Lifestyle

ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ కొట్టేసిన.. 87 ఏళ్ల క్రికెట్ అభిమాని చారులత పటేల్ ..!

Sandeep Thatla  |  Jul 3, 2019
ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ కొట్టేసిన.. 87 ఏళ్ల క్రికెట్ అభిమాని చారులత పటేల్ ..!

ప్రస్తుతం ఇండియాలో మాత్రమే కాదు.. యావత్ ప్రపంచమంతటా క్రికెట్ ఫీవర్ నెలకొని ఉంది. ఇక మన దేశంలో అయితే వరల్డ్ కప్ జరిగినన్ని రోజులు దాదాపు 70% మంది ప్రజలు క్రికెట్ గురించే చర్చించుకుంటూ ఉంటారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతోన్న ఈ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచుల్లో.. భారత్ ఇప్పటికే సెమీస్‌కి దూసుకెళ్లింది.

వరల్డ్ కప్ అంటేనే అభిమానుల పండగ.  అలాగే ప్రతీ వరల్డ్ కప్ సీజన్‌లో.. మనం గ్రౌండ్‌లో అనూహ్యమైన సంఘటనలను చూస్తుంటాం.  ఇటీవలే  భారత్ Vs బంగ్లాదేశ్ మ్యాచ్‌లో జరిగిన సంఘటన కూడా అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. అయితే అది క్రీడాకారులకు సంబంధించినదో లేక ఆ మ్యాచ్‌కు సంబంధించిన విషయమో కాదు..

87 ఏళ్ల వయసున్న ఓ బామ్మ క్రికెట్ స్టాండ్‌లో కూర్చొని ఇండియన్ క్రికెట్ టీంకు మద్దతు తెలుపుతూ; ఉత్సాహంగా కేరింతలు కొడుతూ, బూర ఊదుతూ కనిపించింది. ఆమె మద్దతు తెలుపుతున్న విధానాన్ని గమనించిన కెమెరామెన్ వెంటనే ఆమె వైపు కెమెరా ఫోకస్ చేయడంతో.. కమెంటరీ బాక్స్‌లో  ఉన్న సౌరవ్ గంగూలీ, ప్రముఖ క్రికెట్ కమెంటేటర్ హర్ష భోగ్లే ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే ఆమె ఫొటోను సైతం మైదానంలో పదే పదే డిస్‌ప్లే చేశారు. దాంతో అప్పటికే భారత్‌కు మద్దతు పలికే అభిమానులతో హోరెత్తుతోన్న స్టేడియం.. మరింతగా హర్షధ్వానాలతో నిండిపోయింది.

మహిళా క్రికెట్ నేపథ్యంలో.. తొలి తెలుగు సినిమా ‘కౌసల్య కృష్ణ‌మూర్తి’

అలాగే ఆ స్టేడియంలో ఉన్న అభిమానుల్లో కొందరు.. ఆమె వద్దకు వచ్చి సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. ఆ బామ్మ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం మొదలుపెట్టారు. ఇలా కేవలం గంటల వ్యవధిలోనే 87 ఏళ్ల ఆ బామ్మ ఇంటర్నెట్ సన్సేషన్‌గా మారిపోయింది.

Virat Kohli Charulatha Patel

భారత్ – బంగ్లా మ్యాచ్ జరుగుతున్నంత సేపూ దాదాపు మైదానంలో కెమెరాలన్నీ ఆమె పైనే దృష్టి పెట్టాయి. అలాగే అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ జరుగుతున్నంత సేపూ.. ఇదంతా ఓ కంట గమనిస్తూనే ఉన్న విరాట్ కోహ్లీ మ్యాచ్ ముగిసిన వెంటనే స్టాండ్‌లో ఉన్న ఈ బామ్మ దగ్గరికి వెళ్లడమే కాదు.. ఆమెతో కాసేపు సరదాగా ముచ్చటించి, ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు.

Rohit Sharma Charulatha Patel

ఇంకేముంది.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ బామ్మ ఓ సెలబ్రిటీ అయిపోయింది. పలు న్యూస్ ఛానల్స్ సహా ప్రముఖ టీవీ ఛానళ్ల ప్రతినిధులు సైతం ఆమెను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆ బామ్మ పేరు చారులత పటేల్ అని.. ఇంగ్లండ్‌లో తన పిల్లలతో కలిసి నివసిస్తున్నట్లు అందరికీ తెలిసింది.

ఆమెకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని.. ఈ ఇష్టం తన మనవరాళ్ల ద్వారా వచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ చూసే అలవాటు లేని ఈ బామ్మ.. ఆ క్రీడను  ఆస్వాదించడం మెల్లగా మొదలుపెట్టిందట.

అలా అనుకొంటే ఇలా జరిగిందేంటి రవి శాస్త్రి బాబాయ్..?

ఈ బామ్మను ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఓ విలేకరి భారత జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దానికి ఆమె ఎలాంటి తడబాటు లేకుండా “కచ్చితంగా భారత జట్టే గెలుస్తుంది. ఎందుకంటే నేను ఆ భగవంతుణ్ని ఎంతగానో ప్రార్థిస్తున్నాను అంటూ అమాయకంగా సమాధానం చెప్పిందీ బామ్మ”

ఇంతటి ప్రచారాన్ని గడించిన చారులత పటేల్ (Charulatha Patel) గురించి తెలుసుకున్న మహీంద్రా & మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్ర ఆమెను ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

“మన జట్టు ఆడుతుంటే నేను ఎప్పటిలాగే టీవీ చూడకుండా ఉండే నియమాన్ని పాటిస్తున్నాను. కానీ ఈ బామ్మ గురించి తెలిసి వెంటనే టీవీ పెట్టాను. ఈ బామ్మ మన లక్కీ మస్కట్. ఈ బామ్మకి సెమి ఫైనల్స్ & ఫైనల్స్ టికెట్స్ ఇప్పించండి”.

“నేను మాటిస్తున్నాను… ఇక భారత జట్టు ఆడబోయే మ్యాచులకి ఆమెకు ఇచ్చే టికెట్స్ కి నేను స్పాన్సర్ చేస్తాను” అని తెలిపారట మహీంద్ర.

దీనితో ఈ బామ్మకి వచ్చిన క్రేజ్ పదింతలైనట్లు అయింది. మరి, మన దేశంలోనే కాక ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీగా ఉన్న మహీంద్రా & మహీంద్రా కంపెనీ అధినేత స్వయంగా ఈ బామ్మకి బంపర్ ఆఫర్ ఇవ్వడం అంటే మాటలు కాదు కదా!

ఈ రోజుల్లో ఇలా అతి తక్కువ సమయంలో సెన్సేషన్ అయిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి జాబితాలో ఇప్పుడు ఈ 87 ఏళ్ళ బామ్మ కూడా చేరిపోయింది. ఏదైతేనేం.. ఈ బామ్మతో పాటు, యావత్ భారతావని కోరుకుంటున్నట్లుగా ఈ వరల్డ్ కప్ లో భారత్ గెలవాలని; ఆ మ్యాచుల్లో ఈ బామ్మ కూడా అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతూ.. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కానీ.. మనసుకు పరిమితులు ఉండవని నిరూపించాలని మనమూ కోరుకుందాం..

క్రీడాకారులుగా దూసుకుపోవడానికి.. మన యువ హీరోలు రెడీ..!

Read More From Lifestyle