(How to do bridal makeup at home)
Table of Contents
ప్రతి అమ్మాయికి ‘పెళ్లి’ అనేది ఓ అందమైన కల. వధువుగా తన అలంకరణ అందరినీ ఆకట్టుకోవాలనే ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది. ఈ క్రమంలో చక్కటి చీర, దానికి తగిన నగలు, పూల జడ వంటివన్నీ చక్కగా ఉండాలని భావిస్తుంది. అయితే పెళ్లి రోజున అందంగా కనిపించేందుకు.. వీటన్నింటితో పాటు అందమైన మేకప్ కూడా అవసరమే. పెళ్లి కూతురు తన మేకప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మేకప్ సరిగ్గా లేకపోతే.. లుక్ మొత్తం పాడైపోతుంది. అందుకే పెళ్లి రోజున ఏ విధంగా మేకప్ వేసుకోవాలన్నది ముందే ట్రయిల్ వేసుకోవాలి. పలువురి సలహాలు, సూచనలు తీసుకోవాలి. అప్పుడే మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఆరోజున అందరిలోనూ ప్రత్యేకంగా కనిపిస్తారు.
ముఖానికి ఎలాంటి మేకప్ వేసుకోవాలంటే..
పెళ్లి రోజు నాడు మీ ముఖం అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే.. ఫేషియల్ దగ్గర నుండి.. మేకప్ వరకూ అన్ని విషయాలలోనూ జాగ్రత్త వహించాలి.
స్కిన్ కేర్ రొటీన్ తప్పనిసరి..
పెళ్లి సమయానికి చర్మం మెరిసిపోతూ కనిపించాలంటే.. కనీసం నెల రోజుల ముందు నుండి చర్మ పోషణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కాన్వాస్ సున్నితంగా ఉంటేనే.. దానిపై వేసిన రంగు బాగుంటుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటేనే.. మేకప్ వేశాక అది అద్బుతంగా కనిపిస్తుంది. అందుకే పెళ్లికి కనీసం నెల రోజుల ముందు నుండీ ప్రతి రోజూ సాయంత్రం క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వంటివి చేస్తుండాలి. అలాగే ప్రతి రెండు రోజులకోసారి లేదా వారానికి రెండు సార్లు ఎక్స్ ఫోలియేషన్ కూడా చేస్తుండాలి.
సన్ స్క్రీన్ వాడండి
పెళ్లి అనగానే బోలెడన్ని పనులుంటాయి. ముఖ్యంగా వెండర్లను కలవడం.. వారికి అడ్వాన్సులు ఇవ్వడం, షాపింగ్ చేయడం, పెళ్లి కార్డులు ప్రింట్ చేయించడం.. ఇలా చాలా బిజీగా గడిపేస్తాం. అంతేకాదు.. పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానించడానికి వారి ఇళ్లకు కూడా వెళ్తుంటాం. కానీ ఈ ప్రయాణాలు అన్నీ చేయాలంటే.. ఎండలో తిరగక తప్పదు. ఇలాంటప్పుడు ట్యాన్ ప్రభావం వల్ల ముఖం నల్లగా మారిపోయే అవకాశం ఉంది. అందుకే పెళ్లికి కొన్ని నెలల ముందు నుంచి.. సన్ స్క్రీన్ లోషన్ వాడడం వల్ల చర్మాన్ని నల్లబడకుండా కాపాడుకోవచ్చు.
ప్రైమర్ సరిగ్గా వేసుకోండి.
పెళ్లి రోజు మేకప్ వేసుకోవడానికి ముందు.. ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా జిడ్డుదనం లేకుండా చూసుకోవాలి. ముఖం పొడిగా మారాక మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఆ తర్వాత మేకప్ వేసుకోవడం ప్రారంభించాలి. ముఖానికి మేకప్ వేసుకోవడానికి ముందుగా ప్రైమర్ రాసుకోవాలి. ఇది ముఖాన్ని తాజాగా కనిపించేలా చేయడంతో పాటు.. మేకప్ చెరిగిపోకుండా కాపాడుతుంది. పెళ్లిలో కనీసం ఎనిమిది నుంచి పన్నెండు గంటల పాటు మేకప్ చెరిగిపోకుండా ఉండాలి కాబట్టి.. ప్రైమర్ వేసుకోవడం తప్పనిసరి.
ఫౌండేషన్ ఇలా బ్లెండ్ చేయండి..
అలాగే ఫౌండేషన్ ఎంపికలో ముఖ్యమైన రూల్ ఏంటంటే.. అది ఎస్‌పీఎఫ్ బేస్డ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే.. ఇది కొంచెం షైనీగా కూడా ఉండడం వల్ల.. ఫొటోల్లో మీ ముఖం అద్బుతంగా కనిపిస్తుంది. అలాగే ఫౌండేషన్ వేసుకోవడం అనేదాన్ని.. పెదాల పై నుండి ప్రారంభించి అంచులు, మెడ, చెవులు.. ఇలా అన్ని కవరయ్యేలా చేసుకోవాలి. తర్వాత బ్లెండింగ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని వేళ్లతో అప్లై చేసుకోవచ్చు. లేదా స్పాంజ్, బ్రష్.. ఇలా వేటితో అయినా వేసుకోవచ్చు.
కన్సీలర్ ఉపయోగించండి..
చాలామందికి తమ కళ్ల కింది భాగంలో.. అలాగే ముఖం పై భాగంలో అక్కడక్కడా మచ్చలు కనిపిస్తాయి. అందుచేత చర్మం తెల్లగా ఉన్నా.. నల్లగా కనిపిస్తుంది. దీన్ని కవర్ చేస్తేనే.. ముఖం మొత్తం ఒకే రంగులో కనిపిస్తుంది . ఇందుకోసం మొటిమలు, మచ్చలు, నలుపు రంగు ప్యాచెస్ ఉన్న చోట కన్సీలర్‌ని రాసుకోవాలి. మీ చర్మపు రంగులో ఉన్న కన్సీలర్ వాడడం ఇంకా మంచిది. ఎందుకంటే దీని వల్ల మచ్చలు చర్మపు రంగులోకి మారిపోతాయి.
కాంటూరింగ్ కూడా..
మీ ముఖం అందంగా కనిపించేందుకు వీలుగా.. కాంటూరింగ్ చేసి లోపాలను కవర్ చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ ముఖం సన్నగా.. నుదురు భాగం చిన్నగా కనిపిస్తుంది. దవడల ఎముకల వద్ద కూడా కాంటూరింగ్ చేయడం వల్ల.. ముఖం సన్నగా, యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే బ్రాంజర్ రాసుకొని.. దాన్ని బాగా బ్లెండ్ చేయడం వల్ల కూడా ముఖం అందంగా కనిపిస్తుంది.
బ్లష్, హైలైటర్ ప్రయత్నించండి.
పెళ్లి రోజు వధువు బుగ్గలు కెంపుల్లా మెరిసిపోతే.. చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అందుకే కెంపుల్లా మెరిసిపోయే బుగ్గల కోసం బ్లష్ రాసుకోవాలి. బుగ్గలపై బ్లష్ అప్లై చేసుకొని.. బ్రష్ సాయంతో గుండ్రంగా రుద్దుకోవడం వల్ల ముఖం అందంగా కనిపిస్తుంది. ఇక మీ దవడ ఎముక, కనుబొమ్మల పైన మిగిలిన భాగాలు షైనీగా కనిపిస్తూ.. మీ ముఖానికి అందమైన లుక్ రావాలని భావిస్తే హైలైటర్ అప్లై చేసుకోవాల్సిందే.
కాంపాక్ట్ పౌడర్ వేసుకోండి.
ఇవన్నీ వేసుకున్న తర్వాత.. వాటిపై కాంపాక్ట్ పౌడర్ అప్లై చేయడం వల్ల ముఖానికి ఎక్స్‌ట్రా షైనింగ్ వస్తుంది. ఇది కూడా మీ చర్మం రంగులో కలిసేలా ఉంటే మంచిది.
కల్యాణ తిలకం పెట్టుకోండి.
మేకప్ మొత్తం పూర్తయిన తర్వాత కల్యాణ తిలకం దిద్దుకోవాలి. కల్యాణ తిలకం తెలుగు వధువుకి ప్రత్యేకం. నుదుటి పై పొడవాటి తిలకాన్ని దిద్దాక.. దాని కింద వి షేప్‌లో ఉండే మరో తిలకాన్ని దిద్దుతారు. ఇది చాలా ప్రత్యేకం మాత్రమే కాదు.. తెలుగు వధువు ముఖానికి ఎంతో అందాన్ని కూడా తీసుకొస్తుంది.
ఐ మేకప్ ఎలాగంటే..
ముఖానికి మేకప్ వేయడంతోటే.. పెళ్లికూతురి అలంకరణ పూర్తయిపోదు. ఆమె కళ్లను కూడా హైలైట్ అయ్యేలా చూడాలి. అప్పుడే ఆమె అందం మరింత పెరుగుతుంది.
ఐబ్రోస్ షేప్ చేసుకోండి..
ఒంపులు తిరిగిన కనుబొమ్మలు ముఖానికి చాలా అందాన్ని తీసుకొస్తాయి. పెళ్లికి ముందే ఐబ్రోస్ ఎలాగూ షేప్ చేయించుకుంటారు. ఇందులో ఏదైనా కాస్త షేప్ తేడా ఉంటే.. ఐబ్రో పెన్సిల్‌తో దిద్ది సరిచేయండి. అప్పుడు కనుబొమ్మలు విల్లులా అందంగా కనిపిస్తాయి. అయితే ఐబ్రో పెన్సిల్ రంగు.. కనుబొమ్మల రంగును పోలి ఉండాలన్న నియమం మాత్రం మర్చిపోవద్దు.
ఐ షిమ్మర్ అప్లై చేయండి..
కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ని ఎలాగూ మేకప్‌లో భాగంగా.. కన్సీలర్‌తో కవర్ చేస్తాం. ఈ క్రమంలో కళ్లు మరింత హైలైట్ అయ్యేలా .. షిమ్మరీ ఐ షాడో హైలైటర్ ఉపయోగించవచ్చు. దీనివల్ల మీ కళ్లు పెద్దగా కనిపిస్తాయి.
ఐ లైనర్ వేసుకోండి.
ఐ లైనర్ మీ కళ్లను పెద్దగా కనిపించేలా చేస్తుంది. న్యూడ్ ఐ లైనర్ వాడడం వల్ల కళ్లు అందంగా కూడా కనిపిస్తాయి. లేదంటే నలుపు రంగు ఐ లైనర్ అయినా ఉపయోగించవచ్చు. అయితే వాటర్ ప్రూఫ్ ఎంచుకోవడం మంచిది.
ఐ షాడో కూడా..
ఐ మేకప్ వేసుకున్న తర్వాత.. మీ కళ్ల కింది భాగంలో చిన్న చిన్న గీతల్లా ఏర్పడితే వాటిని అలా వదిలేయకండి. లైట్ షేడ్ ఐ షాడోతో వాటిని కవర్ చేయండి. మీరు లైట్ షేడ్ ఉన్న ఐ మేకప్ వేసుకోవాలి అనుకుంటే.. ఐ లైనర్ పైన బ్రౌన్ లేదా మరేదైనా ముదురు రంగు ఐ షాడోని వేసుకోవచ్చు. అలాగే లైట్ కలర్ షాడోతో దాన్ని బ్లెండ్ చేయడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల కళ్లు షైనీగా, అందంగా కనిపిస్తాయి.
లాషెస్‌ని కర్ల్ చేయండి.
కంటి రెప్పలు అందంగా కనిపించేందుకు.. మస్కారా వేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఐ లాషెస్ అందంగా కనిపించేందుకు అవి చాలా లావుగా.. వంపు తిరిగి ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల కళ్లు పెద్దగా, అందంగా కనిపిస్తాయి. రెప్పల వెంట్రుకలను కర్ల్ చేసిన తర్వాత.. మస్కారా వేసుకోవడం వల్ల అవి చాలా అందంగా కనిపిస్తాయి.
మస్కారా ఇలా..
మస్కారా వేసుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ఇది కళ్లను చాలా అందంగా మారుస్తుంది. ఐ షాడోను ముందు కింది రెప్పకు అప్లై చేసుకోవాలి. దీనివల్ల కంటి రెప్పలు చాలా అందంగా కనిపిస్తాయి.
కాజల్ మీకు నచ్చితే..
ఐ మేకప్ సింపుల్‌గా ఉండాలనుకుంటే మాత్రం కాజల్ పెట్టుకోకపోవడం మంచిది. మంచి ఐ లైనర్, డార్క్ రంగు ఐ షాడో వేసుకుంటే సరిపోతుంది. అయితే మేకప్ కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే మాత్రం.. కాజల్ కూడా అప్లై చేసుకోవాలి.
లిప్ మేకప్ ఇలా..
ఇంత మేకప్ వేసుకున్నా పెదాలు అందంగా.. ఎర్రగా మెరిసిపోకపోతే మేకప్ వేసుకొని లాభం ఏముంటుంది చెప్పండి? అందుకే లిప్ మేకప్ కూడా వేసుకోవడం అత్యవసరం.
లిప్ లైనర్‌తో అవుట్ లైన్
లిప్ లైనర్‌ను అప్లై చేసుకునే ముందు పెదాలను స్క్రబ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పెదాలపై నుండే మృత కణాలు తొలగిపోతాయి. అలాగే స్క్రబ్ చేసిన తర్వాత లిప్ బామ్ రాసుకోవాలి. తర్వాత పెదాలకు లైనింగ్ చేయడానికి.. లిప్ లైనర్‌ని ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల.. ఒక వేళ మీ పెదాలలో ఒకటి పెద్దగా.. ఒకటి చిన్నగా ఉంటే.. వాటిని బ్యాలన్స్ చేసే వీలుంటుంది. ఇది కోటింగ్‌గా మాత్రమే కాదు.. ప్రైమర్‌గా కూడా పని చేస్తుంది.
లిప్ స్టిక్ కోటింగ్ ఇలా..
చాలామంది పెళ్లి రోజున రెడ్ లిప్‌స్టిక్ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇది చీరలతో మ్యాచ్ అవుతుంది. అయితే మరీ ఎక్కువ మేకప్ వేసుకున్నట్లు అనిపించకూడదంటే.. న్యూడ్ షేడ్స్‌ని ఉపయోగించవచ్చు. అలాగే మీకు నచ్చిన రంగు లిప్‌స్టిక్ కూడా ఉపయోగించవచ్చు. అలాగే లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత.. ఒక చిన్న ట్రిక్ ద్వారా దాన్ని ఎక్కువ సేపు నిలిచి ఉండేలా చేయవచ్చు. లిప్‌స్టిక్ కోట్ వేసిన తర్వాత టిష్యూ పేపర్ పెట్టి పౌడర్ కోట్ వేయాలి. తర్వాత మరో కోట్ లిప్‌స్టిక్ అప్లై చేసుకోవాలి.
జుట్టుకు ఇలా..
పెళ్లి అంటే కేవలం మేకప్ మాత్రమే కాదు.. అందమైన హెయిర్ స్టైల్, పూలు, యాక్సెసరీస్ కూడా. అందుకే పెళ్లికి ముందు మీ జుట్టు కూడా సున్నితంగా ఉండేందుకు.. కొన్ని రోజుల ముందు నుంచి ట్రీట్ మెంట్ చేయించుకోవడం లేదా ఇంటి చిట్కాలు పాటించడం వంటివి చేయవచ్చు. అంతేకాదు.. పెళ్లికి కొన్ని రోజుల ముందే హెయిర్ స్టైల్స్ ప్రయత్నించి మీ ముఖానికి ఏది నప్పుతుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ హెయిర్ స్టైల్‌కి తగిన యాక్సెసరీస్ కూడా కొనుక్కొని పెట్టుకోవాలి. హెయిర్ స్టైలింగ్ చేయించుకొన్నాక.. తర్వాత స్ప్రేతో దాన్ని సెట్ చేయడం కూడా చేయాల్సిందే. దీనివల్ల జుట్టు లేవకుండా.. రేగకుండా ఉంటుంది. ఆ తర్వాత పూల జడను కట్టుకోవచ్చు.
మేకప్ వేసుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* పెళ్లికి మీరు ఎలాంటి మేకప్ వేసుకోవాలనుకుంటున్నారో.. మీరు ముందు ఓసారి ప్రయత్నించినా సరే.. దానికి సంబంధించిన ఓ కాపీని మీ దగ్గర ఉంచుకోండి. మీ మేకప్ ఆర్టిస్ట్ చాలా మందికి మేకప్ చేస్తుంది కాబట్టి.. మీకు ఎలాంటి మేకప్ కావాలో తను మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫొటో దగ్గర పెట్టుకోవడం వల్ల తనకు గైడ్ చేసే వీలుంటుంది.
* చాలామంది మేకప్ తర్వాత దుస్తులు వేసుకోవాలనుకుంటారు. కానీ దానివల్ల మేకప్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు.. బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎంత మేరకు చర్మం కనిపిస్తుందో.. ఆ మేరకు మేకప్ వేసుకునే వీలుంటుంది కాబట్టి.. ముందే దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది. కనీసం బ్లౌజ్ ఒక్కటైనా వేసుకోవడం మంచిది.
* మేకప్ కోసం మీరు ఎంచుకునే షేడ్స్.. మీ చర్మానికి దగ్గరగా ఉంటే మంచిది. లేదంటే తెల్లగా ఎబ్బెట్టుగా తయారవుతుంది.
* మేకప్ కేవలం ముఖం, మెడకు మాత్రమే కాకుండా.. వీపుకి కూడా వేసుకోవాలి. చేతులు కనిపిస్తాయి కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. హెయిర్ రిమూవల్ చేసుకోవడంతో పాటు మాయిశ్చరైజర్ రాయడం, వీలుంటే కాస్త ఫౌండేషన్‌ని కూడా రాయడం వల్ల రంగులో మార్పు లేకుండా ఉంటుంద
* మేకప్ చేసేటప్పుడు పెళ్లికూతురు ఏ మాత్రం ఒత్తిడికి గురవకూడదు. లేదంటే దాని ప్రభావం మేకప్ పై కూడా పడుతుంది. కాబట్టి మేకప్ కంటే ముందు కాస్త మెడిటేషన్ చేయడం.. సమయానికి భోజనం చేయడంతో పాటు నీరు ఎక్కువగా తాగడం వంటివి చేస్తుండాలి.
* పెళ్లికి ముందు రోజు రాత్రి బాగా నిద్రపోవడం వల్ల.. కళ్ల కింద ఉబ్బినట్లుగా కనిపించడం, ముఖం పీక్కుపోవడం వంటివి జరగకుండా ఉంటాయి.
తరచూ అడిగే ప్రశ్నలు
1. బ్రైడల్ మేకప్ వేసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి?
చాలామంది మేకప్ ఆర్టిస్టులు మేకప్‌కి ముందు కూడా క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేయమని సూచిస్తారు. పెళ్లికి రెండు రోజుల ముందు నుంచి కేవలం మేకప్ మాత్రమే కాదు.. చర్మానికి ఏ కొత్త ఉత్పత్తినీ ఉపయోగించకపోవడం మంచిది. పెళ్లికి కొన్ని రోజుల ముందే.. ట్రయల్ మేకప్ వేసుకోవడం వల్ల మీ లుక్ ఎలా ఉంటుందన్న విషయం పై అవగాహన రావడంతో పాటు.. ఏవైనా తప్పులుంటే పెళ్లి సమయానికి సరిదిద్దుకునే వీలుంటుంది. దాంతో పాటు.. అందులో ఉపయోగించే పదార్థాలు ఏవైనా మీకు నప్పకపోతే.. ముందే తెలుసుకునే వీలుంటుంది కాబట్టి.. పెళ్లి రోజున ఎలర్జీ వంటి సమస్యలతో బాధపడాల్సిన అవసరం ఉండదు.
2.పెళ్లి జరిగే సమయానికి.. బ్రైడల్ మేకప్‌కి ఏమైనా సంబంధం ఉంటుందా?
ఉదయం మేకప్ కాస్త లైట్‌గా ఉంటే బాగుంటుంది. ఎండ వల్ల చెమట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.. వాటర్ ప్రూఫ్ ఎంచుకోవాలి. ఉదయం పూట ఉపయోగించేందుకు.. ఎక్కువగా న్యూడ్ కలర్స్ వాడతారు. అదే రాత్రి అయితే.. వాటర్ ప్రూఫ్ కాకపోయినా షిమ్మరీ మేకప్ వల్ల ప్రత్యేకంగా కనిపిస్తారు. కేవలం పెళ్లి జరిగే సమయాన్ని బట్టి మాత్రమే కాదు.. చర్మ తత్వం బట్టి కూడా మేకప్‌లో తేడాలు ఉంటాయి. హెచ్‌డీ మేకప్ ఎయిర్ బ్రష్‌తో వేస్తారు. ఇది అన్ని రకాల చర్మ తత్వాల వారికి నప్పుతుంది. మొటిమలు, డార్క్ సర్కిల్స్ వంటివన్నీ కవర్ చేస్తుంది. సహజ మేకప్ లుక్ కావాలంటే.. మినరల్ మేకప్ చేసుకోవాలి. మీ చర్మం ఆయిలీ స్కిన్ అయితే.. మ్యాట్ ఫినిష్ మేకప్ ఎంచుకోవడం మంచిది.
3.బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్‌ని ఎంచుకునేముందు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
మేకప్ ఆర్టిస్ట్‌ని ఎంచుకునే ముందు వాళ్లు మీకు ఎలాంటి పద్ధతిలో మేకప్ చేయాలనుకుంటున్నారు అన్న విషయం.. వారితో మాట్లాడాలి. మేకప్ ఆర్టిస్ట్‌ని ఎంచుకునేముందు కాస్త రీసర్చ్ చేయడం మంచిది. అలాగే మీ బడ్జెట్‌కి తగినట్లుగా.. బాగా మేకప్ చేసే వ్యక్తి ఎవరో ఎంచుకోవాలి. మేకప్ ఆర్టిస్ట్‌తో పాటు అసిస్టెంట్ కూడా ఉంటే మంచిది. వీటితో పాటు మేకప్ ఉత్పత్తులు వారే కొనుక్కొస్తారా? లేక మీరు కొనుక్కోవచ్చా? అని కూడా కనుక్కోవడం మంచిది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.