జనవరి 26, 2019.. ఈ రోజు మన దేశం 70వ గణతంత్ర దినోత్సవాన్ని(Republic day) జరుపుకుంటుంది. ఇదే ప్రత్యేకమైన విషయం అంటే.. అంతకంటే ప్రత్యేకంగా.. ఎప్పుడు గుర్తుంచుకునేలా ఈ రోజును మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు మన మహిళా జవాన్లు. భారత పారామిలిటరీ దళాలు, అస్సాంరైఫిల్స్ చరిత్రలోనే మొదటిసారి పూర్తిగా మహిళలతోనే కూడిన ఓ పటాలం (All woman contingent) రాష్ట్రపతికి గౌరవ వందనం చేయడం విశేషం. ఇందులో కొందరు మహిళా జవాన్లు దేశం కోసం ప్రాణాలను అర్పించిన సైనికుల కుటుంబ సభ్యులు కావడం ఈ గౌరవ వందనానికి మరింత ప్రత్యేకతను జోడించింది. వీరిని భారత ఆర్మీ కారుణ్య నియామకాలలో నియమించింది.
Image: Twitter/Assam Rifles
ఈ రిపబ్లిక్ డే పటాలంలో 144 మంది జవాన్లతో పాటు ఇద్దరు ఆఫీసర్లు కూడా ఉన్నారు. దీనికి మేజర్ కుష్భూ కన్వర్ నాయకత్వం వహించి ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “భారత పారామిలిటరీ దళాలకు చెందిన మహిళా జవాన్ల పటాలం రాజపథ్ వద్ద మార్చ్ చేయడం చరిత్రలోనే ఇది మొదటిసారి. అయితే ఈ పటాలానికి చెందిన మహిళా జవాన్లు పురుష సైనికులతో పోల్చితే ఎందులోనూ తక్కువ కాదు. పురుషులకు ధీటుగా పనిచేయగలిగే శక్తిసామర్థ్యాలు వారి సొంతం. ఎందుకంటే ఈ జవాన్లు కూడా వారితో సమానంగా కఠిన శిక్షణ తీసుకున్నారు. అంతేకాదు.. ఈశాన్యరాష్ట్రాల్లో ఎదురైన తిరుగుబాట్ల సమయంలోనూ ఈ మహిళా రైఫిల్స్ అక్కడ పనిచేశారు” అని చెప్పుకొచ్చారు.
రైఫిల్ వుమన్ సునీతా థాపా సైన్యంలో పనిచేస్తూ మరణించిన తన భర్త స్థానంలో నియమితులయ్యారు. తన భర్త కలను నెరవేర్చేందుకే ఆయన స్థానంలోకి అడుగుపెట్టానని చెబుతారామె. ఐదు సంవత్సరాల చిన్నారికి తల్లైనా తన కర్తవ్యం కోసం ఇంటి నుంచి దూరంగా ఉంటున్నారామె. ఈ విషయంలో తన కుటుంబం తనకు ఎంతో అండగా నిలుస్తుందని చెబుతారు సునీత.
“మా కుటుంబం మొత్తం నన్ను చూసి ఎంతో గర్వపడుతుంది. అస్సాం రైఫిల్స్‌లో భాగమైనందుకు నేనూ ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. నా భర్త సైనికుడిగా ఎంతో అంకితభావంతో పనిచేసేవారు. సైన్యంలో పనిచేస్తూ ఆయన సెలవుపై ఇంటికి వచ్చినప్పుడు ఓ ప్రమాదంలో మరణించారు. సైనికుడిగా దేశానికి ఎంతో సేవ చేయాలని ఆయన భావించేవారు. ఇప్పుడు ఆయన భార్యగా తన ఆశయాలను నేను నెరవేర్చాలనుకుంటున్నా. నా కుటుంబం నాకు తోడుగా ఉంటుంది కాబట్టి అటు తల్లిగా, ఇటు సైనికురాలిగా నా బాధ్యతలను ఏమాత్రం ఇబ్బందిలేకుండా చక్కగా నిర్వర్తిస్తున్నా.. ఇప్పుడు ఈ పటాలంలో భాగం కావడం కూడా నాకు, నా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది..” అంటూ వివరించారు.
Image: Twitter/Assam Rifles
మరో రైఫిల్ వుమన్ గాయత్రీ శర్మ ఒకటిన్నర సంవత్సరాల కింద సైన్యంలో చేరారు. ఆమె 2001లో సైన్యంలో వీరమరణం పొందిన తన తండ్రి స్థానంలో నియమితులయ్యారు. తనకు మూడేళ్ల వయసున్నప్పుడే అస్సాం రైఫిల్స్ జవాన్ అయిన తన తండ్రిని కోల్పోయారామె. అస్సాం రైఫిల్స్ నుంచి సైన్యంలో చేరమని నాకు ఉత్తరం వచ్చినప్పుడే నా తండ్రిలా పూర్తి నిబద్ధతతో దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు ఇలా పూర్తి మహిళా పటాలంలో భాగమవడం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పత్‌లో మార్చ్ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని అందిస్తోంది అని చెప్పుకొచ్చారు.
ఈ మహిళా జవాన్లు కొద్దికొద్దిగా పరిస్థితిని మారుస్తూ.. కొత్త చరిత్రను సృష్టిస్తూ వస్తున్నారు. ఇటీవలే ఆర్మీ డే సందర్భంగా లెఫ్టినెంట్ భావనా కస్తూరి పూర్తిగా మగవాళ్లున్న పటాలానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించగా.. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ 144 మంది మహిళల పటాలం మరో ఘనతను సాధించింది. ఇలా ఒక్కో అడుగు వేస్తూ సైనిక దళాల్లోనూ తమ ఉనికి చాటుకుంటూ వెళ్తున్న మహిళా శక్తికి మనమూ నీరాజనాలు పలుకుదాం.
Featured Image: Twitter/Assam Rifles
ఇవి కూడా చదవండి.
ఆర్మీ పటాలానికి తొలి మహిళా నాయకురాలు భావనా కస్తూరి ..!
అగస్త్య పర్వతం ఎక్కింది.. ఆ ఘనత సాధించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది..!
ఆడపిల్లలు స్వేచ్ఛగా ఎదగాలంటే.. మూసధోరణులను వదిలేయాల్సిందే..!