ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి ఒక్కసారిగా దేశ ప్రజలని ఉలిక్కిపడేలా చేయడం.. ఆ తర్వాత భారత వాయుసేన పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేయడం.. దానికి ప్రతిగా భారత్ కు సంబంధించిన మిగ్ ను వారు కూల్చి వేయడం.. అందులోని పైలట్ అభినందన్ వర్థమాన్ ను పాక్ ఆర్మీ బంధించడం.. ఇలా వరుస చర్య- ప్రతిచర్యలతో ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. బంధించిన అభినందన్ ను పాక్ ఆర్మీ విడుదల చేస్తామని ప్రకటించడంతో భారత ప్రజల్లో ఓవైపు సంతోషంగా ఉన్నా.. మరోవైపు కాస్త ఉత్కంఠంగానూ ఉంది.
ఇలాంటి సున్నితమైన వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో భారత ఆర్మీకి సంబంధించి మరొక వార్త బాగా వైరల్ గా మారింది. అంతేకాదు.. ఆ వార్త విన్న ప్రతిఒక్కరూ మేరా భారత్ మహాన్ అంటూ గర్విస్తున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా?? 2017లో మన దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన మేజర్ ప్రసాద్ మహదిక్ గుర్తున్నారా? ఆయన భార్య ఇప్పుడు ఆర్మీలో చేరేందుకు అర్హత సంపాదించారు. అంతేకాదు.. 49 వారాల కఠిన శిక్షణ ముగిసిన తర్వాత ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో తన బాధ్యతలను చేపట్టనున్నారు.
ప్రసాద్ మహదిక్ 2012లో ఆర్మీలో చేరారు. అంచలంచెలుగా ఎదిగి మేజర్ స్థాయికి చేరుకున్నారు. 2017 సెప్టెంబర్ లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఇండియా – చైనా బోర్డర్ అయిన తవాంగ్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన వీరమరణం పొందారు. అప్పటికి ఆయనకు గౌరీతో పెళ్లై రెండేళ్లు కావస్తోంది. తన భర్త మరణం ఆమె జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద కుదుపు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆ కుదుపు కారణంగా ఆమె ఏడుస్తూ కాలం గడపాలని అనుకోలేదు. తన భర్తకు ఇష్టమైన మార్గంలోనే తానూ నడవాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆర్మీలో ప్రవేశానికి అర్హత సాధించేందుకు “ఆర్మీ ఆఫీసర్స్ విడో” కేటగిరీ లో సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఎగ్జామ్ రాశారు. కానీ మొదటిసారి సరైన ప్రిపరేషన్ లేని కారణంగా అర్హత సాధించలేకపోయారు.
అయినా సరే.. ఏమాత్రం పట్టు విడవకుండా మళ్లీ ఆ ఎగ్జామ్ రాసేందుకు ఎంతో శ్రమించి కష్టపడి చదివారు. ఈ సారి టాప్ లో ఉత్తీర్ణత సాధించారు గౌరీ మహదిక్ (Gauri mahadik). 49 వారాల కఠిన శిక్షణ అనంతరం ఆమె లెఫ్టినెంట్ హోదాలో భారత ఆర్మీలో చేరనున్నారు. దీని గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ- నా భర్త వీరమరణం పొందిన తర్వాత ఏం చేయాలా అని బాగా ఆలోచించా. ఆయనకు ఎంతో ఇష్టమైన దేశసేవ చేయడం కోసం నేనూ ఆయన మార్గంలోనే అడుగులు వేయాలని నిర్ణయించుకున్నా. వెంటనే ఆ నిర్ణయాన్ని నా తల్లిదండ్రులు, అత్తామామలకు తెలియజేశా. వారు కూడా సంతోషంగా ఇందుకు అంగీకరించారు. నన్ను ప్రోత్సహించారు. అలా ఎస్ ఎస్ బి ఎగ్జామ్ రాయడం ద్వారా ఆర్మీలో చేరేందుకు అర్హత సంపాదించి ఆయన మార్గంలోనే అడుగులు వేస్తే నా భర్త తప్పకుండా గర్విస్తారు.. అంటూ ఎంతో ధైర్యంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు గౌరి.
చెన్నైలోని ఆఫీసర్స్ అకాడమీ ఆఫ్ ట్రైనింగ్ లో గౌరి 49 వారాల కఠిన శిక్షణ పొందనున్నారు. అయితే ఆమె ఇంతకుముందు ఏ ఉద్యోగం చేయలేదనో లేక ఆమె ఒక గృహిణి అనో మీరు భావిస్తే పొరపడినట్లే. ఎందుకంటే ఆమె న్యాయవాద విద్యను అభ్యసించడమే కాదు. ఒక ప్రముఖ సంస్థలో సెక్రటరీగా ఉద్యోగం కూడా చేసేవారు. కేవలం భర్త అడుగుజాడల్లో నడవాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో వాటన్నింటినీ పక్కన పెట్టి ఈ దారిలో అడుగులు వేయడం ప్రారంభించారు. అంతేకాదు.. దీనిని ఆమె తన భర్తకు ఇస్తున్న నిజమైన నివాళిగా గౌరి భావిస్తున్నారు.
అంతేకాదు.. చెన్నైలోని శిక్షణను విజయవంతంగా ముగించుకొని 2020లో లెఫ్టినెంట్ హోదాలో భారత ఆర్మీలో అడుగుపెట్టనున్న ఆమె ఎప్పుడెప్పుడు తన భర్త ధరించిన స్టార్స్ ను తాను కూడా ధరిస్తానా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అలాగే అప్పటికి ఆమె పేరు లెఫ్టినెంట్ గౌరీ ప్రసాద్ మహదిక్ గా మారుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గౌరీని చూస్తే దేశభక్తి ఉన్న ప్రతిఒక్కరూ తప్పకుండా గర్విస్తారు. ఆమె ధైర్యానికి, మనోనిబ్బరానికి మనం కూడా హ్యాట్సాఫ్ చెప్పేద్దామా..
వుయ్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ గౌరీ.. ఆల్ ది బెస్ట్..!
ఇవి కూడా చదవండి
మరో సరికొత్త రికార్డు సాధించిన.. హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ
ఓ స్విగ్గీ కథ: చెన్నైలో ఫుడ్ ఆర్డర్ కోసం.. డెలివరీ బాయ్ రాజస్థాన్ ఎందుకెళ్లాడు?
తేజస్‌లో గగనవిహారం చేసిన తెలుగు తేజం.. పీవీ సింధు..!
Photos Source: Gauri Prasad Mahadik Facebook page