Humour

బద్ధకస్తుల కోసం… బహు చక్కని జాబ్ ఆఫర్స్ ఇవే..!

Lakshmi Sudha  |  Dec 23, 2018
బద్ధకస్తుల కోసం… బహు చక్కని జాబ్ ఆఫర్స్ ఇవే..!

ఏంటండీ ఆశ్చర్యపోతున్నారా? నేను చెప్పేది నిజంగా నిజమండీ బాబు..! మా మాట వినండి.

ఇక ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా ‘నీకున్న బద్ధకానికి ఉద్యోగం ఎవరిస్తారు?’ అనంటే.. వెంటనే ఫీలయిపోకుండా.. మీకున్న అవకాశాల గురించి గుక్క తిప్పుకోకుండా.. చెప్పేసి.. వారి నోరు మూయించండి. ‘నేను lazy.. నా పని క్రేజీ.. నా జీతం.. సూపర్ క్రేజీ’ అని చెప్పేయండి. బద్ధకం కూడా అప్పుడప్పుడు బాగా పనికొస్తుందని తెలపండి. 

చికెన్ నగ్గెట్ కనోసర్(Chicken Nugget Connoisseur)

అంటే చికెన్ నగ్గెట్స్ రుచిచూసేవారన్నమాట. ఈ మాట తెలిస్తే చికెన్ ప్రియులు ఎగిరి గంతేస్తారు. నమ్మాలనిపించడం లేదు కదా..? ఇటీవలే యూకేలో బీ&ఎమ్ సూపర్ మార్కెట్ చెయిన్ వారు రోజూ ఫ్రెష్ అండ్ ఫ్రోజెన్ చికెన్ నగ్గెట్స్ రుచి చూసే వారికి తమ సంస్థలో జాబ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారట. వారెలాంటి వారి కోసం చూస్తున్నారో తెలుసా? చికెన్ చూడగానే ‘ఏ చికెన్ చికెన్’ అంటూ ఎగిరి గంతులేసి వారి కోసమన్నమాట. మీరు కూడా అలాంటి వారే అయితే.. ఇలాంటి ఉద్యోగాల కోసం వెతికి మరీ చేరిపోండి. 

ప్రొఫెషనల్ స్లాకర్(Professional Slacker)

రోజంతా ఏ సముద్రం ఒడ్డునో.. పడక్కుర్చీలో సేదతీరుతూ పుస్తకం చదువుకొంటూ కూర్చొంటే ఎంత బాగుంటుంది? అలా చేసినందుకు డబ్బులు కూడా వస్తే మరింత బాగుంటుంది కదా..! అరె అసలు ఇలా కూడా జరుగుతుందా? ఇటీవల ట్రావెల్ కంపెనీ TUI స్టాక్ హోమ్‌లో పనిచేసేందుకు వెకేషన్ ఎక్స్‌పర్ట్ లను తమ సంస్థలో ఉద్యోగులుగా తీసుకొంటున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు డెడ్ లైన్స్ గోల ఉండదు. అసలు పనే ఉండదు. మీరు కూడా ఓసారి ప్రయత్నించి చూడండి మరి. 

బింగ్ వాచర్(Binge watcher)

ఓ పెద్దాయన అప్పుడెప్పుడో చెప్పాడండి. మీకొచ్చిన పని ఏదైనా సరే దాన్ని ఇతరులకు ఉచితంగా చేసి పెట్టకండి అని. ఎంత బాగా చెప్పాడో కదా..! ఇది అందరికీ వర్తిస్తుంది. కొన్నిసార్లు మనం రోజంతా అలా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూనే ఉంటాం. అలాంటి సందర్భాల్లో ‘ఇలాంటి ఉద్యోగం ఏదైనా ఉంటే బాగుండు’ అనిపిస్తుంది కదా..! ఉందండీ.. అలాంటి ఉద్యోగం కూడా ఒకటి ఉంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ పార్ట్ టైమ్ టాగ్గర్స్‌ని నియమించుకొంటోంది. అందుకే అప్పుడప్పుడూ నెట్ ఫ్లిక్స్ వెబ్ సైట్ చూస్తూ ఉండండి.

ప్రొఫెషనల్ కడ్లర్ (Professional Cuddler)

అవునండీ.. చక్కగా కౌగలించుకోవడం కూడా ఒక ఉద్యోగమే. దీని గురించి మీరు మరో విధంగా ఆలోచించవద్దు. మానసిక ఆందోళనతో బాధపడేవారికి సాంత్వన కలిగించేందుకు ఉద్దేశించినదే ఈ ప్రొఫెషనల్ కడ్లింగ్. కాబట్టి cuddlist.com వెబ్ సైట్ లోకి లాగిన్ అయి అప్లై చేసుకోండి.

బెడ్ టెస్టర్(Bed Tester)

మనలో చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవడమంటే అస్సలు ఇష్టముండదు. పొద్దున్నే లేవడం, జాగింగ్ చేయడం, జిమ్‌కి వెళ్లడం లాంటివి చేయాలంటే.. ‘అమ్మో ఇంకేమైనా ఉందా?  ఆ టైమ్‌ని కూడా ఓ కునుకు తీయడానికే వాడుకొంటా. అసలు వీలుంటే రోజంతా నిద్రపోతా’ అనేవారికి నప్పే జాబ్ ఒకటి ఉంది తెలుసా? అదే బెడ్ టెస్టర్స్. అంటే పరుపుల తయారీ కంపెనీలు తయారుచేసే పరుపులపై హాయి నిద్రపోయి వాటి నాణ్యత ఎలా ఉందో చెప్పడమే.. బెడ్ టెస్టర్స్ చేసే పని.

వీడియో గేమ్ టెస్టర్ (Video game Tester)

కొందరు ఎప్పుడూ వీడియో గేమ్స్ ఆడుతూనే ఉంటారు. వారిని ‘ఆ ఆటల మీద ఉన్న ఇంటరెస్ట్ చదువు మీద పెడితే.. ఈ పాటికి ఏ ఐఏఎస్సో అయిపోయి ఉండేదానివి’  అని తల్లిదండ్రులు రోజులో కనీసం ఒక్కసారైనా అనకుండా ఉండరు. మీలాగే వీడియోగేమ్స్ అంటే ఇష్టపడేవారికి కూడా మంచి ఆదాయాన్నిచ్చే ఉద్యోగం ఒకటుంది. అదే వీడియోగేమ్ టెస్టర్. గేమ్ డిజైన్, ఆడే విధానం పరిశీలించి దానిలో చేయాల్సిన మార్పుల గురించి చెప్పడమే ఈ జాబ్ చేసేవారి ముఖ్యమైన విధి.

వాటర్ సోమలియర్ (Water sommelier)

అంటే నీటిని రుచి చూసేవారన్నమాట. ‘ఏం మీ కంటికి మేమెలా కనిపిస్తున్నాం’ అనుకొంటున్నారా? నిజమండీ నేనేమీ జోక్ చేయట్లేదు. కావాలంటే.. నీటిని రుచి చూడటంలో మంచి అనుభవం ఉన్న మార్టిన్ రీస్ (Martin Riese)ను ఫాలో అవ్వండి. ఇక్కడ ఎన్ని అవకాశాలున్నాయో మీకే తెలుస్తుంది.

ప్రొఫెషనల్ స్లీపర్

నిద్రను ఇష్టపడేవారికి నప్పే మరో మంచి ఉద్యోగం ఇది. నాసా నుంచి హెల్సింకీలోని హోటల్ ఫిన్ వరకు నిద్రలో మంచి అనుభవం ఉన్నవారి కోసం ప్రకటనలిస్తున్నాయి. నాకు తెలుసు మీకు ఈ విషయం అంత నమ్మశక్యంగా అనిపించడం లేదని. కానీ ప్రొఫెషనల్ స్లీపర్స్ కోసం చాలా సంస్థలు ఎదురుచూస్తున్నాయనేది మాత్రం వాస్తవం.

So girls, what do you say? Lazy is crazy..

మీకు కూడా ఇలాంటి కొలువుల గురించి తెలుసా? అయితే మాతో వాటిని షేర్ చేసుకోండి.

 

Read More From Humour