బయోపిక్ (Biopic).. ఈ ట్రెండ్ మొదట బాలీవుడ్‌లో ప్రారంభం అయినప్పటికీ క్రమంగా టాలీవుడ్‌లోనూ ఊపందుకుంది. గతేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినీనటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మహానటి చిత్రంతో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీని తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ రెండు భాగాలుగా ఒక బయోపిక్‌ను రూపొందించి విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
మరో దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రూపొందిస్తున్న బయోపిక్‌ను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే క్రిష్ తెరకెక్కించిన రెండు భాగాలకు మిశ్రమ స్పందన లభించగా; వర్మ రూపొందిస్తున్న చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఒక వ్యక్తికి సంబంధించిన జీవిత కథ ఆధారంగా రూపొందించే ఈ బయోపిక్స్‌ను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పలు కోణాల్లో తెరకెక్కించడం ప్రస్తుతం కామన్‌గా మారిపోయింది. తెలుగు నాట ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఇదే జరిగింది. తాజాగా మరో బయోపిక్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతోంది. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, సినీనటి జయలలిత (Jayalalithaa) మరణించి ఏడాదిపైనే అవుతోంది.
అయితే ఆమె స్వర్గస్తురాలైన సమయంలోనే ఆదిత్య భరద్వాజ్, Y – స్టార్ సినీ & టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా తాయి: పురట్చి తలైవి (Thaayi : Puratchi Thalaivi) అనే టైటిల్‌తో ఒక బయోపిక్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కిందటి ఏడాది చివరిలో మరో సంస్థ “ది ఐరన్ లేడీ” పేరుతో జయలలితపై ఒక సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా, జయలలిత పాత్ర పోషిస్తోన్న నిత్యామేనన్ ఫస్ట్ లుక్‌ని సైతం విడుదల చేసింది. ఈ చిత్రానికి ప్రియదర్శిని అనే మహిళా దర్శకురాలు దర్శకత్వం వహిస్తారని సమాచారం.
తాజాగా దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్‌ను రూపొందిస్తున్నామంటూ ఒక ప్రకటన వెలువరించారు దర్శకుడు ఏ.ఎల్.విజయ్ (A.L.Vijay). విష్ణు వర్థన్ ఇందూరి నిర్మాణంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి తలైవి అని టైటిల్ కూడా పెట్టి, పోస్టర్ విడుదల చేశారు. తమిళనాట ప్రజలంతా జయలలితను పురట్చి తలైవి అని పిలుస్తారు. దానర్థం- విప్లవ యోధురాలు అని! ఇప్పుడు ఆ పదాన్నే టైటిల్‌గా పెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శక, నిర్మాతలు. టైటిల్‌ని కూడా ఎరుపు రంగు అక్షరాలతో డిజైన్ చేయడం విశేషం.
ఈ సినిమాకు నిరవ్ షా వంటి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పని చేస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే చిత్ర నటీనటుల వివరాలను కూడా తెలుపుతామని ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. ఈ సినిమా గురించి ఏ.ఎల్. విజయ్ మీడియాతో మాట్లాడుతూ- గతేడాది విష్ణు ఈ స్టోరీ ఐడియాతో నా దగ్గరకు వచ్చారు. కానీ నేను వెంటనే ఒప్పుకోలేకపోయా. ఎందుకంటే జయలలిత ఒక గౌరవప్రదమైన వ్యక్తి. చాలామంది ఆమెను ఒక దేవతలా భావిస్తారు.
అలాంటి అమ్మ జీవితం ఆధారంగా సినిమా రూపొందించాలంటే అది డ్రామాకు దూరంగా, వాస్తవికతకు దగ్గరగా ఉండాలన్నది నా అభిప్రాయం. అందుకే దాదాపు ఎనిమిది – తొమ్మిది నెలల పాటు లోతుగా పరిశోధన చేసిన తర్వాత ఈ సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాం. ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది.. అని చెప్పుకొచ్చారు.
అయితే అమ్మ జీవితకథ ఆధారంగా నిర్మితమవుతోన్న ఈ మూడు చిత్రాల్లో ఏది వాస్తవానికి దగ్గరగా ఉండనుంది? ప‌్రేక్షకుల మనసును ఆకట్టుకోవడంలో ఏది విజయం సాధిస్తుంది?? అనే ప్రశ్నలు, రకరకాల సందేహాలు ఇప్పటికే చాలామంది అభిమానుల మనసుల్లో మెదులుతున్నాయి. వాటికి సమాధానాలు తెలియాలంటే మాత్రం ఈ బయోపిక్స్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే!!
ఇవి కూడా చదవండి
శ్రద్ధాకపూర్.. పుట్టిన రోజు సందర్భంగా సాహో టీజర్..!
దీపికా పదుకొణే రాజకీయాల్లోకి వస్తే.. ఏ శాఖ మంత్రి అవుతారో తెలుసా..?