Budget Trips

హైదరాబాద్ ట్రెండ్స్: సాలార్‌జంగ్ మ్యూజియంలోని ‘మ్యూజికల్ క్లాక్’ గురించి 11 అద్భుత విషయాలు

Sandeep Thatla  |  Sep 11, 2019
హైదరాబాద్ ట్రెండ్స్: సాలార్‌జంగ్ మ్యూజియంలోని ‘మ్యూజికల్ క్లాక్’ గురించి 11 అద్భుత విషయాలు

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ప్రముఖ పర్యాటక స్థలాల్లో సాలార్ జంగ్ మ్యూజియం (Salar Jung Museum)  కూడా ఒకటి. ఆ మ్యూజియం చూడడానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా.. అందులో ఉండే మ్యూజికల్ క్లాక్‌ని చూడాలని.. దాని గురించి తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు, అబ్బురపడుతుంటారు. పర్యాటకులని అంతలా ఆకట్టుకునే ఈ మ్యూజికల్ క్లాక్ (Musical Clock) గురించిన విశేషాలు ఇప్పుడు POPxo పాఠకులకు ప్రత్యేకం

మీకు “వీసా దేవుడు – చిలుకూరు బాలాజీ” గురించి ఈ విశేషాలు తెలుసా…!

* ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్ సాలార్ జంగ్‌ మ్యూజియంలోని ఈ మ్యూజికల్ క్లాక్.. 19వ శతాబ్దంలో తయారుచేయబడిందట.

* ఈ మ్యూజికల్ క్లాక్ దాదాపు 350 విడి భాగాల సమాహారం.

* ఇంగ్లాండ్‌లో తయారుచేసిన ఈ విడి భాగాలని మ్యూజికల్ క్లాక్‌గా బిగించింది మాత్రం కలకత్తాలోనే.

* ఇక ఈ మ్యూజికల్ క్లాక్‌ని చూసి ముచ్చటపడి… కుకీ & కెల్వి కంపెని వద్ద నుండి సాలార్ జంగ్ III అయిన మిర్ యూసఫ్ అలీ ఖాన్ కొనుగోలు చేయడం జరిగింది.

* 1949లో వరక అనగా.. మిర్ యూసఫ్ అలీ ఖాన్ మరణించే వరకు కూడా.. ఆయన ఆధీనంలోనే ఈ మ్యూజికల్ క్లాక్ ఉండేదట.

* సాలార్ జంగ్ III  మిర్ యూసఫ్ అలీ ఖాన్ తన జీవిత కాలంలో సేకరించిన వస్తువులను అన్నీ ఒక చోట చేర్చి.. ఒక మ్యూజియాన్ని నిర్మించారు. ఈ క్రమంలో ఈ  మ్యూజికల్ క్లాక్‌‌ను కూడా.. సాలార్ జంగ్ మ్యూజియంలోనే ఏర్పాటు చేయడం జరిగింది.

* ఇక ఈ మ్యూజికల్ క్లాక్ ప్రత్యేకత ఏమిటంటే – ప్రతి గంటకి మూడు నిమిషాల ముందు లోపలి నుండి గడ్డంతో ఉండే ఒక పొట్టి వ్యక్తి బొమ్మ బయటకి వస్తుంది. సరిగ్గా నిమిషాల ముల్లు 12 దాటగానే.. అప్పుటి సమయాన్ని బట్టి అన్ని గంటలు కొట్టి మళ్లీ లోపలికి వెళ్లిపోతుంది ఆ బొమ్మ. ఉదాహరణకి అప్పటి సమయం మధ్యాహ్నం 3 గంటలు అయితే.. అప్పుడు అది వచ్చి మూడు గంటలు కొట్టడం జరుగుతుంది.

* చాలా మంది పర్యాటకులు ఈ మ్యూజికల్ క్లాక్‌ని.. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు చూసేందుకు ఇష్టపడుతుంటారు. కారణం ఆ సమయంలోనే లోపల నుండి వచ్చిన ఆ బొమ్మ సరిగ్గా 12 గంటలు కొడుతుంది. అలా ఎక్కువసేపు ఆ బొమ్మని చూసేందుకు వీలవుతుంది కాబట్టి.. అదే సమయానికి ఎక్కువమంది జనాలు వస్తుంటారు. అందుకే మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ రద్దీగా ఉంటుంది.

హైదరాబాద్ ట్రెండ్స్: భాగ్యనగరంలోని.. రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ పాయింట్స్ ఇవే..!

 

 

* ఇక గంటలు కొట్టడానికి లోపల నుండి వచ్చే బొమ్మ ఒక్కటే కాకుండా.. అలాగే ఉండే మరొక బొమ్మ మనకి కనిపిస్తుంటుంది. అది సెకండ్స్ ముల్లుని కొడుతూ ఉంటుంది.

* ఇవే కాకుండా, ఈ క్లాక్‌లో రోజు, తేదీ, నెలని తెలియచేసేందుకు.. మూడు ప్రత్యేకమైన చిన్న క్లాక్స్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది.

* ఈ మ్యూజికల్ క్లాక్ పూర్తిగా మెకానికల్‌‌గా పనిచేస్తుంది. ఇందులో ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేవు.

అలాగే ఈ క్లాక్‌‌తో పాటుగా.. మరెన్నో పురాతన వస్తువులు మనం ఈ సాలార్ జంగ్ మ్యూజియంలో చూడవచ్చు. దాదాపు 11 లక్షల వస్తువులను ఈ మ్యూజియంలో భద్రపరిచారట. నవాబు తన కాలంలో వివిధ దేశాల నుండి సేకరించిన రకరకాల వస్తువులను ఇక్కడ భద్రపరచడం జరిగింది.

మిర్ యూసఫ్ అలీ ఖాన్ తాను ..హైదరాబాద్‌కి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వివిధ ప్రదేశాలకి వెళ్లిన సమయంలో.. అక్కడి నుండి సేకరించిన వస్తువులను తీసుకొచ్చి తన నివాసంలో భద్రపరిచేవాట.

ఆ వస్తువులన్నీ ఇప్పుడు ఈ మ్యూజియంలో కనిపిస్తాయి. అయితే ఆయన సేకరించిన వాటిల్లో.. కేవలం సగం మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉండగా.. మిగతావి ఆయన క్రింద పనిచేసేవారు తస్కరించారని కొందరు అంటుంటారు.

ఏదేమైనా.. హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రతి ఒక్కరు చూడాలనుకునే పర్యాటక స్థలం – సాలార్ జంగ్ మ్యూజియం. ఇక ఆ మ్యూజియంలో అన్నిటికన్నా ఎక్కువగా ఆకర్షించేది.. ఈ మ్యూజికల్ క్లాక్ కావడం విశేషం. ఆ మ్యూజికల్ క్లాక్‌‌కి సంబంధించిన ఆసక్తికర అంశాలు మీరు కూడా తెలుసుకున్నారు కదా..

మరింకెందుకు ఆలస్యం.. వీలైనంత త్వరగా మీరు కూడా హైదరాబాద్ వెళ్లి.. ఆ మ్యూజికల్ క్లాక్‌ని సందర్శించండి.

రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే..!

Featured Image: Remote Traveler and Wikimedia Commons

Read More From Budget Trips