Lifestyle

విశాఖపట్నంలోని పూర్ణా మార్కెట్ గురించి.. కొన్ని ఆసక్తికరమైన విశేషాలు..!

Lakshmi Sudha  |  Jul 8, 2019
విశాఖపట్నంలోని పూర్ణా మార్కెట్ గురించి.. కొన్ని ఆసక్తికరమైన విశేషాలు..!

పూర్ణా మార్కెట్(Poorna market) పేరు ఎప్పుడైనా విన్నారా.. శివమణి సినిమాలో నాగార్జున పూర్ణా మార్కెట్ సర్కిల్‌కే సీఐగా పనిచేస్తాడు. గుర్తొచ్చిందా? విశాఖపట్నం (visakhapatnam) నేపథ్యంగా తెరకెక్కిన చిత్రాల్లో పూర్ణా మార్కెట్ ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. అసలు ఈ మార్కెట్ ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? ప్రతి ఊరికీ, నగరానికీ ఏదో ఒక మార్కెట్ ప్రత్యేకంగా ఉంటుంది.

హైదరాబాద్‌లో బేగంబజార్, విజయవాడకి బీసెంట్  రోడ్ ఎలాగో.. విశాఖపట్నానికి పూర్ణా మార్కెట్ అలాగన్నమాట. అసలు పూర్ణా మార్కెట్ గురించి తెలుసుకుంటే.. దాని ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది.

విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్‌కు ఆనుకుని పూర్ణా మార్కెట్ ఉంటుంది. ఇది మార్కెట్ మాత్రమే కాదు. అది గత చరిత్రకు సజీవ సాక్ష్యం. ఇది బ్రిటిష్ వారు మనల్ని పాలిస్తున్న సమయంలోనే అంటే.. 1935లో ప్రారంభమైంది. ఆ సమయం నుంచీ ఇది నగరంలో ప్రధానమైన మార్కెట్‌గా ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ మార్కెట్ పై.. జపాన్ వైమానిక విమానాలు దాడులు చేశాయని చెబుతారు.

Instagram

ఆది నుంచీ పూర్ణా మార్కెట్ పాల పదార్థాలకు, నూనెలకు ప్రసిద్ది. వాటికోసం నగరం నలుమూలల నుంచి జనాలు ఇక్కడికొస్తారు. అసలు ఇక్కడ దొరకని వస్తువు ఉండదంటే అతిశయోక్తి కాదు. పైగా అన్నీ చౌకధరలకే లభిస్తాయి. అందుకేనేమో ఈ మార్కెట్‌కి విశాఖపట్నం నుంచి మాత్రమే కాకుండా.. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనాలు వస్తారు.  వచ్చి తమకు కావాల్సినవి కొనుక్కుంటూ ఉంటారు.

పేరుకి మార్కెట్టే అయినా మోడరన్ షాపింగ్ మాల్స్‌కి… ఏ మాత్రం తీసిపోని విధంగా పూర్ణా మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే  ఏ షాపింగ్ మాల్లోనూ దొరకనన్ని బ్రాండ్స్ ఇక్కడ దొరుకుతాయి. పైగా నిత్యావసర వస్తువులు, పూజా వస్తువులు  సైతం చాలా తక్కువ ధరలకే లభిస్తాయి.

ట్రావెలింగ్ బ్యాగ్ లేదా లెదర్ బ్యాగ్ కొనాలంటే.. పేరు మోసిన షాపుకి వెళ్లి పేరున్నబ్రాండ్ కొనుగోలు చేయాల్సిన అవసరమే ఉండదు విశాఖ వాసులకు. ఎందుకంటే  పేరున్న షాపుల్లో దొరికే వాటికంటే నాణ్యమైనవి చాలా తక్కువ ధరల్లో ఇక్కడ లభిస్తాయి. రద్దీ  ఎక్కువగా ఉండటం వల్ల కాస్త సమయం ఎక్కువ పట్టినప్పటికీ.. నచ్చిన, నాణ్యమైన బ్యాగ్ తక్కువ ధరకు కొన్నామనే తృప్తి కలుగుతుంది.

Facebook

దుస్తులకు సైతం పూర్ణా మార్కెట్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవాల్సిందే. ట్రెడిషనల్, ఎథ్నిక్, ట్రెండీ.. మీకు ఏ తరహా దుస్తులు కావాలన్నా ఇక్కడ దొరకుతాయి. చీరలు, లెహంగాలు, జీన్స్, టాప్స్, టీషర్ట్స్, డ్రస్ మెటీరియల్స్ ఇలా ఇంటిల్లిపాదికీ అవసరమైన వస్త్రాలన్నీ పూర్ణామార్కెట్లో చవగ్గా దొరుకుతాయి. అందుకే పెళ్లిళ్ల సీజన్‌తో పాటు పండుగల సమయాల్లోనూ పూర్ణామార్కెట్ రద్దీగా మారిపోతుంది.

అసలు పూర్ణా మార్కెట్లో దొరకని వస్తువంటూ ఏదీ లేదు. కూరగాయల దగ్గర్నుంచి కాస్మెటిక్స్ వరకు, నిత్యావసర వస్తువుల నుంచి ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ వరకు, ఇయర్ ఫోన్స్ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ వరకు ఏది కావాలన్నా పూర్ణామార్కెట్ కి వెళితే చాలు. పైగా అన్నీ హోల్ సేల్ ధరలకే ఇక్కడ దొరుకుతాయి.

అందుకే పూర్ణా మార్కెట్ ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ కావాలన్నా, చెప్పులు కొనాలన్నా.. డెకరేటివ్ పీసెస్ కొనాలన్నా.. ఏదైనా సరే.. పూర్ణామార్కెట్‌కే వెళతారు విశాఖ వాసులు. ఇక్కడ ఫ్యాషన్, ఇమిటేషన్ జ్యుయలరీలు కూడా తక్కువ ధరలకే లభ్యమువుతాయి.

ఎప్పుడూ రద్దీగానే ఉండే పూర్ణా మార్కెట్ పండగ సీజన్లో ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతుంది. మాల్స్‌లో మాత్రమే దొరుకుతాయనుకొనే వస్త్రాలు, ఆభరణాలు, హోమ్ అప్లియెన్సెన్స్ సైతం ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ మనం కొనే గృహోప‌క‌ర‌ణాలకు భారీ మొత్తంలో డిస్కౌంట్లు సైతం లభిస్తాయి.

ఇవీ పూర్ణా మార్కెట్ విశేషాలు. మీరెప్పుడైనా విశాఖపట్నం సందర్శించడానికి వెళితే.. పూర్ణా మార్కెట్‌కి కూడా ఓ సారి వెళ్లండి. అక్కడ షాపింగ్ మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Featured Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

Read More From Lifestyle