వర్షాకాలం ట్రిప్‌ కి వెళ్లాలా? మన రాష్ట్రాల్లోనే ఉన్న వీటిపై ఓసారి లుక్కేయండి. | POPxo

వర్షాకాలం ట్రిప్‌‌కి వెళ్లాలా? మన రాష్ట్రాల్లోనే ఉన్న వీటిపై ఓసారి లుక్కేయండి

వర్షాకాలం ట్రిప్‌‌కి వెళ్లాలా? మన రాష్ట్రాల్లోనే ఉన్న వీటిపై ఓసారి లుక్కేయండి

వర్షాకాలం (Monsoon).. ప్రతి ఒక్కరికీ నచ్చే కాలం ఇది. వానలు బాగా పండి పచ్చని దుప్పటితో ప్ర‌కృతి పరవశించే కాలం. చెరువులు, కుంటలు నిండి నీటితో కలకలలాడే కాలం.. ఇలాంటి అద్భుతమైన కాలంలో అవుటింగ్‌కి వెళ్లడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఈ వెళ్లే ప్రాంతాలు కూడా ఏదో సాధారణంగా వెళ్లి తిరిగొచ్చే ప్రదేశాలు (Places) కాకుండా.. చక్కగా మీరు వర్షాకాలం మజాను ఆస్వాదించేలా ఉండాలనుకుంటున్నారా? అయితే ప్ర‌కృతితో నిండిన ప్రదేశాలను మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నో ప్రదేశాలు.. వానాకాలంలో అబ్బురపరిచేలా కనిపిస్తూ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.

Tripoto
Tripoto

1. హార్స్ లీ హిల్స్

హార్స్ లీ హిల్స్ చిత్తూరు జిల్లాలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన బ్రిటిష్ కలెక్టర్ డబ్య్లు.డీ హార్స్ లీ పేరుతో అందరికీ పరిచితమైందీ హిల్ స్టేషన్. ఎండాకాలంలోనూ చల్లగా ఉండే ఈ ప్రాంతం.. ఇక వానాకాలంలో అయితే ప్ర‌కృతి అందాలతో నిండిపోయి కనిపిస్తుంది. వానాకాలంలో ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుందట. కొండపై చల్లని గాలి.. చుట్టూ పచ్చని ప్ర‌కృతి.. పక్షులు, సీతాకోక చిలుకలు.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి.

దాని అందాల గురించి తెలుసుకోవాలంటే ఓసారి తప్పక చూడాల్సిందే. ఇక్కడి కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంక్చుయరీ కూడా అద్భుతమైన సీనరీలతో ఆకట్టుకుంటుంది. ట్రెక్కింగ్, అడ్వెంచర్ లవర్స్‌కి ఇది మంచి ప్రదేశం. తిరుపతి నుంచి 128 కిలోమీటర్లున్న ఈ ప్రదేశానికి రైలు, రోడ్డు మార్గాల్లో వెళ్లవచ్చు. రైల్లో అయితే ములకల చెరువు స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలి. తిరుపతి, మదనపల్లి నుంచి ఇక్కడికి బస్సులు తరచూ ఉంటాయి.

Tripoto
Tripoto

2. అరకు లోయ

మన రాష్ట్రంలోని టూరిస్ట్ డెస్టినేషన్స్ గురించి మాట్లాడుకుంటుంటే అందులో వైజాగ్, అరకులోయ మాట రాకుండా ఉంటుందా? ఇది వర్షాకాలంలో చాలా అద్భుతమైన అనుభూతినిచ్చే ట్రిప్‌గా మిగిలిపోతుంది. తూర్పు కనుమల్లో ఉన్న ఈ లోయ వైజాగ్‌కే కాదు.. ఆంధ్రప్రదేశ్‌కే గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్. ప్ర‌కృతి ప్రేమికులకు ఇదో పెద్ద స్వర్గం లాంటిది. అంతేకాదు.. గిరిజన సంస్కృతీ,సంప్రదాయాలు, కళలు చూడాలన్నా ఇక్కడికి వెళ్లాల్సిందే.

ఇక్కడి బొటానికల్ గార్డెన్స్, దీనికి దగ్గర్లోనే ఉన్న కాఫీతోటలు, జలపాతాలు అన్నీ ఆకర్షించేవే. దగ్గర్లోనే కటికి జలపాతాలు కూడా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి 132 కిలోమీటర్లు ఉన్న అరకుకి చేరుకోవడం కోసం రైలు, రోడ్డు మార్గాలున్నాయి. కానీ ట్రైన్ మాత్రం ఉదయాన్నే ఉంటుంది. రైల్లో బొర్రా గుహల వరకూ వెళ్లి వాటిని చూసి అరకు లోయ ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు కూడా.

Tripoto
Tripoto

3. ఎత్తిపోతల జలపాతం

హైదరాబాద్ నుంచి కేవలం మూడు గంటల పాటు ప్రయాణిస్తే చాలు.. ఎత్తిపోతల జలపాతాన్ని చేరుకోవచ్చు. వర్షాకాలంలో వెళ్లగలిగే ప్రదేశాల్లో ఇది ముందుంటుంది. నది 70 అడుగుల పై నుంచి కింద పడే దృశ్యం కళ్లు తిప్పుకోనివ్వదు. దీన్ని మీ కెమెరా కంటిలో మీరు బంధించాలనుకోవడం ఖాయం. కృష్ణా నదికి ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉన్న ఈ జలపాతం గుంటూరు జిల్లాలో ఉంది. వానాకాలంలో నిండుగా నది పరవళ్లు తొక్కుతుంటే చూసేందుకు చాలామంది ఈ ప్రదేశానికి వస్తుంటారు. అందంతో పాటు శక్తికి నిదర్శనంగా కనిపిస్తుందీ జలపాతం. ట్రెక్కింగ్‌కి, క్యాంపింగ్‌కి కూడా ఇది మంచి ప్రదేశం. ఇక్కడికి హైదరాబాద్, గుంటూరు నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.

ట్రెక్కింగ్ సాహసాలు చేసేద్దాం.. ఈ ప్రదేశాలు సందర్శించేద్దాం..!Tripoto
Tripoto

4. తలకోన అడవి

తలకోన జలపాతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఎత్తైన జలపాతంగా పేరొందింది. చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ జలపాతం చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అడవితో అద్బుతంగా కనిపిస్తుంది. నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడే ఈ ప్రదేశానికి తిరుపతి, పీలేరు నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ అడవి జంతువులు ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి.. సాయంత్రం 4.30 తర్వాత దీన్ని చూసేందుకు అనుమతి లేదు. దీని పక్కనే ఉన్న నెలకోన జలపాతం, రామలక్ష్మణుల చెట్లు, దేవాలయాలు చూడాల్సినవే.

Tripoto
Tripoto

5. నాగార్జున సాగర్

తెలంగాణలోని ప్రముఖ జలాశయాల్లో నాగార్జున సాగర్ ముఖ్యమైంది. నల్గోండ జిల్లాలో ఉన్న ఈ డ్యామ్‌ని కృష్ణా నదిపై నిర్మించారు. దేశంలోనే రెండో అతి పెద్ద రిజర్వాయర్ ఇది. టూరిజం విభాగం వారు ఇక్కడ ఏర్పాటు చేసిన చక్కటి వ్యూ పాయింట్స్ నుంచి నది అందంగా కనిపిస్తుంది. ఇక వర్షకాలం డ్యామ్ నిండిన తర్వాత గేట్లు తీసినప్పుడు.. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడికి హైదరాబాద్ నుంచి బస్సులు నడుస్తుంటాయి. కేవలం జలాశయం మాత్రమే కాదు.. నది మధ్యలో ఉన్న నాగార్జున కొండ.. అక్కడి మ్యూజియం మనల్ని ఆకట్టుకుంటాయి.

Tripoto
Tripoto

6. కుంటాల జలపాతం

అదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ జలపాతం ఎంతో అందంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇది చాలా అద్భుతమైన జలపాతం అని చెబుతుంటారు. కడెం నదిపై ఉన్న ఈ జలపాతం రెండు భాగాలుగా కిందకు ప్రవహిస్తుంది. 147 అడుగుల పై నుంచి నీళ్లు పడుతుంటే చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది తెలంగాణలోనే అతి ఎత్తయిన జలపాతం. జలజల పారే నీళ్లతో, దట్టమైన అడవులతో ఆకట్టుకుంటుంది. జలపాతం కింద భాగం బండరాయితో ఉండడం వల్ల.. చాలామంది అందులో దిగి నీళ్లలో ఈదుతూ ఆనందిస్తుంటారు. కానీ ఈ నీళ్లలో ఈదడం ప్రమాదం. ఈ జలపాతంలో శకుంతల స్నానం చేసేదని.. అందుకే దీనికా పేరు వచ్చిందని చెబుతారు. దీనితో పాటు ఇక్కడున్న సోమన్న గుండం కూడా చూడాల్సిన ప్రదేశమే. అదిలాబాద్ నుంచి ఇక్కడికి చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి.

7. అనంతగిరి కొండలు

హైద‌రాబాద్‌కి ద‌గ్గ‌ర్లో ఉన్న ప్ర‌దేశాల్లో ఒక‌రోజు ట్రిప్‌‌కి చ‌క్క‌టి ఎంపిక అనంత‌గిరి కొండ‌లు. హైద‌రాబాద్ శివార్లోని వికారాబాద్ వ‌ద్ద ఉన్న ఈ ప్ర‌దేశం ప్ర‌కృతి అందాల‌కు పెట్టింది పేరు. హైదరాబాద్‌కి 70 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఈ ప్ర‌దేశానికి ఉద‌యం వెళ్లి సాయంత్రం తిరిగి రావ‌చ్చు. ఉద‌యం కాస్త తొంద‌ర‌గా వెళ్తే రోజంతా ప్ర‌కృతి ఒడిలో గ‌డిపే వీలుంటుంది. ఇక్క‌డ రాత్రి బ‌స‌కు మ‌రీ ఎక్కువ ఏర్పాట్లు లేక‌పోవ‌డంతో డే ట్రిప్‌కి మాత్ర‌మే ఇది అనుకూలం. లేదంటే మీరే టెంట్లు తీసుకెళ్లి క్యాంపింగ్ చేసే వీలు కూడా ఉంది.

అనంత‌గ‌రి కొండ‌ల్లోని అనంత ప‌ద్మ‌నాభ స్వామి దేవాల‌యాన్ని చూసి కొండ‌ల్లో, గుట్ట‌ల్లో ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో మునిగి ఆనందం పొంద‌వ‌చ్చు. వర్షాకాలంలో పచ్చటి ప్ర‌కృతి అందాలను చూసి ఆనందించేందుకు ఇది చక్కటి ఎంపిక. అక్క‌డి నుంచి కేవ‌లం ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న చెరువు ద‌గ్గ‌రికి వెళ్ల‌డం మ‌ర్చిపోవ‌ద్దు. అనంత‌గిరికి హైదరాబాద్ నుంచి బ‌స్సులు అందుబాటులో ఉంటాయి. కావాలంటే బైక్ లేదా కార్లో కూడా వెళ్ల‌వ‌చ్చు.

రెయినీ సీజన్‌ని.. రొమాంటిక్‌గా ఎంజాయ్ చేయడం ఎలాగో తెలుసా..?Tripoto
Tripoto

8. పాకాల చెరువు

వరంగ‌ల్ జిల్లాలో ఉన్న ఈ పాకాల చెరువు, వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణా కేంద్రం ప్ర‌కృతి అందాల‌తో అంద‌రినీ ఆక‌ర్షిస్తుంది. ఇక్క‌డే రాత్రి కూడా ఉండే వీలుంది కాబ‌ట్టి.. ముందు రోజు రాత్రి అక్క‌డికి వెళ్లి ఉద‌యాన్నే ట్రిప్‌ని ప్రారంభించ‌డం వ‌ల్ల స‌మ‌యం క‌లిసొస్తుంది. పాకాల చెరువు ద‌గ్గ‌ర క‌ళ్లు తిప్పుకోలేని ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించే వీలుంటుంది. ప్ర‌భుత్వం ఇందులో బోటింగ్‌కి కూడా ఏర్పాట్లు చేసింది కాబ‌ట్టి.. ఇద్ద‌రూ జంట‌గా చెరువులో బోటింగ్ కూడా చేయ‌వ‌చ్చు. ఇక్క‌డ ప‌క్షులు, జంతువుల‌ను చూస్తూ రోజంతా గ‌డ‌ప‌వ‌చ్చు.

మీకు ఫొటోలంటే ఇష్ట‌మైతే మీకోసం ఇది చ‌క్క‌టి ప్ర‌దేశం. మంచి సీన‌రీలాంటి అంద‌మైన ప్ర‌దేశాల‌తో ఫొటోల్లో అందంగా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నించండి. వరంగ‌ల్ నుంచి 50 కిలోమీట‌ర్లు ఉన్న ఈ ప్ర‌దేశానికి రోడ్ ట్రిప్‌లో కారు లేదా బైక్ పై వెళ్ల‌వ‌చ్చు. వ‌రంగ‌ల్ నుంచి ఇక్క‌డికి వెళ్లేందుకు బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.

Tripoto
Tripoto

9.శ్రీశైలం

చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, అందమైన జలపాతాలతో పాటు శ్రీశైలం వెళ్తే ఆధ్యాత్మికంగానూ ట్రిప్ చేసి రావచ్చు. శ్రీశైల దేవస్థానంతో పాటు అక్కడి జలాశయం అందాలు కూడా చూసి.. నల్లమలలో ఉన్న పాతాల గంగ, పాలధార, పంచధార, భీముని కొలను వంటివన్నీ చూడొచ్చు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవి మధ్యలో ప్రయాణిస్తుంటే దట్టమైన అడవి అందాలు ఆకట్టుకుంటాయి.ట్రిప్‌ మధ్యలో మల్లెల తీర్థం జలపాతాన్ని కూడా చూసి వెళ్లే వీలుంటుంది. అయితే రాత్రి పూట ఈ దారిలో వెళ్లేందుకు అనుమతి లేదు. గుంటూరు నుంచి దోర్నాల మీదుగా ప్రయాణం చేయచ్చు.

వాలెంటైన్స్ డే రోజున.. ప్ర‌కృతితోనూ ప్రేమ‌లో ప‌డిపోండి..Tripoto
Tripoto

10. పాపికొండలు

రెండు కొండ‌ల మ‌ధ్య‌లో న‌ది పారుతుంటే ఎంతో అందంగా ఉంటుంది క‌దా.. మ‌రి, ఆ అందాల న‌దిలో బోట్‌లో వెళ్తుంటే ఇంకెంత అందంగా ఉంటుందో.. ఇలాంటి చ‌క్క‌టి అనుభ‌వాన్ని సొంతం చేసుకోవాలంటే పాపికొండ‌ల‌కు బోట్ ట్రిప్ మంచి ఎంపిక‌. పేరంటాల ప‌ల్లిలో గిరిజ‌నుల‌తో ఆట‌పాట‌లు, కొల్లూరులో వెదురుతో చేసిన గుడిసెల్లో బ‌స, చ‌క్క‌టి అందమైన న‌ది, చుట్టూ ప్ర‌కృతిలో బోటు ప్ర‌యాణం ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. సన్నగా వర్షం పడుతుంటే ఈ ప్రదేశం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. భ‌ద్రాచలం లేదా రాజ‌మండ్రి వెళ్లి అక్క‌డి నుంచి పాపికొండ‌ల‌కు వెళ్లే వీలుంది. ఈ ప్ర‌దేశానికి రెండు రోజుల ట్రిప్‌ ప్లాన్ చేసుకుంటే ఎలాంటి హ‌డావిడి లేకుండా అన్ని ప్ర‌దేశాల‌ను తీరిగ్గా చూసే వీలుంటుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Featured Image : Instagram

Read More from Lifestyle
Load More Lifestyle Stories