Lifestyle

చామంతి టీ.. గురించి మీరెప్పుడైనా విన్నారా? రుచి చూశారా?

Lakshmi Sudha  |  Mar 26, 2019
చామంతి టీ.. గురించి మీరెప్పుడైనా విన్నారా?  రుచి చూశారా?

తెలుగు రాష్ట్రాల్లో టీ తాగే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది. చెప్పాలంటే అది వారి జీవనశైలిలో అంతర్భాగం. కాస్త తలనొప్పి వచ్చినా.. నీరసంగా అనిపించినా కప్పులో కాస్త టీ పడాల్సిందే. మీరు కూడా ఛాయ్ ప్రియులేనా? అయితే ఓ సారి చామంతి టీని(chamomile tea) ప్రయత్నించి చూడండి. గ్రీన్ టీ, అల్లం టీ, లెమన్ టీ, మసాలా టీ గురించి మాకు తెలుసు కానీ..  ఈ చామంతి పూలతో టీ ఏంటబ్బా?? విచిత్రంగా ఉంది అని ఆశ్చర్యపోతున్నారా?

నిజమేనండీ.. చామంతి పూలతో తయారుచేసిన టీ రుచిగా ఉండటం మాత్రమే కాదు. దానివల్ల ఆరోగ్యపరంగానూ, సౌందర్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో మనమూ తెలుసుకొని ఆరోగ్యంగా, అందంగా తయారైపోదాం.. ఏమంటారు?

చామంతి టీ వల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు:

చామంతి టీలో ఔషధగుణాలు పుష్కలంగా ఉంటాయి. మిగిలిన టీల మాదిరిగా దీనిలో కెఫీన్ ఉండదు. దీనిలో ఉన్న చామాజ్యులెన్ అనే రసాయనం బాధ నివారిణిగా పనిచేస్తుంది. రోజంతా పని ఒత్తిడిలో మునిగిపోయిన వారు ఓ కప్పు చామంతి టీ తాగితే మంచి ఉపశమనం కనిపిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు చామంతి టీ తాగడం వల్ల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. బరువు తగ్గాలనుకొనేవారికి సైతం చామంతి టీ మంచి ప్రత్యామ్నాయం.

భోజనం చేసే ముందు చామంతి టీ తాగడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నెలసరి సమయంలో చామంతి టీ తాగడం వల్ల పొత్తికడుపులో నొప్పి తగ్గుతుంది. చామంతి టీ రోజూ తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చామంతి టీ తాగడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే దానికంటే ముందు వైద్యుని సలహా తీసుకోవడం తప్పనిసరి.

చామంతి టీ వల్ల కలిగే సౌందర్యపరమైన ప్రయోజనాలు:

చామంతి టీ సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా, క్లెన్సర్ గా పనిచేస్తుంది. చామంతి టీ రోజూ తాగడం వల్ల చర్మం కాంతిమంతంగా తయారవుతుంది. అంతేకాదు శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. దీని వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. కొత్తవి రాకుండా ఉంటాయి. హెన్నాలో చామంతి టీ పిప్పి కలిపి తలకు మాస్క్ లా వేసుకొంటే చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. చామంతి టీతో తయారు చేసిన ఫేస్ స్క్రబ్ ఉపయోగించడం వల్ల చర్మంపై చేరిన మురికి, మలినాలు వదిలిపోవడమే కాకుండా ట్యాన్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

దీనికోసం టీ స్పూన్ చామంతి పొడి, టీ స్పూన్ ఓట్స్, అర టీస్పూన్ తేనె, మూడు చుక్కల బాదం నూనె కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని గుండ్రంగా రుద్దుకొంటూ మసాజ్ చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. దీనివల్ల చర్మసౌందర్యం మెరుగపడుతుంది. 

చామంతి టీ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.

చామంతి టీ ఎలా ఎంపిక చేయాలి?

గడ్డి లేదా సీమ చామంతి పూలతో ఈ టీని తయారుచేస్తారు. సాధారణ టీ పొడి కొనేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తామో.. చామంతి టీ కొనేటప్పుడు సైతం అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కల్తీ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడవచ్చు. అందుకే చామంతి టీ ప్యాకెట్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. చామంతి పూలను పొడిగా మార్చి ప్యాకింగ్ చేశారా? లేదా ఎండబెట్టిన పూలనే ప్యాక్ చేశారా? అనేది చూసుకోవాలి. వీలైనంత వరకు ఎండబెట్టిన పూలనే కొనుగోలు చేయడమే ఉత్తమం. అప్పుడే చామంతి టీ వల్ల మనకు ప్రయోజనాలు కలుగుతాయి. గ్రీన్ టీ, మసాలా టీ మాదిరిగా చామంతి టీ సైతం బ్యాగుల రూపంలో లభిస్తోంది. కాబట్టి మంచి బ్రాండ్ ఎంచుకొని చామంతి టీ తాగేయండి.

చ‌ర్మానికీ మంచి నేస్తం గ్రీన్ టీ..

చామంతి టీ తయారు చేసే విధానం:

గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్యపరమైన సౌందర్యపరమైన ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

దుష్రభావాలు ఏమైనా ఉంటాయా?

సౌందర్యపరమైన, ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్న చామంతి టీ వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. చామంతి జాతి పూల వల్ల కొందరిలో అలర్జీలు తలెత్తుతాయి. ఇలాంటి వారు చామంతి టీ తాగితే గొంతు వాచిపోవడం, శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం, దురదలు వంటి సమస్యలు ఎదురవ్వచ్చు. రోజుకి ఒకటి కంటే ఎక్కువ సార్లు చామంతి టీ తాగడం వల్ల వాంతులు అయ్యే అవకాశం ఉంది. గర్భం దాల్చిన మహిళలు, పాలిచ్చే తల్లులు, రక్తం గడ్డకుండా మాత్రలు ఉపయోగించేవారు చామంతి టీ తాగాలనుకొంటే వైద్యులను సంప్రదించి, వారి సలహా మేరకు నడుచుకోవడం ఉత్తమం.

హైదరాబాద్ లో ఘరం ఘరం ఇరానీ ఛాయ్ లభించే హోటళ్ల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Images: Shutterstock

Read More From Lifestyle