గమ్యం ఏంటో తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు విద్య. యూట్యూబర్‌గా, కార్పొరేట్ ఈవెంట్ హోస్ట్‌గా, మ్యూజిక్ బ్యాండ్ మేనేజర్‌గా, వాయిస్ ఆర్టిస్ట్ గానూ పనిచేశారు. ఆర్జేగా పనిచేస్తూనే వీటన్నింటిలోనూ విజయవంతంగా రాణించారు. తన తండ్రి శివలెంక కృష్ణ‌ ప్ర‌సాద్‌ నిర్మించిన "సమ్మోహనం" సినిమాకు పబ్లిసిటీ స్ట్రాటజిస్ట్‌గా పనిచేశారు. "జెంటిల్ మెన్" సినిమా పబ్లిసిటీలోనూ కీలకపాత్ర పోషించారు. ఒకేసారి ఇన్ని పనులు చేయడమంటే మాటలా? దానికి ఎంత ఓర్పు కావాలి? ఎంత ఒత్తిడిని భరించాలి?  


అందుకే కొన్ని రోజుల పాటు ఈ పనులన్నింటి నుంచి తనకు తానుగా బ్రేక్ తీసుకొన్నారు. దాదాపు ఏడాది పాటు తీసుకొన్న విరామంలో తనను తాను తెలుసుకోవడంతో పాటు.. ఓ ఇంటివారు కూడా అయ్యారు. ట్రావెలింగ్ అంటే ఇష్టం లేకపోయినా రెండు దేశాలను చుట్టి  వచ్చారు. చివరికి తనేంటో, తనకు కావాల్సిందేంటో గుర్తించారు. ఇక తాను తీసుకొన్న బ్రేక్‌ను బ్రేక్ చేసేశారు. తిరిగి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే ఈ సారి ఆర్జేగా మాత్రం కాదు. బ్యాండ్ మేనేజర్‌గా.. ఈవెంట్ హోస్ట్‌గా. ప్రస్తుతం "మిరాకీ" అనే మ్యూజిక్ బ్యాండ్‌కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో కాప్రిసియో అనే బ్యాండ్ మేనేజర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ రెండు బాధ్యతలే నిర్వహిస్తున్నప్పటికీ.. ఏదైనా ఎక్సైటింగ్ ఆఫర్ వస్తే ఆ బాధ్యతలు కూడా చేపడతానంటున్నారు.


4-vidya-sivalenka


ఈ సందర్భంలో విద్య శివలెంక మనందరికీ ఓ విషయాన్ని చెబుతున్నారు. ‘ప్రతిఒక్కరూ తమ బిజీ బిజీ రొటీన్ నుంచి కాస్త విరామం తీసుకొని.. మీతో మీరు సమయం గడపాల్సిందే. అప్పుడే మనం ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? అనే విషయం తెలుస్తుంది.’ అంటున్నారు విద్య శివలెంక. సినీ నిర్మాతగా పనిచేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ.. అదెంత వరకు సాధ్యమవుతుందో భవిష్యత్తే నిర్ణయిస్తుందని అంటున్నారు ఆర్జే విద్య.


నిర్మాత శివలెంక కృష్ణ‌ ప్రసాద్ గారి అమ్మాయి విద్య అని అనడం కంటే.. ఆర్జే విద్యగా పిలిపించుకోవడానికే ఇష్టపడతానంటోన్న ఆమె నేటితరం అమ్మాయిలకు అమూల్యమైన సూచన ఇస్తున్నారు. ‘అమ్మాయిలు ఎంచుకొన్న రంగం ఏదైనాసరే.. అందులో రాణించాలంటే కుటుంబ సభ్యుల తోడ్పాటు అవసరం. సాధారణంగా అమ్మాయిలు కెరీర్ ఎంచుకొనే విషయంలో చాలా పరిమితులుంటాయి. వాటిని దాటి మీరు కెరీర్ ఎంచుకొన్నప్పుడు.. దాని విషయంలో మీకు క్లారిటీ ఉన్నప్పుడు మీ అమ్మానాన్నలను కూర్చోబెట్టి దాని గురించి వివరించండి. వారు కచ్చితంగా ఒప్పుకొంటారు. మీకు సహకారం అందిస్తారు. వారి సహకారానికి మీ కష్టం కూడా తోడైతే.. ఎలాంటి ఒత్తిడికి గురవకుండా కెరీర్లో రాణించగలుగుతాం’ అని చెబుతున్నారు విద్య.


తండ్రి సినిమా కోసం.. మెగాఫోన్ పట్టుకున్న కూతురు..!


చదరంగం.. నా జీవితంలో అంతర్భాగం: పద్మశ్రీ గ్రహీత హారిక ద్రోణవల్లితో ముఖాముఖి


అమ్మాయిలను మనుషులుగా చూడండి.. మార్పు అదే వస్తుంది: నీలిమ పూదోట