Lifestyle
ఎంత ప్రయత్నించినా బరువు పెరుగుతూనే ఉన్నారా? పీసీఓఎస్ కావచ్చు జాగ్రత్త..! (PCOS In Telugu)
పీసీఓఎస్ (PCOS) పాలీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.. మన దేశంలో ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది నేటితరం అమ్మాయిలు, మహిళల్లో వస్తున్న సమస్య.. దీనికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతౌల్యత (Harmonal imbalance). మహిళల శరీరాల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. ఈ రెండిటి విడుదల సమతుల్యంగా ఉంటే మన ఆరోగ్యం బాగున్నట్లే..
Table of Contents
- పీసీఓఎస్ అంటే ఏంటి? (What Is PCOS In Telugu)
- పీసీఓఎస్‌కి కారణాలేంటి? (Causes Of PCOS)
- పీసీఓఎస్ లక్షణాలేంటి? (Symptoms Of PCOS)
- పీసీఓఎస్ వల్ల సమస్యలున్నాయా? (Other Problems Which Occur Because Of PCOS)
- పీసీఓఎస్‌ని ఎలా గుర్తించాలి? (How To Diagnose PCOS)
- పీసీఓఎస్‌కి చికిత్స ఎలా? (Treatment)
- పీసీఓఎస్‌ని తగ్గించేందుకు జీవనశైలిలో ఎలాంటి మార్పులు అవసరం? (Changes In Lifestyle To Reduce PCOS)
- ఇంటిచికిత్స కూడా పనిచేస్తుంది.. (Food To Treat PCOS Problem)
అదే ఈ రెండింట్లో ఒకటి ఎక్కువగా విడుదలై.. మరొకటి తక్కువగా విడుదలైతే హార్మోన్లలో అసమతౌల్యత ఏర్పడి పీసీఓఎస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారిలో అండాశయాల్లో నీటి తిత్తులు ఏర్పడి అండాల విడుదలను అడ్డుకుంటాయి. దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమస్య ఎదురయ్యాక వీలైనంత తొందరగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
పీసీఓఎస్ సమస్య లక్షణాలేంటి?
పీసీఓఎస్ వల్ల సమస్యలున్నాయా?
జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి
పీసీఓఎస్ అంటే ఏంటి? (What Is PCOS In Telugu)
పీసీఓఎస్ అనేది పిల్లలు పుట్టే వయసులో ఉన్న ఆడవారిలో ఎదురయ్యే సమస్య. మన దేశంలో ఈ సమస్యకి గురైన వారు ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నారంటేనే ఈ సమస్య తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థ ఐదు హార్మన్లపై ఆధారపడి ఉంటుంది. ఈ ఐదు హార్మోన్లు సరైన స్థాయిలో విడుదలైతేనే సరైన ఆరోగ్యం మన సొంతమవుతుంది. వీటిలోని అసమతౌల్యత వల్ల మన అండాశయాల్లో సమస్య ఏర్పడుతుంది.
అండాశయాల్లో అండాలు విడుదలయ్యే ఫాలికల్స్ చుట్టూ నీటి బుడగలు ఏర్పడడం వల్ల అండాలు విడుదల కావు. దీంతో సంతానలేమి సమస్య ఏర్పడుతుంది. దీంతో పాటు హార్మోన్లలో సమతుల్యత లేకపోవడం వల్ల బరువు పెరిగిపోవడం, అవాంఛిత రోమాలు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
పీసీఓఎస్‌కి కారణాలేంటి? (Causes Of PCOS)
పీసీఓఎస్ ఫలానా కారణంతోనే వస్తుందన్న రూలేమీ లేదు. కానీ కొన్ని కారణాలు మాత్రం ఈ సమస్య ఎదురయ్యేలా చేస్తాయి.. అవేంటంటే..
అండాశయాలు విడుదల చేసే ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
ఇన్సులిన్ ఎక్కువగా విడుదల కావడం – మన రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్. మన శరీర కణాలు ఇన్సులిన్‌కి రెసిస్టెంట్‌గా మారి రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతుంటాయి.
దీన్ని తట్టుకోవడానికి శరీరం ఇన్సులిన్ మోతాదును పెంచుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయి మరింత పెరుగుతుంది. ఇన్సులిన్ మోతాదు ఎక్కువవడం వల్ల సాధారణంగా చాలా తక్కువగా విడుదలయ్యే ఆండ్రోజన్లు స్త్రీలలో ఎక్కువగా ఉత్పత్తవుతాయి. జన్యుపరంగా – మీ కుటుంబంలో పీసీఓఎస్ లేదా డయాబెటిస్ ఉన్నవారు ఉంటే మీకూ పీసీఓఎస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
పీసీఓఎస్ లక్షణాలేంటి? (Symptoms Of PCOS)
సాధారణంగా పీసీఓఎస్ లక్షణాలు మొదటిసారి రుతుక్రమం ప్రారంభమైనప్పటి నుంచి మెనోపాజ్ వరకూ ఎప్పుడైనా కనిపించవచ్చు. ఈ లక్షణాలన్నీ కనిపించకపోయినా.. కొంతమందిలో కొన్ని లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. అవేంటంటే..
– బరువు పెరగడం, తగ్గేందుకు చాలా సమయం పట్టడం
– మొటిమలు ఎక్కువగా రావడం
– హిర్సుటిజం ( శరీరం, ముఖంపై ఎక్కువగా జుట్టు రావడం)
– రుతుక్రమం క్రమం తప్పడం
– జుట్టు రాలిపోవడం
– పులిపిర్లు రావడం
– పాలీసిస్టిక్ ఓవరీస్ (అండాశయాల్లో నీటి బుడగలు)
– ఎక్కువగా అలసిపోవడం
– మూడ్‌స్వింగ్స్
పీసీఓఎస్ వల్ల సమస్యలున్నాయా? (Other Problems Which Occur Because Of PCOS)
పీసీఓఎస్ సమస్య ఉందని తెలియగానే చికిత్స తీసుకోవాలి. లేదంటే దీని వల్ల భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటంటే..
– రక్తస్రావం చాలా ఎక్కువగా లేదా తక్కువగా అవ్వడం
– డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు
– ఎండోమెట్రియల్ క్యాన్సర్
– డయాబెటిస్, రక్తపోటు
– ఇన్‌ఫర్టిలిటీ
– మెటబాలిక్ సిండ్రోమ్
– నిద్రలేమి
– గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం
పీసీఓఎస్‌ని ఎలా గుర్తించాలి? (How To Diagnose PCOS)
పీసీఓఎస్ సమస్య లక్షణాలు కనిపించగానే దాన్ని గుర్తించడం కోసం పరీక్షలు చేయించుకోవడం మంచిది. అందుకే కారణం లేకుండా బరువు పెరుగుతున్నా.. రుతుక్రమంలో మార్పులు కనిపిస్తున్నా.. హిర్సుటిజం, యాక్నే వంటి సమస్యలు ఎదురవుతున్నా పీసీఓఎస్ ఉందేమోనని అనుమానించి పెల్విక్ స్కాన్ చేయించుకోవాలి. దీనివల్ల అండాశయాలు, ఇతర ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు.
పీసీఓఎస్‌కి చికిత్స ఎలా? (Treatment)
పీసీఓఎస్ అనేది క్రానిక్ సమస్య. అంటే సమస్య వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గేందుకు చాలా సమయం పడుతుంది. అయితే ఈలోపు సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. మంచి జీవనశైలి, చక్కటి మందుల సాయంతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ సమస్యకు ఉన్న ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందంటే..
కాంబినేషన్ థెరపీ (Combination Therapy)
గర్భం రాకుండా చేసే బర్త్ కంట్రోల్ పిల్స్‌లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ సమాన స్థాయుల్లో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ స్థాయులు అదుపులో ఉండడంతో పాటు.. యాండ్రోజెన్ స్థాయులు అదుపులో ఉంటాయి. దీనివల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు తగ్గడంతో పాటు ఎక్కువ రక్తస్రావం, అవాంఛిత రోమాలు, మొటిమలు వంటివి తగ్గుతాయి. రోజూ పిల్స్ తీసుకోవడం కష్టం అనుకుంటే స్కిన్ ప్యాచ్ లేదా వజైనల్ రింగ్ కూడా ఉపయోగించవచ్చు.
ప్రొజెస్టిన్ థెరపీ (Progestin Therapy)
ప్రొజెస్టిన్ హార్మోన్ మాత్రలను నెలలో పద్నాలుగు రోజులు తీసుకోవాలి. ఇలా రెండు నెలల పాటు చేస్తే మీ శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా మారే వీలుంటుంది. అయితే ఇది మన శరీరంలో యాండ్రోజన్ల స్థాయిని తగ్గించదు. అంతేకాదు.. ఇది గర్భం రావడాన్ని కూడా అడ్డుకోదు. అందుకే గర్భం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇది చక్కటి ఎంపిక.
పీసీఓఎస్ సమస్య తగ్గుముఖం పట్టాలంటే.. చికిత్సతో పాటు లైఫ్ స్టైల్ మార్పులు తప్పనిసరి. ఈ తరహా మార్పుల వల్లే ఎక్కువ కాలం పాటు మందులపై ఆధారపడకుండా పీసీఓఎస్ సమస్యను తగ్గించుకునే వీలుంటుంది.
పీసీఓఎస్‌ని తగ్గించేందుకు జీవనశైలిలో ఎలాంటి మార్పులు అవసరం? (Changes In Lifestyle To Reduce PCOS)
ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోండి.. (Increase Intake Of Protein)
పీసీఓఎస్ సమస్యకు కారణమైన యాండ్రోజెన్ హార్మోన్ రక్తంలో చక్కెరలు ఎక్కువయ్యేలా చేస్తుంది. పైగా ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పన్నమవుతుంది కూడా. అందుకే ఈ సమస్యతో బాధపడుతుంటే.. వీలైనంత మేరకు కార్బొహైడ్రేట్లను తగ్గించి ప్రొటీన్లు, ఫ్యాట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇది వీలుపడకపోతే కనీసం కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లను సమాన మోతాదుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే కార్బొహైడ్రేట్లలో కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి మన శరీరంలోకి విడుదలయ్యే చక్కెరలను నెమ్మదించేలా చేస్తాయి. దీనివల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది.
గ్లైసిమిక్ ఇండెక్స్ గమనించండి. (Consider The Glycemic Index)
గ్లైసిమిక్ ఇండెక్స్.. ఒక పదార్థం మన రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచే స్థాయిని ఆధారంగా చేసుకొని.. వివిధ ఆహారపదార్థాలను కొలిచే ఇండెక్స్ ఇది. పీసీఓఎస్ ఉన్నవారికి ఇప్పటికే రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇలాంటివారు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
యాక్టివ్‌గా ఉండండి. (Be Active)
పీసీఓఎస్‌ని దూరం చేసుకోవడానికి ఆహారంతో పాటు ప్రధానంగా యాక్టివ్ జీవనశైలిని కొనసాగించడం ఎంతో అవసరం. దీనికోసం కనీసం వారానికి ఐదు రోజులు వ్యాయామం చేయడంతో పాటు రోజూ కనీసం పదివేల అడుగుల టార్గెట్‌ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఇంట్లో పనులు కూడా చేయడం అలవాటు చేసుకోవడంతో పాటు రోజూ కూర్చునే సమయాన్ని తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
అంతేకాదు.. ఇలాంటివారికి పొట్ట, తొడలు వంటి భాగాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది .కాబట్టి ఈ భాగాలకు ఎక్కువ వ్యాయామం అందించాలి. కార్డియో కోసం ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు చేస్తూనే కొవ్వు శాతాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
దీనికోసం రెసిస్టెన్స్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తుండాలి. అయితే వ్యాయామం చేయడం అవసరమే కానీ దీన్ని మరీ ఎక్కువగా కూడా చేయకూడదు. ఇలా వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల అడ్రినల్ గ్రంథులు ప్రేరేపితమైన అడ్రినలిన్ ఉత్పత్తి చేస్తాయి. ఇవి మీ సమస్యను మరింత పెంచుతాయి. అందుకే వ్యాయామం కూడా మితంగా చేయాల్సి ఉంటుంది.
కాఫీ మానేయండి. (Avoid Coffee)
కొంతమంది పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో భాగంగా.. కాఫీ పీసీఓఎస్ సమస్యను పెంచుతుందని గుర్తించారట. అందుకే పీసీఓఎస్ సమస్య తగ్గాలంటే కాఫీకి దూరంగా ఉండడం మంచిదని వారి సలహా. మరీ తాగకుండా ఉండలేకపోతే రోజంతా కలిపి ఒక కప్పు తీసుకోవడం మంచిది. కాఫీ తీసుకోవడం వల్ల మన శరీరంలో సహజంగా విడుదలయ్యే ఈస్ట్రోజన్ ఉత్పత్తి పెరిగి.. హార్మోన్ల అసమతౌల్యత సమస్య ఏర్పడుతుంది. అందుకే కాఫీని వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది.
ఏయే ఆహార పదార్థాలు తీసుకోకూడదు? (Food Items That Should Not Be Taken)
పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. మరికొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పీసీఓఎస్ సమస్య తొందరగా తగ్గే వీలుంటుంది. మరి, ఏయే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ పీసీఓఎస్ సమస్య తగ్గుముఖం పడుతుందంటే..
తీసుకోవాల్సిన పదార్థాలు.. (Food Items That Should Be Taken)
– ప్రాసెస్ చేయని ఆహార పదార్థాలు
– పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు
– సాల్మన్, ట్యూనా, సార్డైన్‌లాంటి కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు
– పాలకూర, కేల్ లాంటి ఆకుకూరలు
– ముదురు ఎరుపు, నలుపు రంగులో ఉండే పండ్లు (ఉదా – ద్రాక్ష, బ్లాక్‌బెర్రీ, చెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు)
– బ్రొకోలీ, కాలీఫ్లవర్
– బీన్స్, పప్పుధాన్యాలు
– ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే నూనెలు ఉదా – కొబ్బరి నూనె, ఆలివ్ నూనె
– కొబ్బరి, అవకాడో లాంటి పండ్లు
– పైన్ నట్స్, బాదం, పిస్తా, వాల్‌నట్స్..
– డార్క్ చాక్లెట్ (తక్కువ మోతాదులో)
– పసుపు, దాల్చిన చెక్క పొడి వంటి మసాలాలు
వంటి పదార్థాలన్నీ రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
తీసుకోకూడని పదార్థాలు (Ingredients That Should Not Be Taken)
– వైట్ బ్రెడ్
– మైదాతో చేసిన పదార్థాలు
– ఫ్రై చేసిన పదార్థాలు
– ఫాస్ట్ ఫుడ్
– సోడాలు, కోలాలు, ఇతర ఎనర్జీ డ్రింకులు
– ప్రాసెస్ చేసిన మాంసం
– రెడ్‌మీట్, పంది మాంసం
ఇంటిచికిత్స కూడా పనిచేస్తుంది.. (Food To Treat PCOS Problem)
పీసీఓఎస్‌ని తగ్గించేందుకు కేవలం మందులు, జీవనశైలిలో మార్పు మాత్రమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. ఈ తరహా ఆహార పదార్థాలను ఇంటి చికిత్సగా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల పీసీఓఎస్ ముప్పు తగ్గుతుంది. దీనికోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేంటో మీకు తెలుసా?
1. యాపిల్ సైడర్ వెనిగర్‌తో.. (Apple Cider Vinegar)
రోజూ కాస్త యాపిల్ సైడర్ వెనిగర్‌ని తీసుకోవడం వల్ల బరువు మాత్రమే కాదు.. పీసీఓఎస్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ. ప్రతీ రోజూ గ్లాసు వేడి నీళ్లలో రెండు టీస్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. కొన్నాళ్లు ఈ మిశ్రమాన్ని ఉదయం మాత్రమే తీసుకున్నా.. తర్వాత రోజుకి రెండు, మూడు సార్లు తీసుకోవడం మంచిది.
2. కొబ్బరి నూనెతో.. (Coconut Oil)
కొబ్బరి నూనెను రోజూ తీసుకున్నా.. అందులోని గుణాలు మన ఆరోగ్యం బాగుపడేలా.. హార్మోన్ల స్థాయి సమతుల్యమయ్యేలా చేస్తుంది. పీసీఓఎస్ సమస్యను తగ్గిస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా రోజుకో టేబుల్ స్పూన్ వర్జిన్ కొకోనట్ ఆయిల్‌ని తీసుకొని దాన్ని ఆహారంలో భాగంగా శరీరానికి అందేలా చేయాలి. ఇలా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. అందుకే రోజూ స్మూతీల్లో, ఇతర వంటకాల్లో కలిపి దీన్ని తీసుకోవడం మంచిది.
3. గ్రీన్ టీ (Green Tea)
గ్రీన్ టీ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. గ్రీన్ టీ పీసీఓఎస్ సమస్యను తగ్గించేందుకు సహజమైన పదార్థంగా ఉపయోగపడుతుంది. ఈ గ్రీన్ టీని రోజూ నాలుగైదు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
4. కలబంద రసం (Aloe Vera Juice)
కలబంద రసం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మార్కెట్లో లభించే కలబంద రసం తాగడం లేదా మీరే స్వయంగా కలబంద ఆకులను శుభ్రం చేసి.. తెల్లని గుజ్జులాంటి పదార్థాన్ని తీసి జ్యూస్ చేసుకొని తాగడం చేయాలి. ఇలా రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అండాశయాల పనితీరు మెరుగుపడుతుంది.
5. తాటిబెల్లం (Thati Bellam)
రక్తంలోని చక్కెర స్థాయులను మెయిన్‌టెయిన్ చేయడానికి సాధారణ చక్కెర, బెల్లాల కంటే తాటిబెల్లం చక్కటి ఎంపిక. ఇది గ్లైసిమిక్ లెవల్లో ఉంటుంది కాబట్టి.. ఒకేసారిగా గ్లూకోజ్ విడుదల చేయకుండానే శరీరానికి శక్తిని అందిస్తూ ఉంటుంది. ఇందులోని క్యాలరీలు కూడా తక్కువ కాబట్టి.. దీన్ని రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవచ్చు.
6. తేనె, దాల్చిన చెక్క (Honey And Cinnamon)
తేనెలో ఎన్నో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలుంటాయి. ఇక దాల్చిన చెక్క బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. దీనికోసం టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని.. టేబుల్ స్పూన్ తేనెతో కలిపి రోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది.
7. లికోరైస్ రూట్ (Licorice Root)
ఈ తరహా మొక్క వేర్లలో హార్మోన్లను కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలోని ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్ల స్థాయుల్లో మార్పు వచ్చి అవి సమతుల్యంగా మారతాయి. దీనివల్ల పీసీఓఎస్ సమస్య కూడా తగ్గుతుంది. దీనికోసం ఈ వేరు పొడిని అర టీస్పూన్ తీసుకొని.. అందులో నీళ్లు కలిపి టీలా చేసుకొని కనీసం రోజుకోసారి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి.
సానియా మీర్జా 4 నెలల్లో 22 కేజీల బరువు తగ్గింది.. ఎలాగో తెలుసా..?
నిద్రంటే ప్రాణమైతే.. ఇలాంటి ఆలోచనలు మీకూ వస్తుంటాయి..!
బొప్పాయి మీకందించే.. బహుచక్కని ప్రయోజనాలేమిటో తెలుసా..?
Images – Shutterstock.