Lifestyle

“కన్యాశుల్కం” నాటకంలోని.. చిత్రమైన సంభాషణలు మీకోసం

Babu Koilada  |  Feb 21, 2019
“కన్యాశుల్కం” నాటకంలోని.. చిత్రమైన సంభాషణలు మీకోసం

సంఘ సంస్కరణే ప్రధాన ఇతివృత్తంగా బాల్య వివాహాలు, వేశ్యావృత్తి హైన్యత, నాటి స్త్రీల దుస్థితి, కుహనా మేధావుల ఆలోచనలు.. వీటన్నింటినీ ప్రధాన వస్తువులుగా తీసుకొని రచించిన నాటకమే “కన్యాశుల్కం” (Kanyasulkam). తెలుగులో ఆనాడు వచ్చిన ఆధునిక రచనల్లో ఇది కూడా ఒకటి. ఈ నాటకంలోని సంభాషణలు బహుళ ప్రజాదరణ పొందడం విశేషం. సాంఘిక దురాచారాలపై, మూఢాచారాలపై ఆనాడే ఆ నాటకాన్ని ఒక అస్త్రంగా వదిలిన గురజాడ.. సజీవమైన వాడుక భాషనే నాటక రచనకు ఉపయోగించి మరో విప్లవానికి తెరదీయడం జరిగింది.

ఈ నాటకంలోని కథ టూకీగా మీకోసం
అగ్నిహోత్రావధాన్లు అనే బ్రాహ్మణుడు ధనాశతో తన చిన్న కుమార్తెకు కన్యాశుల్కం తీసుకుని.. పండుముసలివాడైన లుబ్ధావధాన్లతో బాల్య వివాహం చేయాలని భావిస్తాడు. రామప్పంతులు అనే వ్యక్తి ఈ పెళ్లికి పెద్దగా ఉంటాడు. ఈ విషయం తెలిసి తన మేనకోడలికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు రంగంలోకి దిగుతాడు అవధానుల బావమరిది కరకటశాస్త్రి. ఆమెను ఆ ముప్పు నుండి తప్పించేందుకు గుంటూరు శాస్త్రులుగా పేరు కూడా మార్చుకుంటాడు.

తర్వాత తన శిష్యుడికి ఆడవేషం వేసి.. లుబ్ధావధాన్లను మోసగిచ్చి వారిద్దరికీ దొంగ పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లి చేయడానికి
మధురవాణి అనే వేశ్య సహాయం తీసుకుంటాడు. పెళ్లి జరిగాక.. కరకటశాస్త్రుల శిష్యుడు నగలు, బట్టలతో పారిపోతాడు. లుబ్ధావధాన్లు తాను మోసపోయానని గ్రహిస్తాడు. అగ్నిహోత్రావధానులు కూడా తనకు లుబ్దావధాన్ల వల్ల నష్టం జరిగిందని భావిస్తాడు.

అదే సమయంలో గిరీశం అనే ఓ కుహనా మేధావి, మోసగాడు అగ్నిహోత్రావధాన్ల కుమారుడికి ట్యూషన్ చెప్పే నెపంతో.. వారి ఇంట్లో చేరతాడు. అవధానుల మొదటి కుమార్తె, వితంతువైన బుచ్చెమ్మను చూసి వివాహం చేసుకోవాలని భావిస్తాడు. తర్వాత ఆమెను లేవదీసుకొనిపోతాడు. ఈ పరిస్థితుల మధ్య అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు కోర్టులో దావాలు వేసుకుంటారు.  ఈ కేసుల్లో నిజాన్ని నిగ్గుతేల్చేందుకు వచ్చిన సౌజన్యరావు పంతులు.. సమస్యలను పరిష్కరించడంతో పాటు గిరీశం అసలు స్వరూపాన్ని కూడా బయటపెట్టడంతో కథ ముగుస్తుంది.

ఈ నాటకంలోని పలు చిత్రమైన సంభాషణలు మీకోసం

మధురవాణి సంభాషణలు
1. డబ్బు తేని విద్య దారిద్ర్య హేతువ. ఈ వూళ్లో నారదుడు వచ్చి పాడినా.. నాలుగు దమ్మిడీలివ్వరు.

2. చిత్రగుప్తుడికి లంచం ఇవ్వగలరా.. అతడి దగ్గరికి మధురవాణిని పంపి, చేసిన పాపాలు అన్నీ తుడుపు పెట్టించటానికి వీలుండదు కాబోలు?

3. బుద్ధికి అంతా అసాధ్యమే.. డబ్బుకి ఎక్కడా అసాధ్యం లేదు

4. నేను నిజానికి అంటున్నాను. గడ్డి గాడిదలు తింటాయి. మనుషులు తినరు.

5. శ్రీకృష్ణుడు సానిదానితో కూడా స్నేహం కడతాడా అండీ..!

6. చెడనివారిని చెడగొట్టవద్దని మా అమ్మ చెప్పింది.

7. గురువుల ఉపదేశం గురువులే మరువకూడదు

గిరీశం సంభాషణలు
1. ఫుల్లుమూను నైటట.. జాస్మిన్ను వైటట.. మూను కన్నా మొల్ల కన్నా.. నీదు మోము బ్రైటట

2. మునసబు గారూ.. డిప్టీ కలక్టరు యెన్నిక చేసిన మనిషిని.. నామాటనే చెప్పుకోవాలా… నా తర్ఫీదులో ఉంచితే క్రిమినల్లో వరుసగా పోలీసు పరీక్ష రాయిస్తాను

3. మై డియర్ షేక్స్ పియర్.. నీ తండ్రి అగ్గిరావుడోయి.. మీ ఇంట్లో యవళ్లకీ అతన్ని లొంగదీసే యలోక్వెన్సు లేదు.

4. నా దగ్గర గొట్టికాయలు, గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చాతపడితే వేళ్లకి అంటుకుపోవాలి.

5. బ్రహ్మచారి యొక్క రియల్ డ్యూటీ అంటే.. విధింపబడిన పని యేమనగా.. విధవలను పెండ్లాడడమే

6. నాకు దేవుడు దివాన్గిరీ ఇస్తే భీమునిపట్నానికి పాల సముద్రం, విశాఖపట్నానికి మంచినీళ్ల సముద్రం, కళింగపట్నానికి చెరుకు సముద్రం తెస్తాను.

7. డామిట్.. కథ అడ్డం తిరిగింది

8.భోజరాజు ముఖం చూస్తే కవిత్వం పుట్టినట్లు, తమ ముఖం చూస్తే యెట్టివాడికైనా నిజమే నోటంట వస్తుందండీ.

9.యవిడెన్సు యాక్టులో అంజనాలు, పిశాచాలూ సాక్ష్యానికి పనికొస్తాయిటయ్యా

10.మైలా.. గియిలా.. మా ఇంగ్లీషువారికి ఆ లక్ష్యం లేదు.

రామప్ప పంతులు సంభాషణలు
1. ధనజాతకానికి డబ్బలా వస్తూ ఉంటుంది.

2. పాపపు సొమ్ము మా దగ్గిరకు రాగానే పవిత్రమైపోతుంది.

3. మరి యే కొంపలూ తిరక్కపోతే కేసులు గెలవడం యలాగ?

కరకట శాస్త్రి సంభాషణలు
1. వెనకటికి ఎవరో పోలీసు, తల్లి కూరగాయలు పుచ్చుకుంటే జుల్మానా వేశాట్ట

2. నేను హాస్యగాణ్ణేగానీ, యీ కూనీ గడబిడతో నా హాస్యం అంతా అణిగిపోయింది

ఇవి కూడా చదవండి

తెలుగు వారి పల్లె పడుచు.. “ఎంకి” ముచ్చట్లు మీకోసం..!

తెలుగమ్మాయిల అందాన్ని.. అపురూపంగా చూపిన ఘనత “బాపు” చిత్రాలదే..!

మాట కఠినం.. మనసు నవనీతం.. సూర్యకాంతం ది గ్రేట్

 

Read More From Lifestyle