అమృత(Amrutha), ప్రణయ్ (Pranay).. వీరిద్దరి గురించి వినని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండరేమో..! ప్రణయ్ పరువు హత్య అంత సంచలనం సృష్టించింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. అమృత అగ్రకులానికి చెందిన అమ్మాయి.. పైగా వారిది సంపన్న కుటుంబం కావడంతో దళితుడైన ప్రణయ్‌తో అమృత పెళ్లికి ఆమె తల్లిదండ్రులు ఏమాత్రం ఒప్పుకోలేదు.
అయినా పెద్దలను ఎదిరించి వారిద్దరూ గతేడాది జనవరి 30న వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే తన కళ్లముందే కూతురు దళితుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‌ను చంపించేందుకు కిరాయి హంతకులను పురమాయించాడు. గతేడాది సెప్టెంబర్ 14న అమృత కళ్లముందే ప్రణయ్‌ని దారుణంగా హతమార్చారు ఆ హంతకులు. ఈ హత్య కేవలం రెండు తెలుగు రాష్ట్రాల వారినే కాదు.. దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రణయ్ హత్య జరిగే సమయానికే ఐదో నెల గర్భంతో ఉన్న అమృతకు ఈ జనవరి 30న అంటే వారిద్దరి పెళ్లి రోజునే పండంటి మగ బిడ్డ పుట్టాడు.
ఈ సందర్భంగా అమృత తన బిడ్డ గురించి ప్రణయ్ చెబుతున్న ఓ వీడియోని ఫేస్‌బుక్ ద్వారా పంచుకుంది. ఇందులో ప్రణయ్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలోని డైలాగ్ చెబుతుంటాడు. “ఈ ఇరవై ఏళ్లు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క.. వాడి కొడుకు.. వాడి కొడుకొచ్చాడని చెప్పు..” అంటూ డబ్‌స్మాష్ చేస్తున్న ప్రణయ్ వీడియోను పోస్ట్ చేసి తనకు కొడుకు పుట్టాడని వెల్లడించింది అమృత. తమ పెళ్లి రోజునే పుట్టిన ఈ బిడ్డను ప్రణయ్ జ్ఞాపకంగా చూసుకుంటానని వెల్లడించింది. దీనికంటే ముందు వారిద్దరి పెళ్లిరోజు సందర్భంగా ప్రణయ్‌తో ఓ సందేశాన్ని పంచుకుంటున్నట్లు ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది
“మన పెళ్లయి ఈ రోజుకి సంవత్సరం. గతేడాది ఈ సమయానికి నీ చేయి పట్టుకోవడానికి ఎంతో ఆత్రంగా వేచి చూశాను. ఇప్పుడు మన బిడ్డను నా చేతులతో ఎత్తుకోవడానికి అంతే ఆత్రంగా వేచి చూస్తున్నా. ఈ కోరిక చాలా తొందరగా నెరవేరాలని ఆశిస్తున్నా. లవ్ యూ లల్లూ.. నిన్ను చాలా మిస్సవుతున్నా..” అంటూ పోస్ట్ చేసింది. ఇలా పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే అమృత ఆరోగ్యమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. “మా బిడ్డను కులం అనేది తెలియకుండా పెంచుతాను. కులాల ప్రమేయం లేని సమాజం కోసం ప్రణయ్ తరఫున నేను పోరాడుతున్నా. అలాంటి సమాజంలో ఇలాంటి హత్యలు ఏమాత్రం ఉండవు. ఈ బిడ్డను కుల పక్షపాతాలు లేని సమాజం కోసం పోరాడే యోధుడిగా తయారుచేస్తా..” అని వెల్లడించింది అమృత.
ఫిబ్రవరి 1న ప్రణయ్ పుట్టిన రోజు సందర్భంగా తమ బిడ్డతో దిగిన ఫొటోను అందరితో పంచుకుంది అమృత. ఈ ఫొటోతో పాటు “నీ మనసు స్వచ్ఛమైనది, ప్రేమ విలువైనది.. నీ తెలివి ఆశ్చర్యకరమైనది.. హ్యాపీ బర్త్‌డే నాన్న.. లవ్ యూ..” అంటూ తన కొడుకు తండ్రికి శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా పోస్ట్ చేసింది. దీనికంటే ముందు మరో పోస్ట్ చేసింది.. గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు.. ఇలా ఎంత సమయం గడిచిపోయినా నువ్వు నన్ను చేతుల్లోకి తీసుకొని, నా కళ్లలో కళ్లు పెట్టి, నా చెవిలో ఐ లవ్ యూ అని చెప్పిన నిమిషాలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. యు ఆర్ ద బెస్ట్. మిస్ యూ.. అంటూ పోస్ట్ చేసింది అమృత.
గతేడాది సెప్టెంబర్ 14న ప్రీనేటల్ చెకప్ కోసం వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ప్రణయ్‌ని కిరాయి గూండాలు దారుణంగా హత్య చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అమృత తండ్రి మారుతీరావుతోపాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఏడుగురికి కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.
తనకు ఏమాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమృత తన గ్రాండ్ రిసెప్షన్ ఫొటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం, అప్పుడే పిల్లలు వద్దు.. కెరీర్‌పై దృష్టి పెట్టమని చెప్పినా మాట వినకుండా తనకు కోపం తెప్పించిందని చెప్పిన మారుతీ రావు.. కూతురిపై ఉన్న ప్రేమతో ప్రణయ్ చనిపోతే తను ఇంటికి తిరిగొస్తుందని భావించానని చెప్పాడు. అందుకే కోటి రూపాయలు ఇచ్చి కిరాయి గూండాలతో ప్రణయ్‌ని హత్య చేయించానని ఒప్పుకున్న సంగతి తెలిసిందే.
2014 నుంచి 2015 మధ్య ఈ పరువు హత్యలు 796 శాతానికి పైగానే పెరిగాయట! తాజా గణాంకాలు ఇంకా తెలియరాలేదు కానీ రోజురోజుకీ ఇలాంటివి క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మానవ విలువల కంటే కులం, ఆస్తి, కుటుంబ పరువు వంటివి ఎక్కువ అనుకునేవారు ఇలాంటి సంఘటనలను చూసైనా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇవి కూడా చదవండి.
ఆడపిల్లలంటే ఎప్పుడూ ప్రత్యేకమే..! ఎందుకో మీకు తెలుసా??
అగస్త్య పర్వతం ఎక్కింది.. ఆ ఘనత సాధించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది..!