Entertainment

టాలీవుడ్‌‌లో సత్తా చాటిన.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే.. ! (Bollywood Actress Who Made Their Mark In Tollywood)

Sandeep Thatla  |  Dec 19, 2018
టాలీవుడ్‌‌లో సత్తా చాటిన.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే.. ! (Bollywood Actress Who Made Their Mark In Tollywood)

తెలుగు సినిమాల్లో నేడు తెలుగు కథానాయికల సంఖ్య తక్కువగానే ఉందనేది మనకు తెలిసిన విషయమే. అదే సమయంలో బాలీవుడ్ (Bollywood), కోలీవుడ్, మాలీవుడ్ & శాండల్ వుడ్ నుండి వచ్చిన చాలా మంది నటీమణులు మన తెలుగు పరిశ్రమలో బాగానే రాణిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నుండి వచ్చిన అనేకమంది కథానాయికలు ఇక్కడ స్టార్ హీరోయిన్స్‌గా నిరూపిించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

టాలీవుడ్ లో పనిచేసిన బాలీవుడ్ నటి (Bollywood Actress Who Worked In Tollywood)

ఈ క్రమంలో టాలీవుడ్ (Tollywood) పైన చెరగని ముద్రవేసిన పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ గురించి.. వారు నటించిన సినిమాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం…

Hema Malini

ముందుగా ఈ వరుసలో చెప్పుకోవాల్సింది డ్రీంగర్ల్‌గా పేరుపొందిన హేమమాలిని గురించి. ఆమె తన తెరంగేట్రం తమిళంలో చేసినప్పటికీ.. తన రెండవ చిత్రం మాత్రం తెలుగులో చేసింది. అదే “పాండవ వనవాసం”. ఆ తరువాత “శ్రీ కృష్ణ విజయం” అనే సినిమాలో కూడా నటించింది. చేసినవి తక్కువ సినిమాలైనా ఆమె తెలుగు ప్రేక్షకులను తన నటనతో బాగానే ప్రభావితం చేసింది. అలాగే ఆ మధ్యనే గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో కథానాయకుడి తల్లి గౌతమి బాలాశ్రీగా కూడా హేమమాలిని ప్రధాన పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Khushbu

ఈ జాబితాలో మనం చెప్పుకోదగ్గ మరో నటీమణి  ఖుష్బు. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమై.. ఆ తరువాత మళ్లీ హిందీలోనే ఓ చిత్రంలో హీరోయిన్‌గా చేసినప్పటికీ తెలుగులో వెంకటేష్‌తో కలిసి చేసిన “కలియుగ పాండవులు” చిత్రంతో ఆమె స్టార్ హీరోయిన్‌గా మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాతి కాలంలో తెలుగులో సుమారు 17 చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకి ఆమె బాగా చేరువయింది. ది బర్నింగ్ ట్రైన్, లావారీస్, కాలియా, ఆపస్ కీ బాత్ లాంటి హిందీ చిత్రాలలో ఖుష్బు చైల్ ఆర్టిస్టుగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఆ మధ్యకాలంలో చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రంలో కూడా హీరో అక్క పాత్రలో మెరిసింది ఖుష్బు. అలాగే “యమదొంగ” చిత్రంలో మోహన్ బాబు సరసన కూడా నటించింది. 

Tabu

ఇక టబు విషయానికి వస్తే, ఆమె పుట్టి.. పెరిగింది హైదరాబాద్‌లోనే అయినప్పటికి సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది మాత్రం హిందీలోనే. అయితే రాఘవేంద్రరావు దర్శకత్వంలో “కూలీ నెం 1” చిత్రంలో నటించాకనే ఈ అమ్మడికి సరైన బ్రేక్ వచ్చిందని చెప్పాలి. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా.. ఆమెకి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది.  నిన్నేపెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే, పాండురంగడు మొదలైన తెలుగు చిత్రాలలో కూడా టబు నటించింది.

Divya Bharathi

ఇక దివ్య భారతి గురించి చెప్పుకోవాలంటే చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా మారిన తారగా తనను చెప్పుకోవచ్చు. ఈమె కెరీర్ కూడా తొలుత హిందీలోనే ప్రారంభమైంది.  1992లో విశ్వాత్మ” అనే హిందీ చిత్రంతో ఆమె కెరీర్ మొదలైంది. తర్వాత “దీవానా” చిత్రానికి ఆమె ఫిల్మ్ ఫేర్ కూడా అందుకుంది. హిందీ చిత్రాలతో కెరీర్ మొదలుపెట్టినప్పటికి కూడా.. తెలుగులో వెంకటేష్‌తో కలిసి చేసిన బొబ్బిలి రాజా చిత్రంతోనే దివ్యభారతికి మంచి బ్రేక్ వచ్చింది అని చెప్పాలి. ఆ చిత్రంతో ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రెండేళ్లలో ఆమె 7 చిత్రాలలో నటించడమనేది ఒక పెద్ద రికార్డుగా చెప్పుకోవాలి. అయితే అర్థాంతరంగా ఆమె మరణించడంతో ఆమె కెరీర్ మూణ్ణాళ్ళ ముచ్చటగానే ముగిసిపోయింది అని చెప్పకతప్పదు.

Nagma

తెలుగులో తనను తాను నిరూపించుకున్న మరో బాలీవుడ్ తార నగ్మా.”ఘరానా మొగుడు” చిత్రంలో చిరంజీవితో పోటాపోటీగా నటించిన నగ్మా.. ఆ తర్వాత అనేక హిట్ చిత్రాలలో నటించింది. అలాగే ఆ కాలంలో తెలుగులో చేసిన హిందీ నటీమణులలో దాదాపు 20కి పైగా చేసిన సినిమాల రికార్డు కూడా ఈమె పేరిటనే భద్రంగా ఉంది. ఇక హీరోయిన్ రవీనా టండన్ కూడా దాదాపు ఒక అయిదు సినిమాలు తెలుగులో చేయడం గమనార్హం.

Anjala Jhaveri

ఇదే జాబితాలో చేరిన మరో నటి అంజలా ఝవేరి అని చెప్పుకోవచ్చు. హిమాలయ పుత్ర, బేతాబీ, ప్యార్ కియాతో డర్నా క్యా లాంటి హిందీ చిత్రాలలో నటించిన ఆమె తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది. ప్రేమించుకుందాం రా, చూడాలని ఉంది, సమరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. నాగార్జున సరసన “రావోయి చందమామ” చిత్రంలో కూడా నటించింది.

Sonali Bindre

ఈమె పంథాలోనే నటి సోనాలి బింద్రే కూడా టాలీవుడ్‌లో కొన్నాళ్లు తన పాగా వేసింది. స్టార్ హీరోలందరితోనూ నటించింది. మురారి, ఇంద్ర, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలలో ప్రేక్షకులు గుర్తుపెట్టుకోదగ్గ నటనను అందించింది. 

ఆ తరువాత మీనాక్షి శేషాద్రి,  ఊర్మిళ మటోండ్కర్, మనిషా కొయిరాలా, ప్రీతీ జింతా, శిల్ప శెట్టి, కత్రినా కైఫ్ , అమీషా పటేల్, నమ్రత శిరోద్కర్, గ్రేసీ సింగ్, బిపాసా బసు, కంగనా రనౌత్ వంటి వారు కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు.

అయితే దాదాపు ఒక దశాబ్దన్నర కాలం నుండి మాత్రం మన తెలుగులో ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడ స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందిన వారు హిందీ భాషలో మన కన్నా మన వద్దే ఎక్కువ సినిమాలు చేయడం గమనార్హం. ఆ జాబితాలో  శ్రియ, కాజల్ అగర్వాల్, తమన్నాలు ఉన్నారు.

ఈ ఆర్టికల్స్ కూడా చదవండి

టాలీవుడ్ నటీమణుల శారీ స్టైల్ ఇన్సిపిరేషన్ పై వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

ఈ బాలీవుడ్ కథానాయికలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలుసా (ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి)
 

Read More From Entertainment