Lifestyle
#POPxoTeluguExclusive చదరంగం.. నా జీవితంలో అంతర్భాగం: పద్మశ్రీ గ్రహీత హారిక ద్రోణవల్లితో ముఖాముఖి
హారిక ద్రోణవల్లి(Harika Dronavalli).. పరిచయం అక్కర్లేని పేరు. చదరంగంలో గ్రాండ్ మాస్టర్‌గా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన యువ కెరటం. ఆమె గురించి ఆమె సాధించిన విజయాలే చెబుతాయి. మన దేశం నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా అందుకొన్న రెండో అమ్మాయి హారిక.
ప్రస్తుతం ఆసియా చెస్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో, అంతర్జాతీయ చెస్ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో కొనసాగుతూ.. గెలుపుపథంలో హారిక దూసుకెళుతోంది. విజయం సాధించినప్పుడు పొంగిపోవడం, అపజయం ఎదురైతే కుంగిపోవడం ఆమెకు అలవాటు లేదు. రెండింటినీ సమానంగా స్వీకరించి మరింత మెరుగ్గా ఆడటమే హారికకు తెలుసు.
అందుకే ఆమె నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చదరంగంలో ఆమె చూపుతోన్న ప్రతిభకు గుర్తింపుగా ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా పౌర పురస్కారం పద్మశ్రీని స్వీకరించింది. మీకు మరో విషయం తెలుసా? విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి తర్వాత పద్మశ్రీ స్వీకరించిన చెస్ దిగ్గజం హారికే.
ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించడమే నా కల. దాని కోసం ఎంత కష్టమైనా పడతానంటోన్న హారిక ద్రోణవల్లితో POPxo ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విశేషాలు షార్ట్ అండ్ స్వీట్‌గా మీకోసం..
చదరంగంలో మీకు స్ఫూర్తి ఎవరు?
వరల్డ్ చెస్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 కు చేరుకొన్న తొలి మహిళగా చరిత్ర సృష్టించిన జుడిత్ పోల్గర్ నాకు స్ఫూర్తి. హంగేరీకి చెందిన ఆమె సాధించిన విజయాలు నాలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి.
చెస్ ఆడేందుకు మీ ఫేవరెట్ ప్రదేశాలు ఏంటి?
ఐస్ లాండ్, జిబ్రాల్టర్, స్వీడన్, ఇంకా కొన్ని యూరోపియన్ దేశాలు.
ఎనిమిదేళ్ల వయసు నుంచి మీరు చెస్ ఆడుతున్నారు. ఎప్పుడూ దాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారా? బోర్ ఫీలయిన సందర్భాలున్నాయా?
చిన్నతనంలో చెస్ శిక్షణను నేను అంతగా ఇష్టపడేదాన్ని కాదు. టోర్నమెంట్స్ ఆడేటప్పుడు ఎదురయ్యే ఒత్తిడి అసలు నచ్చేది కాదు. కానీ చదరంగంలో నేను సాధించిన విజయాలను ఆస్వాదించడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి చెస్ నా జీవితంలో విడదీయలేని బంధంగా మారిపోయింది. ఇప్పుడు అది లేకుండా నేను ఉండలేను. అది నా జీవితంలో అంతర్భాగం.
ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికి మీరు ఏం చేస్తారు?
టీవీ, సినిమాలు చూస్తాను. ఖత్రోన్ కే కిలాడీ షోను ఇష్టంగా చూస్తాను.
టోర్నమెంట్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీరు చేసే మొదటి పని?
ఇంట్లో వండిన వంటకాలు తినడం.
చెస్ ఆడేటప్పుడు.. ఎత్తుకు పై ఎత్తు వేసే ముందు మీ ఆలోచనా విధానం ఎలా ఉంటుంది?
ఎన్ని రకాలుగా ఎత్తులు వేయచ్చో ఆలోచిస్తాను. ప్రత్యర్థి ఏ రకమైన ఎత్తులు వేయగలడో ఊహిస్తాను. ఉన్నవాటిలో మెరుగైన ఎత్తు వేస్తాను.
చెస్‌ను కెరీర్‌గా మీరు ఎందుకు ఎంచుకొన్నారు?
దీనికి సమాధానం నాక్కూడా తెలియదు. అలా జరిగిపోయిందంతే. సరదాగా ఆడటం మొదలుపెట్టాను. విజయాలు దక్కడంతో అలా దాన్ని కొనసాగించాను. నాకు తెలియకుండానే ఇది నా భవిష్యత్తుగా మారిపోయింది.
మీ హాబీస్ ఏంటి?
బ్యాడ్మింటన్ ఆడతాను. మ్యూజిక్ వింటాను. బుక్స్ చదువుతాను. కామిక్స్, జీవిత చరిత్రలు చదవడానికి ఇష్టపడతాను. చిన్నప్పటి నుంచి టింకిల్ బుక్ చదవడమంటే చాలా ఇష్టం. అందులో ఉన్న కథలన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి.
మీ చెస్ కెరీర్‌లో మరపురాని రోజు ఏది?
ప్రత్యేకంగా ఇది అంటూ ఏదీ చెప్పలేను. అలాంటి మరచిపోని క్షణాలు నాకు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పతకాలు అందుకొంటున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొదటి టైటిల్ అందుకొన్నప్పటి నుంచి పద్మశ్రీ పురస్కారం వరకు నాకు అన్నీ ప్రత్యేకమే.
పద్మశ్రీ పురస్కారం తీసుకొంటున్నప్పుడు మీకేమనిపించింది?
ఈ పురస్కారం చాలా విలువైనది. కొన్నేళ్లుగా నేను పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు లభించిందనే భావన, తృప్తి కలిగాయి.
ఈ తరానికి మీరిచ్చే సందేశం?
లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ కలల్ని సాకారం చేసుకొనే క్రమంలో ఎక్కడా రాజీ పడొద్దు. అప్పుడు విజయం దానంతట అదే వస్తుంది.
హారిక ద్రోణవల్లి గురించి మరికొన్ని విశేషాలు
జనవరి 12, 1991 తేదిన గుంటూరు జిల్లాలోని గోరంట్లలో జన్మించింది హారిక. ఏడేళ్ల వయసులో తండ్రితో కలసి చెస్ ఆడడం ప్రారంభించింది. ఆమెలోని ప్రతిభను గుర్తించి తండ్రి ప్రోత్సహించడంతో పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఈ పరిస్థితుల్లో చదువా? చదరంగమా? అనే ప్రశ్న వచ్చినప్పుడు చదరంగం వైపే ఆమె మొగ్గు చూపారు. నెమ్మదిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ చదరంగంలో విమెన్ గ్రాండ్ మాస్టర్‌గా హారిక ఎదిగింది. ఆపై అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ స్థాయికి చేరుకొంది. కోనేరు హంపి తర్వాత ఆ స్థాయిని చేరుకొన్న భారతీయ అమ్మాయి హారికే. చెస్‌లో క్వీన్‌గా వెలుగొందుతోన్న హారిక గతేడాది హైదరాబాద్‌కు చెందిన కార్తీక్ చంద్రను వివాహం చేసుకొన్నారు.
ఇవీ హారిక సాధించిన ఘనతలు:
2012, 2015, 2017 సంవత్సరాల్లో జరిగిన ప్రపంచ మహిళల ఛాంపియన్ షిప్‌లో కాంస్యపతకాలు గెలుచుకొంది.
2008లో ప్రపంచ మహిళల జూనియర్ ఛాంపియన్ షిప్ టైటిల్
2010లో కామన్వెల్త్ మహిళల ఛాంపియన్ షిప్ టైటిల్
2015లో ఏషియన్ ఛాంపియన్ షిప్ టైటిల్
2011లో ఆన్ లైన్ బ్లిట్జ్ ఛాంపియన్ షిప్ టైటిల్
2007లో అర్జున పురస్కారం
ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగిపోతోన్న హారికకు POPxo Team చెబుతోంది ఆల్ ది బెస్ట్.
Also Read: సమాజం గొడ్రాలు అని ఏడిపిస్తే.. మొక్కలు ఆమెను వృక్షమాతను చేశాయి..!
అమ్మాయిలను మనుషులుగా చూడండి.. మార్పు అదే వస్తుంది: నీలిమ పూదోట
Images: Facebook.com/Grandmasterharika