Decor Inspiration

ప్లాస్టిక్ రహితం మాత్రమే కాదు.. మరెన్నో ప్రత్యేకతలతో జరిగిన వివాహం ఇది ..!

Soujanya Gangam  |  Nov 19, 2019
ప్లాస్టిక్ రహితం మాత్రమే కాదు.. మరెన్నో ప్రత్యేకతలతో జరిగిన వివాహం ఇది ..!

ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైంది ఏదైనా ఉందంటే..  అది ప్లాస్టిక్ (Plastic). దీనివల్ల భూమి మొత్తం కాలుష్యంతో నిండిపోతోంది. ఎవరెస్ట్ శిఖరం నుంచి మహా సముద్రాల వరకూ.. ప్లాస్టిక్ చేరని స్థలం లేదంటే అది అతిశయోక్తి కాదు. ఈ ప్లాస్టిక్‌ని అరికట్టేందుకు పలు ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలు తమవంతు ప్రయత్నాలు తాము చేస్తున్నాయి.

కొన్ని దేశాలు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ని నిషేధించాయి కూడా. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం దాదాపు శూన్యమనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ క్రమంలోనే అక్కడక్కడా పలు పర్యావరణ హితమైన కార్యక్రమాలు కూడా జరగడం ఆనందదాయకం. అలాంటి కార్యక్రమాలను చూసి ప్రేరణను పొంది.. ఓ యువ జంట ప్లాస్లిక్ రహితంగా.. తమ వివాహం (Wedding) జరగాలని కోరుకుంది. తాజాగా ఈ వివాహం విజయనగరంలోని వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన.. మన్నార్ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగింది. కేవలం ప్లాస్టిక్‌ను ఉపయోగించకపోవడం మాత్రమే కాదు.. ఈ వివాహంలో ఇంకా మరెన్నో ప్రత్యేకతలకు నాంది పలికారు. 

పెళ్లికి సిద్ధమయ్యేందుకు.. ఈ వధువులిచ్చే సలహాలు ఎంతో తోడ్పడతాయి..!

విజయనగరానికి చెందిన తూనుగుంట్ల గుప్త, విజయ కుమారి దంపతుల కుమార్తె మౌనిక. చిన్నతనం నుంచి సమాజానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలని భావిస్తుండేదట ఆమె. అందుకే తమ ఇంట్లో మూడేళ్ల నుంచి ప్లాస్టిక్‌ని బ్యాన్ చేయడానికి సంకల్పించిందట.

ఇంటికి వచ్చేవారు కూడా ప్లాస్టిక్ తీసుకురాకూడదని.. అలా వస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా ఇంటి బయట బోర్డు పెట్టారు. ఇక మౌనికకి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించినప్పుడు పర్యావరణ హితంగా పెళ్లి చేసుకోవాలనే తన కోరికను బయట పెట్టింది. దీనికి ఆమె తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో ఆమె వివాహం ప్రత్యేకంగా మారింది.

ఈ క్రమంలో వివాహ ఆహ్వాన పత్రికల నుంచి ప్రతి ఒక్కటీ పర్యావరణ హితంగా ఉండేలా చూసుకున్నారు. పెళ్లి వేదిక ముందు ప్లాస్టిక్‌తో తయారుచేసిన ఫ్లెక్సీలపై వధూవరుల పేర్లు రాయడం మనం చూస్తుంటాం. దీనికి భిన్నంగా వీళ్లు కొబ్బరాకులతో చేసిన చాపకు చేనేత వస్త్రాన్ని కట్టి దానిపై సహజ రంగులతో వధూవరుల పేర్లు రాశారు. సహజ రంగులే అయినా.. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.

 

ఇక పెళ్లి మండపం అలంకరణ కోసం మామిడాకులు, అరిటాకులు, కొమ్మలు, వివిధ రకాల పూలు, కొబ్బరి ఆకులు, తాటి ఆకులను ఉపయోగించారు. ఈ అలంకరణలో భాగంగా బంతి పూలతో చుట్టిన తాటాకు గొడుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చుట్టూ పచ్చదనం పరుచుకున్నట్లుగా ఉండే మంటపంతో పాటు.. కొబ్బరాకులు, అరటి, మామిడాకులతో పాటు.. వివిధ రకాల పూలతో అలంకరించిన విధానం అందరిని అబ్బురపరిచింది.

అలాగే బంతిపూల మాలలకు వేలాడిన కొబ్బరాకు చిలకలు అందరినీ ఆకర్షించాయి. వీటితో పాటు అలంకరణ కోసం వరి కంకులను కూడా ఉపయోగించడం విశేషం. వరి కంకులన్నింటినీ బొకేలా చేసి.. వాటిని వివాహ వేదిక వద్ద అక్కడక్కడా ఉపయోగించడం చూపరులను ఆకట్టుకుంది.

ఈ దుప‌ట్టాల‌తో మీ బ్రైడ‌ల్ లుక్‌ని.. మ‌రింత మెరిపించండి..!

అంతేకాదు.. పెళ్లి వేదిక వద్ద “పాలిథిన్, ప్లాస్టిక్ మానవ జాతికి చాలా పెద్ద హాని” అని కూడా చాటి చెప్పారు. “ఈ కల్యాణం లోక కల్యాణానికి నాంది కావాలి”..   “ప్రతి ఒక్కరం పంచభూతాలను పరిరక్షిద్దాం, భావితరాలకు స్పూర్తినిద్దాం” అంటూ సహజ రంగులతో రాసిన బ్యానర్‌ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం.

కేవలం అలంకరణలో మాత్రమే కాదు.. వివాహంలో కూడా ఎక్కడా ప్లాస్టిక్ ఉపయోగించలేదు. భోజనాలను అరిటాకుల్లో వడ్డించి నీటిని మట్టి గ్లాసుల్లో అందించారు. వీటితో పాటు పెళ్లికి వచ్చిన బంధువులందరికీ రిటర్న్ గిఫ్ట్‌గా నారతో చేసిన సంచులను అందించడం విశేషం.

పెళ్లి కూతుళ్లు.. తమ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా?

అయితే కేవలం ప్లాస్టిక్‌ని నిషేధించి పర్యావరణ హితంగా నిలవడం మాత్రమే కాదు.. ఆరోగ్యం విషయంలోనూ ఈ వివాహంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఫంక్షన్లలో ఎక్కువగా నూనెలో వేపిన స్నాక్స్ కనిపిస్తున్నాయి. వీటికి బదులుగా ఈ పెళ్లిలో ఉడికించిన పల్లీలు, రాగి సున్నుండలు అందరికీ అందించారు.

ఉసిరి షర్బత్, జీరా వాటర్‌తో పాటు.. నీటిని కూడా వట్టివేరు, చిల్ల గింజలు, దాల్చిన చెక్క, తుంగముస్ట, జీలకర్ర వేసి మరిగించి.. చల్చార్చి వడకట్టి అందరికీ అందించారు. పెళ్లిలో వంటలకు ఉపయోగించే కూరగాయలు, ఇతర వస్తువులను కూడా.. ఆర్గానిక్‌గా పండించే రైతుల దగ్గర కొనుగోలు చేశారు. ఆరోగ్యం విషయంలో అందరికీ అవగాహన కల్పించేందుకే ఇలా చేశామని పెళ్లి కుమార్తె మౌనిక తల్లిదండ్రులు చెప్పడం విశేషం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.