పెళ్లి.. జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే వేడుక. దాన్ని వీలైనంత ఆనందంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కొందరు తమ వివాహాన్ని(Wedding) అట్టహాసంగా చేసుకోవాలనుకుంటే మరికొందరు సింపుల్‌గా జరపుకోవాలని భావిస్తారు. ఎవరైనా సరే.. తమ పెళ్లిలో ఎలాంటి ఇబ్బందీ కలగకుండా అంతా సజావుగా సాగిపోవాలనే భావిస్తారు. కానీ ఈ సందర్భంలో తలెత్తే చిన్న చిన్న ఇబ్బందులే ఈ వేడుకలో అవాంతరాలు సృష్టిస్తాయి.
లిప్‌స్టిక్ చెరిగిపోవడం, కట్టుకున్న చీర కాస్త చిరిగిపోవడం లేదా పెళ్లి సమయంలో హఠాత్తుగా నెలసరి రావడం.. ఇలా అనుకోని ఇబ్బందులు ఎన్నో ఎదురవుతుంటాయి. వీటన్నింటికీ మనం సిద్ధమై ఉంటే ఇవేవీ మన ఆనందాన్ని అడ్డుకోలేవు. అందుకే పెళ్లికి సిద్ధమయ్యేటప్పుడే దుస్తులు, నగలు, మేకప్ వంటివి సిద్ధం చేసుకోవడంతో పాటు.. ఒక ఎమర్జెన్సీ కిట్(Emergency kit)ని కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. మరి, ఆ కిట్‌లో ఏం ఉండాలో చూద్దాం రండి..
అందమైన మోము కోసం
పెళ్లిలో అందంగా కనిపించాలని అందమైన మేకప్‌తో సిద్దమై వివాహ వేదికకు వెళ్లిన తర్వాత ఏదో ఇబ్బంది ఎదురై లిప్‌స్టిక్ చెదిరిపోవడమో.. చెమట వల్ల ఐలైనర్ కరిగిపోవడమో జరిగితే అందంగా కనిపించడం దేవుడెరుగు.. మీ పెళ్లిలో మీరే బ్రైడ్‌జిల్లాగా కనిపిస్తారు. దీన్ని ఎదుర్కొనేందుకు కొన్ని మేకప్ ఉత్పత్తులను మీ ఎమర్జెన్సీ కిట్‌లో పెట్టుకోవడం తప్పనిసరి. మీ స్నేహితురాలు, కజిన్ లేదా సోదరికి ఈ ఎమర్జెన్సీ కిట్‌ని కాపాడే బాధ్యతను అప్పగించండి. ఇందులో ఉండాల్సినవేంటంటే..
1. లాంగ్‌లాస్టింగ్ లిప్‌స్టిక్ – పెళ్లి వేడుక కోసం మీకు బాగా నప్పే రంగు లిప్‌స్టిక్‌ని ఎంచుకోండి. ఈ లిప్‌స్టిక్ కూడా ఎక్కువ సేపు నిలిచి ఉండేదైతే మంచిది. ఇలాంటిదే మరో లిప్‌స్టిక్‌ని ఎమర్జెన్సీ కిట్‌లోనూ ఉంచడం వల్ల ఒకవేళ పెళ్లి వేడుకలో మీ లిప్ మేకప్ చెరిగిపోతే మళ్లీ వేసుకునే వీలుంటుంది. దీన్ని అప్లై చేసుకోవడానికి వీలుగా ఓ అద్దాన్ని కూడా అందుబాటులో ఉంచుకోండి.
2. కాంపాక్ట్ పౌడర్ – పెళ్లి వేడుకల మధ్యలో కెమెరాలతో ఉండే వేడి వల్ల, గాలి వల్ల మేకప్ చెదిరిపోతుంటే ఈ కాంపాక్ట్ పౌడర్‌తో టచప్ చేసుకోవచ్చు.
3. కన్సీలర్ – పెళ్లి కోసం ఎంత బాగా రడీ అయినా సరే.. ఒక్కోసారి అనుకోకుండా వచ్చే మొటిమలను కవర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మేకప్‌తో ముందుగానే కవర్ చేసినా ఒకవేళ మళ్లీ అవసరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ కిట్‌లోనూ ఉంచుకోవడం మంచిది.
4. మేకప్ రిమూవర్ – ఒక్కోసారి మేకప్ కొద్దిగా చెరిగినా పూర్తిగా వేయాల్సి వస్తుంది. లేదంటే ప్యాచెస్‌లా కనిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఉపయోగించడానికి వీలుగా మేకప్ రిమూవర్‌ని కిట్‌లో ఉంచుకోవచ్చు. పెళ్లి తర్వాత ఇంకేదైనా వేడుకలకు మళ్లీ ఫ్రెష్‌గా మేకప్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
5. వ్యాసెలిన్ – పెళ్లి సందర్భంలో ఇది ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో ఎవరికీ తెలియదు. చేతులు పొడిగా అనిపించినా.. స్లీవ్‌లెస్ వేసుకుంటే చంకలు పొడిబారకుండా ఉండేందుకు, పొడిబారిన పెదాలకు ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అనుకోకుండా లిప్‌స్టిక్ పళ్లకు అంటితే వ్యాసెలిన్ రుద్ది టిష్యూతో తుడిచేసే వీలుంటుంది.
6. నెయిల్‌పాలిష్ – పెళ్లి వేడుకల సందర్భంగా ఏవైనా పనులు చేస్తున్నప్పుడు నెయిల్ పాలిష్ కొద్దిగా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మీరు వేసుకున్న రంగు నెయిల్‌పాలిష్ ఒకటి ఎమర్జెన్సీ కిట్‌లో ఉంచుకుంటే ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది.
చక్కటి కురుల కోసం
పెళ్లిలో చక్కటి హెయిర్‌స్టైల్ వేసుకుంటారు. కానీ అసలు వేడుక ప్రారంభమైన తర్వాత మీరు మీ పనిలో ఉంటే జుట్టు చెదిరిపోతుంది. ఇలాంటి జుట్టుతో ఫొటోలు దిగితే అంత సరిగ్గా రావు.. అందుకే మీ అందమైన హెయిర్‌స్టైల్ చెదిరిపోకుండా ఉండేందుకు ఎమర్జెన్సీ కిట్‌లో కొన్ని వస్తువులు అందుబాటులో ఉంచుకుంటే మంచిది.
1. పక్క పిన్నులు – జుట్టు లూజ్‌గా మారుతుంటే దాన్ని అదే పొజిషన్లో ఉంచేందుకు వీటి కంటే బెటర్ ఇంకేవీ ఉండవనే చెప్పాలి.
2. హెయిర్ స్ప్రే – హెయిర్ స్ప్రే మినీ బాటిల్ ఒకటి మీ కిట్‌లో ఉంచుకోవడం వల్ల మీ జుట్టు స్టైలింగ్ చేసిన తర్వాత అది ఎలా ఉందో అలాగే నిలిచి ఉంటుంది. ఒకవేళ మీ జుట్టు లూజ్ కావడం లేదా జుట్టు రేగడం వంటివి జరిగితే కాస్త హెయిర్ స్ప్రే కొట్టి పిన్‌తో దాన్ని తిరిగి అందంగా కనిపించేలా చేయవచ్చు.
3. దువ్వెన – జుట్టు రేగుతుంటే దాన్ని తిరిగి సెట్ చేయడానికి హెయిర్ స్ప్రేతో పాటు దువ్వెన కూడా అవసరమే.
4. హెయిర్ క్లిప్స్, రబ్బర్‌బ్యాండ్స్ – వీటి అవసరం పెద్దగా ఉండదు. కానీ ఎప్పుడు దేని అవసరం వస్తుందో చెప్పలేం కాబట్టి.. ఇవి కూడా అందుబాటులో ఉంచుకోవడం అవసరమే.
ఇవీ అందుబాటులో ఉంచుకోండి..
కేవలం అందానికి సంబంధించినవే కాదు.. ఇతర ఎమర్జెన్సీలకు సంబంధించిన వస్తువులు కూడా అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పెళ్లి సమయంతో ఒత్తిడి వల్ల ఏదైనా జరిగే అవకాశం ఉంది.
1. ఫ్రెష్ మింట్ – పెళ్లి సమయంలో నోటి నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా చూసుకోవడం అత్యవసరం. అందుకే దీన్ని మీ కిట్‌లో ఉంచుకోండి.
2. ఫ్రెష్ వైప్స్ – పెళ్లి సమయంలో ఏదైనా ఇబ్బందయినప్పుడు ఇవి ఉపయోగపడతాయి. పెళ్లి వేడుకల్లో భాగంగా చేతుల్లో రకరకాల వస్తువులు పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత దీంతో శుభ్రం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీటితో పాటు టిష్యూలు, కాటన్ బాల్స్ కూడా ఉంచుకోవడం మంచిది.
3. పెర్ఫ్యూమ్ – మీరు పెళ్లికి ముందు దీన్ని ఉపయోగించినా మళ్లీ మధ్యలో అవసరం ఎదురవ్వచ్చు. లైట్ల వేడితో పాటు హోమం చుట్టూ తిరిగేటప్పుడు మరింత వేడిగా ఉండి చెమటలు పోసే అవకాశం ఎక్కువ.
4. బ్యాండెయిడ్ – పెళ్లి సమయంలో కొత్త చెప్పులు కరవడం లేదా ఏదైనా దెబ్బ తగలడం వంటివి జరిగితే ఉపయోగపడుతుంది.
5. ప్యాడ్ లేదా టాంపూన్ – పెళ్లి సమయంలో అనుకోకుండా నెలసరి వస్తే దీని అవసరం తప్పక ఉంటుంది.
6. చిన్న కుట్టు మిషన్ – అచ్చం పిన్నులు కొట్టే స్టేప్లర్‌లా ఉండే హాండీ కుట్టు మిషన్‌ని పెళ్లి సమయంలో మీతో ఉంచుకోవడం వల్ల ఎప్పుడైనా చీర చిరిగితే ఇది ఉపయోగపడుతుంది.
7. సేప్టీ పిన్స్ – చీర కట్టు ఉన్నది ఉన్నట్లు నిలవడానికి. ఏదైనా చిరిగితే సేఫ్టీ పిన్స్ ఉపయోగించవచ్చు.
8. స్ట్రాలు – లిప్‌స్టిక్ చెదిరిపోకుండా నీళ్లు తాగేందుకు ఇవి ఎంతో అవసరం.
9. పెయిన్ కిల్లర్స్ – పెళ్లి వేడుకలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిలబడడం, కూర్చోవడం, అటు ఇటూ తిరగడం.. పూర్తిగా అలసిపోయే పనులు. అందుకే సాయంత్రానికి నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా పెయిన్ కిల్లర్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.
వీటితో పాటు తక్షణ శక్తినిచ్చే గ్రనోలా బార్స్, చాక్లెట్, ఎనర్జీ డ్రింక్‌లతో పాటు ఫోన్, ఛార్జర్, కొంత డబ్బు, ఒక కార్డు మీతో ఉంచుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి.
ఈ వధువు స్టెప్పులేస్తే.. ప్రపంచమే ఫిదా అయిపోయింది..!
పాట పాడి సర్‌ప్రైజ్ చేశాడు.. నెచ్చెలి మనసు దోచేశాడు..!
అమ్మానాన్నలను వదులుకోవడం నచ్చక.. సంప్రదాయాన్నే కాదన్న వధువు ..!