Life

జీలకర్ర-బెల్లం, అరుంధతీ నక్షత్రం.. పెళ్లి తంతు వెనుక ఉన్న అంతరార్థం ఇదే..

Lakshmi Sudha  |  May 6, 2019
జీలకర్ర-బెల్లం, అరుంధతీ నక్షత్రం.. పెళ్లి తంతు వెనుక ఉన్న అంతరార్థం ఇదే..

రెండు కుటుంబాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి పెళ్లి (marriage) ద్వారా ఒక్కటవుతున్నారంటే.. అది ఒక ఉత్సవమనే చెప్పుకోవాలి. మూడు రోజులు, ఐదు రోజులు, పదహారు రోజులు ఇలా ఎవరి కుటుంబ ఆచారాలు, సంప్రదాయాలకు తగినట్లుగా వారు వివాహాన్ని జరిపిస్తారు. బంధుమిత్రులంతా ఒక్కచోట చేరి వధూవరులను ఆశీర్వదిస్తారు. భారతీయ వివాహ పద్ధతుల్లో తెలుగు పెళ్లికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందనే చెప్పుకోవాలి. అసలు తెలుగింట్లో పెళ్లి హడావుడి ఎప్పుడు మొదలవుతుంది? పెళ్లిలో ఏం చేస్తారు? ఎలాంటి సంప్రదాయాలు పాటిస్తారు? ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకొందాం.

1. పెళ్లి చూపులు

తెలుగు వారింట పెళ్లి హడావుడి ఇక్కడి నుంచే మొదలవుతుంది. సంప్రదాయం ప్రకారం అమ్మాయి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతాయి. ప్రేమ వివాహం చేసుకొంటున్నప్పటికీ సంప్రదాయాన్ని అనుసరించి వివాహం చేసుకోవాలనుకొనేవారు కూడా ఈ పెళ్లి చూపులను ఏర్పాటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. పెళ్లి చూపుల్లో అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చితే కట్నకానుకల విషయాల గురించి చర్చించుకొంటారు. కట్నం ఇవ్వడం నేరమని తెలిసినప్పటికీ అటు అమ్మాయి వారు… ఇటు అబ్బాయి తరఫువారు సైతం వీటి విషయంలో ప్రత్యేక ఆసక్తిని కనబరచడం ఒకింత ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది. ముఖ్యంగా చదువుకొన్నవారు కూడా ఇలా ప్రవర్తించడం కాస్త బాధగానూ ఉంటుంది. అయినా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి.

2. నిశ్చయతాంబూలాలు

పెళ్లి చూపుల్లో అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి నచ్చి రెండు పక్షాల వారికీ మాట కుదిరితే నిశ్చయతాంబూలాలకు ఏర్పాట్లు జరుగుతాయి. దీన్నే నిశ్చితార్థం అని కూడా అంటారు. కొన్ని చోట్ల తాంబూలాలు అని కూడా పిలుస్తారు. ఈ కార్యక్రమం ద్వారా పెళ్లిని ఖాయపరచుకొంటారు. ఇదే రోజున ఇరు పక్షాల వారి పెద్దలు, బంధువుల సమక్షంలో లగ్నపత్రిక రాయించి, తాంబూలాలు మార్చుకొంటారు. పెద్దలు కుదిర్చిన వివాహమైనా.. ప్రేమ వివాహమైనా.. నిశ్చితార్థం ఘనంగా జరిపిస్తారు.

3. విఘ్నేశ్వరుడికి బియ్యం

విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి బియ్యం, బెల్లం మూటగా కట్టి సమర్పిస్తారు. వివాహ క్రతువు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిస్తాడనే నమ్మకంతో ఇలా చేస్తుంటారు. విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టిన తర్వాత నుంచి పెళ్లి అయ్యే వరకు కుటుంబ సభ్యులెవరూ మాంసాహారం ముట్టుకోరు. విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టిన తర్వాతే పెళ్లి పనులు ప్రారంభిస్తారు. పెళ్లి శుభలేఖలు అచ్చువేయడం, పెళ్లి దుస్తులు, నగలు కొనుగోలు చేయడం, కల్యాణ మండపం బుక్ చేయడం అన్నీ దీని తర్వాతే చేస్తారు.

4. పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకును చేయడం

పెళ్లి రోజు లేదా పెళ్లికి ముందు ఆయా ప్రాంతాల సంప్రదాయాలను అనుసరించి పెళ్లికూతుర్ని చేయడం, పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం జరుగుతుంది. సాధారణంగా అబ్బాయిని పెళ్లి కొడుకుని చేసిన కాసేపటి తర్వాత అమ్మాయిని పెళ్లి కూతురిని చేస్తారు. ఇది ఎవరి ఇళ్లల్లో వారు జరుపుకొనే కార్యక్రమం. ఏడు, తొమ్మిది లేదా పదకొండు మంది నిండు ముత్తైదువలు(పేరంటాలు) కలిసి వధువుకు పసుపు రాసి, నలుగు పెట్టి కుంకుడు కాయలతో తలస్నానం చేయిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ స్నానానికి అవసరమైన నీటిని సైతం పేరంటాల్లే తీసుకొస్తారు. ఇలా చేయడం వల్ల వధూవరులకు మేలు జరుగుతుందని భావిస్తారు. మంగళస్నానం తర్వాత నూతన వస్త్రాలు ధరింపచేసి కల్యాణ తిలకం దిద్దుతారు. కాళ్లకు పసుపు రాసి, పారాణి అద్దుతారు.

5. గౌరీపూజ

పెళ్లికూతురుని చేసిన తర్వాత అమ్మాయితో గౌరీపూజను చేయిస్తారు. సంతాన, సౌభాగ్యాలను ప్రసాదించమని కోరుతూ గౌరీదేవికి పూజ చేస్తుంది వధువు.

6. పేరంటాలు పెట్టడం

పెళ్లి జరిగే రోజున ప్రత్యేకంగా పేరంటాలను పిలిచి వధువుతో లేదా వరుడితో కలిపి కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తారు. ఇది కూడా చాలా ముఖ్యమైనదే. వివాహం కోసం ఏర్పాటు చేసిన విందుతో పోలిస్తే ఇది ప్రత్యేకంగా ఉంటుంది. అరిసెలు, సున్నుండలు, జంతికలు ఇలా కొన్ని రకాల పిండివంటలు వండి వారికి వడ్డిస్తారు. వడ్డన పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు చేతుల మీదుగానే జరుగుతుంది. తినడం పూర్తయిన తర్వాత ఎంగిలి ఆకులను వధువు లేదా వరుడు ఎత్తుతారు. ఇలా చేస్తే వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఆ తర్వాత పేరంటాలకు తాంబూలం అందిస్తారు.

7. కాళ్లు కడగడం

వరుడి కాళ్లు కడగడానికి తెలుగు పెళ్లిళ్లలో చాలా ప్రత్యేకత ఉందనే చెప్పుకోవాలి. పెళ్లి మండపంలోకి అడుగు పెట్టే ముందు వరుడి కాళ్లను వధువు అన్నదమ్ములు కడగి వివాహ వేదికపైకి ఆహ్వానిస్తారు. తమ సోదరితో జీవితం పంచుకోబోతోన్న బావగారికి కాళ్లు కడగడానికి బావమరుదులు ఎగబడతారు. కన్యాదానం సమయంలో వరుడి కాళ్లను వధువు తల్లిదండ్రులు సైతం కడుగుతారు. ఇలా చేయడాన్ని వాళ్లు తప్పుగానూ, తక్కువగానూ భావించరు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు, శ్రీమహాలక్ష్మిలకు కల్యాణం చేస్తున్నట్టుగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ క్రతువును వధువు తల్లిదండ్రులు చాలా సంతోషంగా పూర్తి చేస్తారు.

8. జీలకర్ర -బెల్లం

పెళ్లిపీటలపై వధూవరులిద్దరూ ఒకరినొకరు చూసుకోరు. చూడనివ్వరు కూడా. వీరిద్దరికీ మధ్య తెరను అడ్డుగా ఉంచుతారు. జీలకర్ర – బెల్లం పెట్టిన తర్వాతే ఇద్దరూ ఒకరినొకరు చూసుకొంటారు. వాస్తవానికి పెళ్లిపత్రికల్లో అచ్చు వేసే ముహూర్త సమయానికి జీలకర్ర-బెల్లం ఒకరి తలపై మరొకరు ఉంచుతారు. ఇలా చేయడం వల్ల బ్రహ్మరంధ్రం తెరుచుకొంటుందని విశ్వసిస్తారు. పైగా జీలకర్ర బెల్లం పెట్టిన సమయంలోనే ఇద్దరూ ఒకరినొకరు చూసుకొంటారు. ఇలా చేయడం వల్ల వారి మధ్య అనుబంధం చిగురిస్తుందని భావిస్తారు.

9. మంగళసూత్ర ధారణ

జీలకర్ర – బెల్లం పెట్టిన తర్వాత మంగళసూత్ర ధారణ జరుగుతుంది. సాధారణంగా రెండు సూత్రాలను విడివిడిగా కడతారు. వీటిలో ఒకటి పుట్టింటి తరఫువారు ఇచ్చే సూత్రమైతే, మరొకటి అత్తింటివారు ఇచ్చే సూత్రం. పసుపు రాసిన దారపు పోగులకు సూత్రం (కొన్ని ప్రాంతాల్లో దీన్ని శతమానం అని కూడా పిలుస్తారు) గుచ్చి వాటిని కడతారు. మూడుముళ్లు వేయడం ద్వారా వధూవరులిద్దరికీ వివాహం జరిగిందని భావిస్తారు. కానీ వివాహ క్రతువు ఇంకా పూర్తయినట్లు కాదు. మూడు ముళ్లు వేసిన తర్వాత వరుడి ఉత్తరీయం, వధువు చీరకొంగు కలిపి బ్రహ్మముడి వేస్తారు. వారిద్దరి బంధం శాశ్వతంగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తూ ఈ బ్రహ్మముడి వేస్తారు. బ్రహ్మముడి వేసిన తర్వాత సప్తపది అంటే వధూవరులిద్దరూ కలిసి హోమగుండం చుట్టూ ఏడడుగులు వేస్తారు. అయితే ఈ సప్తపది కేవలం కొన్ని తెలుగు పెళ్లిళ్లలోనే మనకు కనిపిస్తుంది. ఇది కుటుంబ ఆనవాయితీ, వారు పాటించే సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది.

10. తలంబ్రాలు

వివాహ వేడుకల్లో చాలా సరదాగా సాగే ఘట్టం ఇది. వధూవరులిద్దరూ మొదట కొబ్బరి చిప్పలతో ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొంటారు. ఆ తర్వాత దోసిళ్లతో తలపై తలంబ్రాలు పోసుకొంటారు. దీని కోసం కడిగి ఆరబెట్టిన బియ్యాన్ని ఉపయోగిస్తారు. ఇది వధూవరుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.

11. ఉంగరాల ఆట

తెలుగు వివాహ వేడుకల్లో కనిపించే మరో సరదా ఘట్టం ఇది. బిందెలో బంగారు, వెండి ఉంగరాలను వేసి ఇద్దరినీ తియ్యమంటారు. ఎవరు బంగారు ఉంగరాన్ని తీస్తే వారు గెలిచినట్లు. ఇలా మూడుసార్లు ఉంగరాలు వేసి తియ్యమంటారు. మధ్యలో కొన్నిసార్లు ఉంగరాలు వేయకుండా వేసినట్లుగానే మాయ చేస్తారు పురోహితులు. దాని కోసం వధూవరులిద్దరూ వెతుక్కొంటుంటే.. పందిట్లో నవ్వులు పూస్తాయి. సాధారణంగా మూడుసార్లు ఉంగరాలను వేసి తీయమంటారు. ఎవరు ఎక్కువ సార్లు బంగారు ఉంగరాన్ని తీస్తే వారిది ఆ బంధంలో పై చేయిగా భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది వధూవరులిద్దరికీ మధ్య సాన్నిహిత్యం పెంచడం కోసం చేసే ప్రయత్నం.

12. అరుంధతీ నక్షత్రం

వివాహ కార్యక్రమంలో అరుంధతీ నక్షత్రాన్ని చూడటం చాలా ముఖ్యమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు. వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి. పెళ్లి సమయంలో అరుంధతీ నక్షత్రాన్ని దర్శించుకోవడం ద్వారా వారి సాంసారిక జీవితం సుఖంగా సాగిపోతుందని భావిస్తారు. అరుంధతీ నక్షత్రాన్ని మాత్రమే కాదు పక్కనే ఉన్న వశిష్ఠ నక్షత్రాన్ని కూడా దర్శించుకోమని చెబుతారు. ఆకాశంలో తూర్పు వైపున ఉండే ఈ రెండు నక్షత్రాలు చాలా దగ్గరగా ఉంటాయి.

ఇవే కాకుండా.. బాసికం కట్టడం, మెట్టెలు తొడగడం, నల్లపూసలు కట్టడం, అప్పగింతలు, సన్నికల్లు తొక్కడం, కాళ్లు తొక్కించడం, ఒడిబియ్యం ఇలా తెలుగు సంప్రదాయ పెళ్లిలో ఎన్నో అపురూపమైన ఘట్టాలుంటాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకం.

Read More From Life