Lifestyle

మీ బాయ్ ఫ్రెండ్ క‌ల‌లోకి వ‌స్తున్నాడా? దాని అర్థం ఏంటో మీకు తెలుసా??

Lakshmi Sudha  |  Feb 5, 2019
మీ బాయ్ ఫ్రెండ్ క‌ల‌లోకి వ‌స్తున్నాడా?  దాని అర్థం ఏంటో మీకు తెలుసా??

కలలు (dreams) వట్టి కలలు మాత్రమే కాదు. అవి మన కాన్షియ‌స్ మైండ్, సబ్ కాన్షియ‌స్ మైండ్‌కు మధ్య జరిగే ఒక సమాచార మార్పిడి. మన మనసులోని భావాలే మనకు కలలుగా వస్తాయి. అవి పాజిటివ్ కావచ్చు. నెగటివ్ అవ్వచ్చు. నిజజీవితంలో మనం చూసిన, విన్న సంఘటనలకు దగ్గరగానే మన స్వప్నాలుంటాయి. అయితే అమ్మాయిలు ఎక్కువగా కలలు కనేది తమ బాయ్ ఫ్రెండ్ గురించే. ఎందుకంటే మనసుకి బాగా చేరువైన వ్యక్తులు వారే. మరి, భాగస్వామి విషయంలో వచ్చే కొన్ని కలలతో పాటు వాటి అర్థం గురించి కూడా మనం తెలుసుకొందాం.

1. మీ బాయ్ ఫ్రెండ్ తో వాదిస్తున్నట్లుగా కల వస్తే.. నిజజీవితంలో మీ ఇద్దరికీ మధ్య ఏవో పొరపొచ్చాలు ఏర్పడినట్టు అర్థం. మీ బంధంలో రేగిన కలతల గురించి మీరు ఆందోళన చెందుతున్నట్లయితే.. మీరు నిద్రపోతున్నప్పుడు వాటిని పరిష్కరించేందుకు మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రయత్నిస్తుంది. మెలకువ వచ్చిన తర్వాత మీకు ఆ కల గుర్తున్నట్లయితే.. మీ ఇద్దరి మధ్య ఎందుకు వాగ్వివాదం తలెత్తిందో గమనించి.. భ‌విష్య‌త్తులో అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాదనకు దిగకుండా ఉంటే సరిపోతుంది.

2. గర్భం దాల్చినట్లు కల వస్తే.. మీ ప్రియుడి సంతానాన్ని మీరు గర్భంలో మోస్తున్నట్టుగా కల వస్తే.. ఆ సంఘటనను బట్టి చాలా అర్థాలుంటాయి. సాధారణంగా గర్భం దాల్చినట్టు కల వస్తే.. మీ ఇద్దరి బంధం మరో దశకు చేరుకొంటున్నట్టు అర్థం.

3. బ్రేకప్ చెప్పినట్టు కల వస్తే.. కంగారు పడకండి. ఇలాంటి కల వస్తే మీ ఇద్దరూ బ్రేకప్ అయిపోతారని అర్థం కాదు. ఇటీవలి కాలంలో మీ ఇద్దరి మధ్య ఏదైనా పెద్ద గొడవ అయి ఉండొచ్చు. లేదా ప్రస్తుతం మీకు, మీ బాయ్ ఫ్రెండ్ కి మధ్య మాటల యుద్ధం నడుస్తుండవచ్చు. దాని ప్రభావం వల్లే ఇలా బ్రేకప్ అయినట్టు మీకు క‌ల వ‌చ్చి ఉండ‌వ‌చ్చు. గుర్తుంచుకోండి. ప్రతి ముగింపు.. ఓ కొత్త ప్రయాణానికి నాంది అవుతుంది.

Also Read: కొన్ని ప్రేమబంధాలు ఎందుకు విఫలమవుతున్నాయంటే..?

4. పెళ్లయిందని కలొస్తే.. అంతకంటే సంతోషం కలిగించే విషయం మరొకటి ఉంటుందా? మీకు, మీ బాయ్ ఫ్రెండ్ కి పెళ్లయినట్లు కల వస్తే.. మీ ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండడానికి ప్రాధాన్యమిస్తున్నట్టుగా గుర్తించాలి.

5. కలసి ప్రయాణం చేసినట్టు స్వప్నం వస్తే.. ఇలాంటి కలలు చాలామందికి వస్తూ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్ తో కలసి బస్సులో, ట్రైన్లో, విమానంలోనో ఏదో ఓ ప్రాంతానికి వెళుతున్నట్టుగా కలలు కంటూ ఉంటారు. మరి ఆ కలలో మీ ప్రయాణం హాయిగా సాగిందా? లేక‌ ఇబ్బందులేమైనా ఎదురయ్యాయా? ఎందుకడుగుతున్నామంటే.. మీ బాయ్ ఫ్రెండ్ తో మీ జీవితాన్ని మీరు ఏవిధంగా ఊహించుకొంటున్నారో ఇలాంటి కలలు తెలియజేస్తాయి. మిగతా అన్ని విషయాల మాదిరిగానే కాలంతో పాటు ఈ ఆలోచనలు కూడా మారొచ్చు. కాబట్టి మరేం ఫర్లేదు.

Also Read: అబ్బాయిలూ.. ప్రేమతో మీ భాగస్వామికి చేయాల్సిన పనులివే..

6. మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేసినట్టు కల వస్తే.. ఇలాంటి కలలు మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తాయి. ఈ విధ‌మైన‌ కలలు వచ్చినప్పుడు కాస్త మిమ్మల్ని మీరు సముదాయించుకొని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే.. మీ ఇద్దరి మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్ఫర్థల కారణంగా మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేస్తాడేమోననే అనుమానం మీ మనసులో ఉండి ఉండొచ్చు.

ఇలాంటి కలలు రావడానికి బహుశా అది కూడా కారణం అయి ఉండొచ్చు. లేదా మీ బంధం పట్ల మీలో అభద్రతాభావం నిండి ఉండొచ్చు. ఇలాంటి ఎన్నో అంశాలు మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేసినట్టు కల రావడానికి కారణమై ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి విషయాలను మీ భాగస్వామితో చర్చించే ముందు బాగా ఆలోచించి ఆ తర్వాత మాట్లాడండి.

7. మీరే మోసం చేసినట్టు కల వస్తే.. అవును ఇలా సైతం కలలు రావచ్చు. కానీ కంగారు పడకండి. ఎందుకంటే.. దీని అర్థం మీరు అతన్ని ప్రేమించడం లేదనో.. లేకపోతే.. మరొకరిపట్ల ఆకర్షణకు ల ోనవుతున్నారనో కాదు. మీరు ఏదో విషయంలో తప్పు చేస్తున్నానని బాధపడటం కూడా కారణం కావచ్చు. దాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ ఇలా మీకు చెబుతూ ఉండొచ్చు.

8. శారీరకంగా ఒకరికొకరు దగ్గరైనట్లు కల వస్తే.. సెక్స్ సంబంధించిన కలలు సైతం చాలామందికి సాధారణంగా వచ్చేవే. మీలో దాగి ఉన్న శృంగార‌ప‌రమైన‌ కోరికలు ఇలా వస్తూ ఉంటాయి.

9. మీ బాయ్ ఫ్రెండ్ చనిపోయినట్టు కల వచ్చిందా? ఇలాంటి కల రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉండి ఉండొచ్చు. మొదటిది మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎక్కడ మొదలైందో అక్కడే ఉండిపోవడం.. రెండోది.. మీకు, మీ బాయ్ ఫ్రెండ్ కు మానసికంగా దూరం పెర‌గ‌డం.. ఈ కల వచ్చిన తర్వాత మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? సంతోషంగానా? బాధగానా? సమతౌల్యంగా ఉందా? దీనికి మీరిచ్చే సమాధానం బట్టి మీ రిలేషన్ షిప్ ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసుకోవచ్చు.

10. అతన్ని కలుసుకోలేకపోతున్నట్టుగా కల వస్తే.. బహుశా మీరు అతనికి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోయినా.. మీరు పంపిన టెక్స్ట్ మెసేజ్ కు రిప్లై రాకపోయినా.. ఇలాంటి కలలు వచ్చే అవకాశం ఉంది. అలాగే.. మీ మనసులోని భావాలను నిర్భయంగా మీ బాయ్ ఫ్రెండ్ కు చెప్పలేకపోతున్నా.. చెప్పినా అతడు వాటిని పట్టించుకోకుండా ఉన్నా.. గేలి చేసినా.. నెగెటివ్ గా తీసుకొన్నా.. ఇలాంటి కలలు వచ్చే అవకాశం ఉంటుంది..

Featured Photo: Shutterstock

Gifs: Giphy, Tumblr

Also Read: సెల్ఫ్ లవ్.. మిమ్మల్ని ప్రేమించుకోవడం ఎందుకు ముఖ్యమంటే..

Read More From Lifestyle