అగస్త్యార్ కూడమ్.. (Agasthyarkoodam) కేరళలోని రెండో అతి ఎత్తైన పర్వతం.. సప్తమహా మునుల్లో ఒకరైన అగస్త్య మహా రుషి ఇక్కడే జీవించేవారని భక్తుల నమ్మకం. అందుకే కొండపై ఆయన విగ్రహం పెట్టి పూజలు కూడా నిర్వహిస్తారు. అంతేకాదు.. అక్కడికి మహిళలు రాకూడదని ఇంతకుముందు నియమం కూడా ఉండేది. కానీ ఇటీవలే ఆ రాష్ట్ర హైకోర్టు ఈ నిబంధనలను తొలగించి మహిళలు కూడా ఈ పర్వతం ఎక్కొచ్చని తీర్పు వెలువరించింది. ఈ తీర్పు తర్వాత తాజాగా కేరళలోని తిరువనంతపురానికి చెందిన ప్రభుత్వాధికారి అగస్త్య పర్వతాన్ని ఎక్కి ఆ ఘనత సాధించిన మొదటి మహిళగా రికార్డు సాధించింది.
ధన్యా సనాల్.. కేరళలోని తిరువనంతపురంలో రక్షణ శాఖలో పీఆర్ఓగా పనిచేస్తున్న అధికారి ఈమె. అగస్త్య పర్వతాన్ని అధిరోహించిన మొదటి మహిళగా పేరు సంపాదించుకుంది. 38 సంవత్సరాల ధన్య ట్రెక్కింగ్ (Trekking) పై చిన్నతనం నుంచే ఆసక్తి చూపేదట.
ఇప్పటికే కేరళలోని దాదాపు అన్ని పర్వతాలు అధిరోహించిన ఆమె.. హైకోర్టు తీర్పుతో 22 కిలోమీటర్ల ఈ ట్రెక్కింగ్‌కి కూడా అర్హత సాధించింది. బోనాకాడ్ వద్ద తన ట్రెక్కింగ్ ప్రారంభించిన ఆమెతో మరో ఇరవై మంది ట్రెక్కింగ్ చేసే వ్యక్తులతో పాటు ఇద్దరు మహిళా ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా వెంట వెళ్లడం విశేషం.
హైకోర్టు తీర్పు తర్వాత మొదలైన మొదటి ట్రెక్కింగ్ బ్యాచ్‌లోని వందమందిలో ధన్య ఒక్కరే అమ్మాయి కావడం విశేషం. మొత్తం 4700 మంది ఈ ట్రెక్కింగ్ కోసం అప్లై చేసుకోగా అందులో వంద మంది స్త్రీలున్నారట! వారిలో ధన్య ఒక్కరే ట్రెక్కింగ్ కోసం ఎంపికవ్వడం విశేషం. ట్రెక్కింగ్ కోసం శారీరకంగా ఫిట్‌గా ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేశామని అటవీ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు.
ట్రెక్ పూర్తయిన తర్వాత దీని గురించి మాట్లాడుతూ.. నేను ట్రెక్ పూర్తిచేసిన తర్వాత కానీ దీనికి ఇంత పబ్లిసిటీ లభించిందన్న విషయం నాకు అర్థం కాలేదు. నా వరకూ అయితే ఇది అన్నింటిలా ఒక పర్వతం మాత్రమే.. ఇంతకుముందు ఆంక్షలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్కేలేదు. లేకపోతే ఎప్పుడో దీన్ని ఎక్కి ఉండేదాన్ని అని చెప్పింది ధన్య. అయితే మొదటి మహిళగా లభించిన ఈ గుర్తింపు తనకు ఆనందాన్ని కలిగించిందని వెల్లడించింది ధన్య.
అయితే ఈ ట్రెక్కింగ్ అనుభవం ఆమెకు అంత సులువేమీ కాలేదట. పైకి వెళ్లే కొద్దీ 60 నుంచి 70 డిగ్రీల కోణంలో ఉండే కొండలను ఎక్కడం ఆమెకు పెద్ద సవాల్‌గానే నిలిచింది. అయితే ట్రెక్కింగ్‌లో అప్పటికే ఆమెకున్న అనుభవంతో పాటు ముందే వీటన్నింటికీ సిద్ధమై ఉండడం వల్ల ధన్యకు అవి పెద్ద సమస్యగా కనిపించలేదట.
ఒకటిన్నర రోజులు ట్రెక్కింగ్ చేసి శిఖరాగ్రానికి చేరుకున్న ఆమె తన పది కేజీల బ్యాగ్‌తో నలభై కిలోమీటర్లు దట్టమైన అడవిలో నడవడం కాస్త ఇబ్బందిగానే అనిపించిందని చెబుతుంది. ఈ బ్యాగ్‌లో ఆమె స్లీపింగ్ బ్యాగ్‌తో పాటు రెండు రోజుల పాటు శక్తినిచ్చేలా డ్రైఫ్రూట్స్, చాక్లెట్లు తీసుకెళ్లిందట.
మొదటిరోజు కాస్త గాలి తక్కువగా ఉన్నా.. పైకి ఎక్కుతున్న కొద్దీ అడవి మరింత దట్టంగా మారడం, గాలి ఎక్కువవడంతో కాస్త ఇబ్బంది పడ్డానని చెప్పిన ధన్య.. తన కెరీర్లోనే దీనిని అత్యంత కష్టమైన ట్రెక్‌గా అభివర్ణించింది.
శిఖరం చేరుకున్న తర్వాత తన తోటివారంతా చప్పట్లు కొట్టి తనని అభినందిస్తుంటే పొంగిపోయానని చెప్పే ఆమె.. శారీరకంగా ఫిట్‌గా ఉంటే తప్ప ఈ ట్రెక్కింగ్ కోసం ప్రయత్నించవద్దని సలహా కూడా ఇస్తుంది.
హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ స్థానిక గిరిజన తెగకు చెందినవారు బేస్‌క్యాంప్ వద్ద నిరసన దీక్ష చేపట్టినా.. తనకేమీ ఇబ్బంది కలిగించలేదని చెప్పింది ధన్య. ఆ తెగకు చెందినవారు నాకు చాలా సహాయం చేశారు. నా కోసం ఆహారం కూడా తీసుకొచ్చారు. అదే తెగకు చెందిన గైడ్ మమ్మల్ని పర్వతం పై వరకు తీసుకెళ్లాడు. వాళ్లంతా ఎంతో సాయం చేశారు. కాస్త నిరసన ప్రకటించినా అది ఎవరికీ ఇబ్బంది కలిగించకుండానే ఉంది.. అంటూ వారి గురించి చెప్పుకొచ్చింది ధన్య.
ఇవి కూడా చదవండి
అమ్మాయిలూ.. 2019లో ఈ మాటలు మీరు తప్పక చెప్పాల్సిందే..
ఆర్మీ పటాలానికి తొలి మహిళా నాయకురాలు భావనా కస్తూరి ..!
క్యాన్సర్ మహమ్మారిని గెలిచారు.. విజేతలై అందరికీ ఆదర్శంగా నిలిచారు..!
Read More From Entertainment
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే
Sandeep Thatla