(Ten Grams free gold as Wedding Gift to Brides)
పెళ్లి.. ప్రతి అమ్మాయి జీవితంలో వచ్చే పెద్ద పండగ. ఆ రోజు ఏ అమ్మాయి అయినా.. అందరి కంటే అందంగా తయారవ్వాలని కోరుకుంటుంది. పట్టుచీర, ఆభరణాలతో నిండుగా కనిపించాలని అనుకుంటుంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఆడపిల్ల పెళ్లి అనేది.. తల్లిదండ్రులకు భారంగానే మారింది. ముఖ్యంగా పెళ్లి సమయంలో అమ్మాయి మెడలో వేసేందుకు.. కాస్త బంగారం ఉంటే బాగుంటుందని చాలామంది తల్లిదండ్రులు భావిస్తారు. కానీ పేదింట్లో అది కొన్నిసార్లు తీరని కోరికగానే మిగిలిపోతోంది. అందుకే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలకు పెళ్లి విషయంలో తమదైన రీతిలో సహాయం చేస్తున్నాయి.
మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే పెళ్లికి ముందుగానే.. వివాహ ఖర్చులకు సరిపోయేలా రూ. 1,00,116 లను కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా వధువులకు అందించడం మనకు తెలిసిందే. గతంలో యాభై వేలుగా ఉన్న ఈ మొత్తాన్ని ముందు రూ. 75000 చేసి.. ఆ తర్వాత లక్షగా మార్చారు.
పెళ్లి జరిగిన తర్వాత ఈ మొత్తాన్ని ఇవ్వడం వల్ల.. ఆ డబ్బు ఖర్చులకు అందట్లేదన్న ఉద్దేశంతో మరో పద్ధతికి కూడా శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. పెళ్లికి ముందే డబ్బు వధువుకి అందేలా.. అప్లై చేసిన వారం నుంచి పది రోజుల్లో అదే మొత్తాన్ని ఆమె ఖాతాలో జమ చేస్తోంది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే మొత్తాన్ని గతంలో చంద్రన్న పెళ్లి కానుక పేరుతో అందించగా.. ప్రస్తుతం ఈ పథకం వైఎస్సార్ పెళ్లి కానుకగా కొనసాగుతోంది. ఇదే కాకుండా వేరే రాష్ట్రాల్లో.. వివిధ రకాల పథకాలతో పాటు కులాంతర వివాహాలు చేసుకునేవారికి.. అంగవైకల్యం ఉన్నవారిని పెళ్లాడే వారికి కూడా ధన సహాయం చేస్తోంది ప్రభుత్వం. బాల్య వివాహాలను అడ్డుకుంటూ.. పేదింటి పెళ్లికి సాయం అందించే ఈ పథకాలకు అంతటా మంచి స్పందన లభిస్తోంది.
అందుకే ఇప్పుడు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి పథకాలనే తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం అస్సాం ప్రభుత్వం కూడా పద్దెనిమిదేళ్లు నిండిన అమ్మాయి పెళ్లికి పది గ్రాములు అంటే.. ఒక తులం బంగారం అందించనుండడం విశేషం. 2020 జనవరి 1 తేది నుండి ఈ పథకం అమల్లోకి రానుంది. ఈ పథకానికి అరుంధతి గోల్డ్ స్కీమ్ అని పేరు పెట్టారు. అయితే ఈ పథకానికి ఎంపిక కావాలంటే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి.
ఈ పథకానికి అర్హత సాధించాలంటే.. పెళ్లి కాబోయే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు ఉండాలి. కనీసం పదో తరగతి అయినా చదవాలి. అలాగే అమ్మాయి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.5 లక్షల కంటే తక్కువ ఉండాలి. పెళ్లిని రిజిస్టర్ చేసిన తర్వాత.. ఈ మొత్తాన్ని అమ్మాయి ఖాతాలో మాత్రమే వేయనుంది ప్రభుత్వం. ఈ పథకం అమల్లోకి తీసుకురావడానికి రెండు ముఖ్య కారణాలున్నాయని అంటోంది అక్కడి ప్రభుత్వం.
అస్సాంలో ప్రతి సంవత్సరం దాదాపు మూడు లక్షల వివాహాలు జరుగుతున్నాయట. కానీ అందులో కేవలం యాభై నుంచి అరవై వేల వరకు మాత్రమే వివాహాలు రిజిస్టర్ అవుతున్నాయట. రిజిస్టర్ కాని పెళ్లిళ్లలో.. ఎక్కువగా బాల్య వివాహాలే ఉంటున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందుకే దీనిని నివారించేందుకు.. ఆడపిల్లలను చదివించే దిశగా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. అందుకే వివాహ రిజిస్ట్రేషన్ పూర్తవ్వగానే.. అమ్మాయి ఖాతాలో తులం బంగారానికి సరిపోయేలా రూ. 30,000 జమ చేస్తామని అంటోంది ప్రభుత్వం
ఈ పథకం వల్ల అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి.. దాదాపు 800 కోట్ల రూపాయల వరకూ భారం పడుతుందని.. అయినా మహిళా సాధికారత, పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కోసం ఈ మొత్తాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని అస్సాం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిస్వశర్మ తెలియజేశారు. మొత్తానికి మన దేశంలో ఒక్కో రాష్ట్రం.. పెళ్లి సమయంలో నూతన వధువులకు ప్రయోజనాలు అందించడంలో ముందడుగు వేస్తూ.. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు కృషి చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.