చుట్టూ పచ్చని ప్రకృతి (nature).. ఎత్తైన కొండలు.. అందమైన చెరువులు.. ఇలాంటి ప్రదేశాన్ని చూస్తే ఎవరైనా ప్రేమ (Love)లో పడిపోతారు కదా.. అందమైన ప్రకృతితో ప్రేమలో పడంది ఎవరు? కానీ ఆ ప్రకృతే ఆ ఇద్దరినీ ఒకరి ప్రేమలో మరొకరు పడేలా చేసింది. అందుకే వారిద్దరూ తాము మొదట కలిసి, ప్రేమలో పడిన చోటే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. యే జవానీ హే దివానీ సినిమాలో చూపినట్లుగా ట్రెక్ (trek)లో భాగంగా ప్రేమలో పడి సినిమాని రియాలిటీగా మార్చిందీ జంట.
సౌమ్య, సారాంశ్ ఇద్దరూ మూడేళ్ల క్రితం పరాశర్ ట్రెక్‌లో భాగంగా ఒకరినొకరు కలిశారు. అపరిచితులుగా ట్రెక్ ప్రారంభించిన వీరిద్దరూ అది పూర్తయ్యేసరికి లవ్‌బర్డ్స్‌గా మారిపోయారు. తమ ప్రేమ కథను POPxo తో ప్రత్యేకంగా పంచుకుందీ జంట. వీరిలో వధువు సౌమ్య ఓ ఎన్జీవోలో పనిచేస్తోంది. తన భర్త సారాంశ్ ఓ స్టార్టప్ కంపెనీలో యాప్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరికీ అడ్వెంచర్ ట్రిప్స్ అంటే ఎంతో ఇష్టం.
ఇద్దరూ తమ తమ స్నేహితులతో విడిగా ట్రెక్స్‌కి వెళ్తూ ఉండేవారు. కానీ మూడేళ్ల క్రితం ఓ ఫ్రెండ్ వల్ల సారాంశ్ సౌమ్య స్నేహితుల బృందంతో కలిసి పరాశర్ వెళ్లాల్సి వచ్చిందట. అప్పుడే ఆ మంచుకొండల మధ్య పచ్చని ప్రకృతిలో వారి మనసులు కూడా కలిశాయి. దీని గురించి చెబుతూ.. మేమిద్దరం అక్కడ కలవాలని రాసి పెట్టి ఉన్నట్లుంది. నేను, నా స్నేహితులు వీకెండ్ ట్రిప్‌కి హిమాలయాల్లోని పరాశర్ చెరువు వద్దకి ట్రెక్కింగ్‌కి వెళ్లాలని అనుకున్నాం. ఆఖరి నిమిషంలో మా స్నేహితుల్లో ఒకరు ట్రిప్‌కి రాలేమని చెప్పడంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే మా స్నేహితుల్లో ఒకరు వారికి ఫ్రెండ్ అయిన సారాంశ్‌ని ఆ ట్రిప్‌లో చేరమని కోరడం తను ఒప్పుకోవడం జరిగింది. అలా మేం కలిసి పరాశర్ ట్రెక్‌కి వెళ్లాం అని వివరించింది.
తాను మొదటిసారి సౌమ్యను చూడగానే ప్రేమలో పడిపోయానని చెప్పే సారాంశ్.. ఆ రోజుని తాను ఎప్పటికీ మర్చిపోలేనని వివరిస్తాడు. ఆరోజు సౌమ్యను ఐఎస్‌బీటీ బస్ స్టాప్ దగ్గర మొదటిసారి చూశా… అందంగా కురుస్తున్న వెన్నెల్లో తను అద్భుత సౌందర్యరాశిలా కనిపించింది అంటూ తన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుభవం గురించి చెబుతాడు సారాంశ్.
పరాశర్ ట్రెక్ చాలా సులువైంది. సాధారణంగా ఆరు గంటల్లో ఎక్కేయవచ్చు. ఆ రోజు వాన కూడా పడుతుండడంతో మొత్తం చిత్తడిగా, చీకటిగా ఉండడం వల్ల వీరి ట్రెక్ కాస్త ఆలస్యమైందట. పైకి ఎక్కిన తర్వాత స్నేహితులంతా పొడి బట్టల్లోకి మారి ఒక్కచోట కూర్చొని పాటలు పాడడం, కథలు చెప్పుకోవడం, సరదా గేమ్స్ ఆడడం వంటివన్నీ చేశారట. ఆ తర్వాత అందరూ పడుకోవడానికి తమ తమ టెంట్స్‌లోకి వెళ్లిపోగా సౌమ్య, సారాంశ్‌లు మాత్రం నెమ్మదిగా అలా నడుస్తూ చెరువు ఒడ్డుకి వెళ్లి నిలబడ్డారట. ఆ వెన్నెల కురిసిన రాత్రి అక్కడ అందమైన చుక్కల దుప్పటి కప్పుకున్న ఆకాశం కింద.. పచ్చని ప్రకృతి, అందమైన చెరువు సాక్ష్యాలుగా.. వారిద్దరి మనసులు కలిశాయి. ఇద్దరూ రాత్రంతా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారట. జీవితం గురించి, ప్రేమ గురించి, భవిష్యత్తు గురించి బాగా మాట్లాడుకున్న తర్వాత అర్ధరాత్రి ఇద్దరూ వెళ్లి పడుకున్నారట.
ఈ ట్రెక్ ముగిసిన తర్వాత దిల్లీలోని డేకథ్లాన్లో తమ మొదటి డేట్ జరిగిందని చెబుతుందీ జంట. అవును. షాపింగ్‌లోనే.. ఎందుకంటే అక్కడ సేల్ ఆఫర్ ఉందట. ఇలా వారి ప్రేమకథ పట్టాలెక్కింది. ఆ తర్వాత తరచూ కలుస్తూ మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు.
ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోవాలంటే వారిద్దరూ కలిసి ట్రావెల్ చేయాలని చెబుతుందీ జంట. వీరిద్దరూ తరచూ ఇలాంటివి చేస్తూ ఉంటారట. ప్రేమలో పడిన తర్వాత మాట్లాడుకోవడం, ఆట, వంట వంటివి కలిసి చేయడంతో పాటు హిమాలయాల్లోని సార్ పాస్, హమ్టా పాస్, రూప్ కుండ్, ఖీర్ గంగా, ఖరేరీ చెరువు, గోచలాలతో పాటు హిమాలయా వ్యాలీస్.. దేశంలోని ఇతర ప్రదేశాలను కూడా చుట్టొచ్చారీ ఇద్దరు. ప్రతి ట్రిప్ తామిద్దరినీ మరింత దగ్గర చేసిందని చెబుతారీ ప్రేమికులు.
మూడేళ్లు ప్రేమించుకున్న తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే తమ పెళ్లిని ఘనంగా కాకుండా కేవలం తమ కుటుంబాలు, దగ్గర బంధువుల మధ్యలో సింపుల్‌గా చేసుకోవాలన్నది వారి ఆకాంక్ష. ఇలా పెళ్లి గురించి ఆలోచిస్తుండగానే తామిద్దరం మొదట కలిసిన ప్రదేశంలోనే పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందట. అందుకే రెండు కుటుంబాలతో పాటు కేవలం దగ్గరి బంధువులు, స్నేహితులను మాత్రమే పిలిచి పరాశర్ చెరువు వరకూ ట్రెక్కింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు.
అయితే వీరి పెళ్లిలో ఇదొక్కటే ప్రత్యేకత కాదు. ఎక్కువ సమయం పాటు కొనసాగే మంత్రాలు, ఇతర పద్ధతులు అన్నీ ఇష్టం లేని వీరిద్దరూ ప్రపంచ వ్యాప్తంగా జరిగే పెళ్లిళ్ల నుంచి తమకు నచ్చిన సంప్రదాయాలను ఎంచుకొని వాటి ఆధారంగా పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు.. తాము జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో.. ఆ పెళ్లి ప్రమాణాలను తామే సొంతంగా రాసి ఎదుటివారికి అందించారట. మంత్రోచ్ఛారణలు లేని పెళ్లి కోసం ముందుగానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఈ వేడుకకు వారు సిద్ధమయ్యారట..
రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు, స్నేహితులు, బంధువులతో కలిపి మొత్తం పదిహేను మంది ట్రెక్కింగ్ చేశారు. అంత ఎత్తులో పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి అటు పండితులు కానీ, ఇటు చర్చ్ ఫాదర్స్ కానీ అక్కడికి రాలేరు కాబట్టి వరుడి చెల్లెలే మినిస్టర్‌గా మారి ఈ పెళ్లి వేడుకను నిర్వహించిందట. వివాహ తంతు తర్వాత ఉంగరాలు, పూలమాలలు మార్చకొని పెళ్లి వేడుకను పరిపూర్ణం చేశారట. ఈ పెళ్లి వేడుక పూర్తయ్యాక రెండు కుటుంబాలు వారికోసం ఓ ప్రత్యేకమైన పాట పాడి వారిని సర్‌ప్రైజ్ చేశాయి.
కేవలం వధూవరులు ఒకరికొకరు ప్రమాణాలు రాసుకొని అందించుకోవడం మాత్రమే కాదు.. వధువు తమ్ముడు కూడా వరుడు చేయాల్సిన ప్రమాణాలను రాసి అందించాడట. వరుడి చెల్లెలు కూడా ఇదే పద్ధతిని పాటించింది. ఇలా వధూవరులిద్దరే కాదు.. వారి కుటుంబ సభ్యులు కూడా పెళ్లి ప్రమాణాల్లో భాగం పంచుకున్నారట..!
సినిమా కథలా అనిపించే ఈ ప్రేమకథ ప్రతిఒక్కరిలోనూ ప్రేమపై నమ్మకాన్ని పెంచుతోంది. అలాంటి అద్భుతమైన ఈ జంట జీవితమంతా ఆనందంగా ముందుకు సాగాలని మనమూ శుభాకాంక్షలు చెప్పేద్దాం.
ఇవి కూడా చదవండి
వాలెంటైన్స్ డే రోజున.. ప్రకృతితోనూ ప్రేమలో పడిపోండి..
పెళ్లికి ముందే ఈ ఎమర్జెన్సీ కిట్.. సిద్ధం చేసుకోవడం మర్చిపోవద్దు..
ఈ వధువు స్టెప్పులేస్తే.. ప్రపంచమే ఫిదా అయిపోయింది..!
ఫొటోలు – పెళ్లికూతురు ప్రత్యేకంగా POPxo తో పంచుకున్న చిత్రాలు.