మడిసన్నాక కూసింత కళాపోసన ఉండాలి.. అన్న డైలాగ్ మనందరికీ తెలిసిందే. కానీ కళల్లో(arts) నైపుణ్యం ఉండడం అంత ఈజీ కాదు.. దానికి చాలా ఓపిక, సహనం.. కళపై అంతకంటే ఎక్కువ మక్కువ ఉండాలి. ఇలా ఉన్నప్పుడే ఆ రంగంలో రాణించగలుగుతాం.
మామూలు కళలే కష్టమంటే.. తరచి చూస్తే గానీ కంటికి కనిపించని మైక్రో ఆర్ట్ (Micro art) చేయడం ఇంకా కష్టమనే చెప్పుకోవాలి. అలాంటి కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ఆ కళ ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది సుస్మిత మన్నే (Susmitha Manne). ఆమె గురించి తన మాటల్లోనే..
నా పేరు సుస్మిత. మాది కృష్ణా జిల్లాలోని కుమ్మరెడ్డిపల్లి అనే గ్రామం. నాకు చిన్నతనం నుంచి ఆర్ట్స్ అంటే ప్రాణం. చిన్నతనంలోనే పెయింటింగ్స్ వేయడం, చాక్‌పీస్‌లను చెక్కి చక్కటి కళాకృతులుగా మలచడం వంటివి చేసేదాన్ని. మా నాన్న రైతు.. అమ్మ గృహిణి. వారిద్దరూ నా కళను చాలా బాగా ప్రశంసించేవారు.. నన్ను ప్రోత్సహించేవారు. అలా మూడో తరగతి నుంచే చాక్‌పీస్‌లు చెక్కి కళాకృతులు చేయడం ప్రారంభించాను.
వాటిని నా స్నేహితులకు బహుమతిగా ఇచ్చేదాన్ని. పదో తరగతి తర్వాత కొన్ని సంవత్సరాలు చదువు కోసం కళను పక్కన పెట్టినా ఆ తర్వాత బీటెక్‌లో చేరాక దాన్ని తిరిగి మొదలుపెట్టాను. ఈసారి చాక్‌పీస్‌లతో పాటు పెన్సిల్ లెడ్‌పై కళాకృతులు చెక్కడం ప్రారంభించా. అటు చదువుతో పాటు వీటిపై దృష్టి పెట్టి పనిచేసేదాన్ని. బీటెక్ పూర్తయిన తర్వాత.. ఈ మైక్రో ఆర్ట్స్ చేస్తూ వాటిని బహుమతులుగా అందిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో గిఫ్టింగ్ కంపెనీని ప్రారంభించా. ఆర్డర్ మేరకు పేర్లు లేదా వివిధ సింబల్స్‌ని పెన్సిల్ లెడ్‌పై చెక్కి వారికి అందిస్తూ మంచి పేరు సంపాదించుకున్నా.
చిన్నతనం నుంచీ మైక్రోఆర్ట్‌పై ఆసక్తితో ఈ రంగంలో ఉన్నా.. పెద్దగా ప్రోత్సాహం దక్కలేదు. మా అమ్మానాన్న తప్ప ఇంకెవరూ నన్ను ప్రోత్సహించలేదు. కొందరైతే ఆడపిల్లవి ఇవన్నీ నీకు అవసరమా? అనేవారు. అయితే ఆడపిల్లైనా సరే.. నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల నాకుంది. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నాకు నచ్చిన ఈ కళను వదులుకోకూడదని భావించా. బీటెక్ పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తున్నా. ప్రస్తుతం నేను ఇటు ఉద్యోగం, అటు డిస్టెన్స్‌లో ఎంబీయే చేస్తూనే నాకెంతో ఇష్టమైన మైక్రో ఆర్ట్‌ని కూడా కొనసాగిస్తున్నా. ఇటీవలే నేను పెన్సిల్ లెడ్స్ పై జనగణమన మొత్తం చెక్కాను. దీనికి మంచి స్పందన లభించింది.
దాదాపు పదమూడేళ్ల నుంచి మైక్రో ఆర్ట్, పేపర్ ఆర్ట్ చేస్తున్నా.. గుర్తింపు లభించింది మాత్రం గతేడాదే..! 2018లో స్కోర్‌మోర్ ఫౌండేషన్ నాలోని కళను గుర్తించి ప్రతిభా శిరోమణి అవార్డును అందించిది. ఆ తర్వాతే నా గురించి అందరికీ తెలిసింది. నేను చేసిన జణగణమన ఆర్ట్‌కి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారి పురస్కారం కూడా అందుకోబోతున్నా. నాలాంటివాళ్లందరికీ నేను చెప్పేదొక్కటే.. మైక్రో ఆర్ట్ చేయడం చాలా కష్టం. ఒక్కో ఆర్ట్ చేయడానికి కొన్నిసార్లు కొన్ని గంటలపాటు ఏకబిగిన కూర్చోవాల్సి రావచ్చు. ఇలా చేసేయగానే అలా గుర్తింపు సంపాదించడం కూడా కొంత కష్టమే. అందుకే ఈ రంగంలో గుర్తింపు సంపాదించాలని భావించేవారికి ఓపిక చాలా ముఖ్యం. అదే లేకపోతే ఆర్టిస్ట్‌గానే కాదు.. ఏ రంగంలోనూ విజయాలు సాధించలేమని నా భావన.
ప్రస్తుతం నేను ఉద్యోగంతో పాటు నా ఆర్ట్‌ని కూడా కొనసాగిస్తున్నా. అయితే గిఫ్టింగ్ బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బును పూర్తిగా సమాజసేవకే వినియోగిస్తున్నా. ఆ డబ్బుతో వారాంతాల్లో మురికివాడల పిల్లలకు ఆర్ట్ క్లాసులు నిర్వహించడం.. వారికి అవసరమైనవి కొనడం వంటివి చేస్తాను. భవిష్యత్తులో నేను ఏ ఉద్యోగంలో ఉన్నా.. ఏం చేసినా ఈ కళను మాత్రం కొనసాగిస్తాను. అంతేకాదు.. మైక్రో ఆర్ట్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించాలన్నదే నా తపన. ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు వేస్తున్నా. మరికొన్ని రోజుల్లోనే దాన్నీ సాధిస్తానన్న నమ్మకం నాకుంది.
ఇవి కూడా చదవండి..
మన దేశంలోని డిజైన్ కేఫ్‌ల గురించి ఆంగ్లంలో చదవండి.
మీ పెళ్లి ఫొటోని పెయింటింగ్‌గా మార్చే లైవ్ వెడ్డింగ్ ఆర్టిస్ట్ గురించి ఆంగ్లంలో చదవండి.
తన మానసిక సమస్య గురించి స్కెచ్‌లు వేసే ఆర్టిస్ట్ గురించి ఆంగ్లంలో చదవండి.
Images : Facebook