లక్ష్మీ అగర్వాల్ (Laxmi Agarwal).. 14 ఏళ్ల క్రితం యాసిడ్ దాడికి గురైన బాధితురాలు. దీపికా పదుకొణె నటిస్తోన్న ఛాపాక్ చిత్రం ద్వారా ఈ మధ్య బాగా వార్తల్లో నిలిచిన లక్ష్మి.. తాజాగా మరోసారి సామాజిక మాధ్యమాల్లో నిలిచింది. ఆమె యాసిడ్ దాడికి గురై ఏప్రిల్ 22 నాటికి సరిగ్గా 14 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. తన మనసులోని భావాలకు అక్షరరూపం ఇచ్చింది లక్ష్మి.
2005లో తనపై జరిగిన యాసిడ్ దాడి సంఘటన మొదలుకొని.. ఆ తర్వాత ఆమె అనుభవాల గురించి సైతం ఆమె అందులో పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన బ్లాక్ & వైట్ ఫొటో షేర్ చేస్తూ లక్ష్మి ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం విశేషం. ఇంతకీ లక్ష్మి ఏం రాసిందంటే..
నా పై యాసిడ్ అటాక్ జరిగి నేటికి సరిగ్గా 14 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఇన్ని సంవత్సరాలుగా నా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే వాటిలో కొన్ని మంచివి ఉంటే ఇంకొన్ని బాధాకరమైనవి/ భయభ్రాంతులకు గురి చేసేవి కూడా ఉన‌్నాయి. వాటి గురించి ఇప్పుడు ఆలోచించినా నాకు భయం వేస్తూ ఉంటుంది.
సాధారణంగా యాసిడ్ దారికి గురైతే ఆ బాధితురాలి జీవితం మాత్రమే దాని వల్ల ప్రభావితం అవుతుందని అంతా అనుకుంటారు. కానీ అది పొరపాటు. ఆ బాధితురాలి కుటుంబ సభ్యులపై కూడా ఈ దాడి తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. దుండగుడు యాసిడ్ అటాక్ చేసింది ఒక్కసారే అయినా.. ఈ సమాజం మాత్రం వరుసగా అటాక్ చేస్తూనే ఉంటుంది. మనల్ని కుదురుగా బ్రతకనీయదు.
ఇలా యాసిడ్ దాడికి గురైన బాధితుల కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది డిప్రెషన్ బారిన పడడం వల్లో లేక జరిగిన ఘటన వల్ల కలిగిన బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు కూడా పాల్పడుతుంటారు. నా జీవితంలో ప్రతి సంవత్సరం ఈ తారీఖు తప్పకుండా వస్తుందని నాకు తెలుసు. కానీ దీని గురించి ఏటా ఆలోచించే కొద్దీ బాధ పెరగడం తప్ప ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు.
అంతేకాదు.. దాడి జరిగిన సమయంలో మా నాన్న, సోదరుడు నాకు అండగా నిలిచి ఎంతో సహాయం చేశారు. కానీ ఇప్పుడు వారు కూడా నా వెంట లేరు. అందుకే ఈ రోజు గురించి ఆలోచిస్తుంటే.. రానున్న సంవత్సరాల్లో నా జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అని భయమేస్తుంది. ఇంకెంత బాధని అనుభవించాలా అని అనిపిస్తుంది. కాబట్టే నా జీవితంలో నాకు జరిగినట్లుగా ఈ ప్రపంచంలో ఏ అమ్మాయికీ ఇలాంటి సంఘటనలు జరగకూడదని కోరుకుంటున్నా.
నా పై దాడి జరిగే నాటికి నా వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అప్పటికి నా మనసులో ఉన్న భావాల గురించి నా తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్లు నన్ను తప్పుగా అనుకుంటారేమో అని అనుకునేదాన్ని. అలా నేను నిశ్శబ్దంగా ఉండిపోవడం వల్లే నా మౌనాన్ని అడ్వాంటేజ్‌గా మార్చుకున్నాడు ఆ దుండగుడు. అందుకే ఈ పోస్ట్ ద్వారా నేను అందరికీ ఒకటి చెప్పదల్చుకున్నా.
అదేంటంటే- ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలని కోరుకుంటున్నా. అలాగే పిల్లలంతా తమ తల్లిదండ్రులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ సఖ్యంగా మెలగాలని ఆశిస్తున్నాను. అప్పుడే వారి మనోభావాలను ఎలాంటి భయం, బెరుకు వంటివి లేకుండా పంచుకునే వీలు ఉంటుంది..
#stopsaleacid
యాసిడ్ దారికి గురై ఆత్మవిశ్వాసంతో తిరిగి తన కాళ్లపై తాను నిలబడడమే కాకుండా.. తనలా మరే అమ్మాయి యాసిడ్ దాడికి బలి కాకూడదనే ఉద్దేశంతో లక్ష్మి స్టాప్ యాసిడ్ సేల్ పేరిట ఒక ప్రచారాన్ని ప్రారంభించి సోషల్ వర్కర్‌గానూ మారింది. ఆమె జీవిత కథ ఆధారంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు మేఘనా గుల్జార్ రూపొందిస్తోన్న చిత్రమే ఛాపాక్.
ఇందులో లక్ష్మి పాత్రలో దీపికా పదుకొణె నటిస్తుండగా; ఆమె భర్త ఆలోక్ పాత్రలో విక్రాంత్ మాసే నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో దీపిక పోషిస్తోన్న పాత్ర పేరుని మాలతిగా మార్చారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేయాలని భావిస్తోంది చిత్రబృందం. ఈ చిత్రంలో దీపిక కేవలం నటిగానే కాదు.. నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండడం విశేషం.
ఇవి కూడా చదవండి
లక్ష్మి నాకు ఒక ప్రేరణ.. ఆమె కథ నా మనసుకు దగ్గరైంది : దీపిక పదుకొణె
దీపిక అందమైన మైనపుబొమ్మను చూసి.. రణ్‌వీర్ ఏమన్నాడో తెలుసా?
దీపికా పదుకొణే రాజకీయాల్లోకి వస్తే.. ఏ శాఖ మంత్రి అవుతారో తెలుసా..?