వైజాగ్ (vizag) అనగానే చుట్టూ సముద్రం.. ఎత్తైన కొండలు.. పచ్చని ప్రకృతి.. ఇవే గుర్తొస్తాయి. అందమైన బీచ్‌లు, ఆకట్టుకునే ప్రకృతితో పాటు ఇక్కడ ఎన్నో చూడాల్సిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అయితే కేవలం వాటిని చూసేందుకు మాత్రమే కాదు.. వైజాగ్‌లో ఫేమస్ అయిన కొన్ని ప్రత్యేకమైన వంటకాలు (food) తినడానికి.. అక్కడి స్పెషల్ రుచులను టేస్ట్ చేసేందుకు ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందే. కేవలం మన దగ్గరే కాదు.. దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన కొన్ని వంటకాలు వైజాగ్‌లోనే పుట్టాయి. ఈ క్రమంలో.. మనం కూడా వైజాగ్ వెళ్లినప్పుడు తప్పక రుచి చూడాల్సిన కొన్ని వంటకాల గురించి తెలుసుకుందాం రండి.
1. బొంగులో చికెన్
బొంగులో చికెన్ అంటే మొదటిసారి గుర్తొచ్చేది అరకులోయ మాత్రమే. అరకులో ప్రకృతి మధ్యలో.. వండే ఈ చికెన్ విశాఖపట్నానికే ప్రత్యేకం. మనలో చాలామంది దీన్ని ఇప్పటికే రుచి చూసి ఉంటారు. అద్భుతమైన రుచితో.. రకరకాల ఫ్లేవర్లు కలిసి ఉండే ఈ చికెన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. గ్రిల్ చేయడం వల్ల నూనె కూడా తక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి.. క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే చాలామంది దీన్ని ఇష్టపడతారు. అరకులోయలో సహజంగా లభించే.. వెదురు బొంగుల్లో చికెన్ ముక్కల్ని పెట్టి నిప్పుల పై కాలుస్తారు.
2. చేపల పులుసు
నాన్ వెజ్ ప్రియులకు చేపల పులుసు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ చేపలు పులుసు వైజాగ్‌ది అయితే ఇంకా ప్రత్యేకం అనే చెప్పాలి. అప్పుడే సముద్రతీరానికి వెళ్లి.. ఫ్రెష్‌గా పట్టిన చేపలతో ఈ పులుసును వండుతారు. చింతపండు, మసాలాలు దట్టంగా వేసి చేసే ఈ చేపల పులుసు.. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అమోఘంగా ఉంటుంది. వైజాగ్‌లోని ప్రతి చిన్న, పెద్ద హోటల్స్‌లో మనకు చేపల పులుసు అందుబాటులో ఉంటుంది.
3. మాడుగుల హల్వా
సాధారణంగా మన స్వీట్ బాక్స్‌లో రబ్బర్‌లా సాగే హల్వా అంటే.. చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే గట్టిగా బెల్లం ముక్కలా ఉండే మాడుగుల హల్వా తిన్నవారు.. మరే హల్వా తినడానికి ఇష్టపడరంటే అది అతిశయోక్తి కాదు. వైజాగ్ నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే మాడుగుల అనే ఊర్లో ఈ హల్వా మొదటిసారి తయారైంది. ఆ తర్వాత ఎన్నో ప్రాంతాలలో ఈ హల్వా లభ్యమైనా .. ఇక్కడున్న రుచి ఇంకెక్కడా కనిపించదట. గోధుమలను రుబ్బి పాలు తీసి, చక్కెర, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి వంటివి వేసి ఈ హల్వా తయారుచేస్తారు. ఇంత అద్భుతమైన హల్వా రుచి ఇంకెక్కడ దొరకదు.
4. ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ
సాధారణంగా ప్రతి ప్రాంతానికి దాని స్పెషల్ బిర్యానీ అంటూ ఒకటి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలాంటి ఓ బిర్యానీ అందుబాటులో ఉంటుంది. అదే ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ. నాన్ వెజ్ బిర్యానీని ఆమ్లెట్‌లో పొట్లంలా కట్టి ఇచ్చే ఈ ఎంఎల్‌ఏ పొట్లం బిర్యానీ వైజాగ్‌లో చాలా ఫేమస్. ఇందులో మటన్ కీమా, రొయ్యలు, చికెన్ వంటి ప్రత్యేకతలు చాలా ఉంటాయి. కావాలనుకున్నవారు ఎగ్ బిర్యానీ కూడా తీసుకునే వీలుంటుంది. ఈ బిర్యానీ వైజాగ్ ప్రాంతంలో చాలా ఫేమస్. మీరూ ఓసారి ప్రయత్నిస్తారా?
5. తీపి ఆవకాయ
ఆంధ్రప్రదేశ్‌లో కారం కారంగా ఉండే ఆవకాయ.. ఎంతో స్పెషల్ అని మనందరికీ తెలుసు. కానీ ఆ కారం ఆవకాయ మధ్యలో తియ్యతియ్యగా ఉండే ఆవకాయ వైజాగ్‌లోనే పుట్టింది. కలెక్టర్ మామిడి కాయలతో ప్రత్యేకంగా తయారుచేసే ఈ ఆవకాయలో.. తీపి కోసం బెల్లం లేదా చక్కెర కలుపుతారు. వైజాగ్‌లోనే పుట్టిన ఈ రెసిపీ ఇక్కడి ప్రతి సంప్రదాయబద్ధమైన హోటల్‌లో మీల్స్‌తో పాటు లభిస్తుంది. ఈ తియ్యని ఆవకాయను పెట్టడంలో వైజాగ్ మగువలు సిద్ధహస్తులని చెప్పుకోవాలి.
6. పీతల ఇగురు
సముద్రం పక్కనే ఉన్న నగరం వైజాగ్. ఇక్కడ మత్స్య సంపదకు కొలువుండదు. చేపలతో పాటు రొయ్యలు, పీతలు వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. అందుకే పీతల కూర ఇక్కడ చాలా ఫేమస్. మిగిలిన అన్ని ప్రదేశాల కంటే వైజాగ్‌లో చేసే పీతల ఇగురు ఎంతో రుచిగా ఉంటుందట. అప్పుడే మార్కెట్లోకి వచ్చిన చక్కటి పీతలను వేయించి ఉల్లిపాయలు, టొమాటోలు వేసి చేసే ఈ వంటకం వైజాగ్‌లోని ప్రతి హోటల్లో లభ్యమవుతుంది.
7. చీకులు
సాధారణంగా మిగిలిన అన్ని చోట్ల.. గ్రిల్డ్ చికెన్ కెబాబ్స్ అని పిలిచే రెసిపీకి ఆది వంటకం ఈ చీకులే. చికెన్ ముక్కలను లేదా మటన్ ముక్కలను కడిగి.. మసాలా పట్టించి కాసేపు అలా ఉంచి.. ఆ తర్వాత పొడవాటి ఇనుప చువ్వకు గుచ్చి.. ఆపై నిప్పులపై కాల్చి ఇచ్చే ఈ చీకుల్లో కీమాను ఇనుప చువ్వకు పట్టించి ఇవ్వడం కూడా ఓ పద్దతి.
ఇప్పుడు మనం వాటిని మటన్ చాప్స్, చికెన్ కెబాబ్స్ అంటూ రకరకాలుగా పిలుస్తున్నాం. కానీ ఎప్పటి నుంచో ఉన్న రెసిపీ చీకులు. అది వైజాగ్‌లో ఫేమస్ కూడా. అయితే మామూలు కెబాబ్స్ కంటే.. సంప్రదాయబద్ధంగా నాటు కోడికి అప్పుడే నూరిన మసాలా పట్టించి చేసే ఈ చీకులు ఇంకా చాలా రుచిగా ఉంటాయట.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.