మన దేశంలో ఇప్పటికే ఎన్నికల ఫీవర్ మొదలైపోయింది. అదేనండీ.. సార్వత్రిక ఎన్నికల హడావుడి ప్రారంభమైపోయింది కదా..! ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఎన్నికల ఫలితాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ అవేంటి అనేగా మీ సందేహం..
మా (MAA).. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పేరిట సినీనటుల సంఘం ఏర్పడిన సంగతి మనందరికీ విదితమే. ప్రతి రెండేళ్లకోసారి ఈ సంఘ కార్యవర్గం (అధ్యక్ష పదవితో పాటు, పలు కీలక స్థానాలు) కోసం ఎన్నికలు నిర్వహిస్తుంటారు. 2019 – 21 సంవత్సరానికి గానూ తాజాగా ఈ ఎన్నికలను నిర్వహించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా “మా”లో సభ్యత్వం కలిగి ఉన్న సభ్యులు రికార్డు సంఖ్యలో తమ ఓటును నమోదు చేయడంతో పాటు “మా” జనరల్ సెక్రటరీ వంటి కీలక స్థానాల్లో మహిళలు తమ సత్తా చాటుతూ చరిత్ర సృష్టించారు.
ఈ ఎన్నికల్లో భాగంగా మా అధ్యక్ష, ఉపాధ్యక్ష, జనరల్ సెక్రటరీ పదవులతో పాటు మరికొన్ని కీలక స్థానాల కోసం రెండు గ్రూపులకు చెందిన అభ్యర్థులు బాగా పోటీ పడ్డారు. అయితే వీటిలో ఒక గ్రూపును ప్రముఖ సినీనటుడు నరేష్ ముందుండి నడిపించగా; మరొక గ్రూపుకు శివాజీరాజా అధ్యక్షత వహించారు. రసవత్తరంగా సాగిన ఈ ఎన్నికల్లో “మా” అధ్యక్షుడిగా నరేష్ అత్యధిక మెజారిటీతో గెలుపొందగా; ఆయన గ్రూపు నుంచే జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన నటి, నిర్మాత & దర్శకురాలు జీవిత రాజశేఖర్ కూడా విజయ బావుటా ఎగరేశారు. తద్వారా జనరల్ సెక్రటరీ పదవీ బాధ్యతలు చేపట్టనున్న మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.
“మా” ఏర్పడి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు జనరల్ సెక్రటరీ పదవిని అలంకరించిన వారిలో ఒక్కరు కూడా మహిళ లేకపోవడం గమనార్హం. నటుడు నరేష్ కూడా ఆయన ప్రచారంలో ఈ పాయింట్‌ని కీలకంగా మార్చుకోవడంతో వారి గెలుపుకు కాస్త ప్లస్ అయిందని చెప్పచ్చు. ఇక జీవిత రాజశేఖర్ విషయానికి వస్తే సినీపరిశ్రమలో చక్కని వాగ్ధాటి గల అతి తక్కువమంది సినీ నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. అలాగే రాజకీయంగా పలు పార్టీల కోసం పని చేసిన అనుభవం కూడా ఆమె సొంతం. ఎన్నికల సమయంలో ఆయా పార్టీల తరఫున ప్రచారం చేస్తూ, ఉపన్యసించిన అనుభవం కూడా జీవితకు బాగానే ఉంది. ఈ ఎన్నికల్లో ఈ అంశాలన్నీ ఆమెకు కలిసొచ్చాయని చెప్పుకోవచ్చు. దాంతో ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో గెలిచి జనరల్ సెక్రటరీ పదవికి ఎంపికయ్యారు.
ఇక ఈ ఎన్నికల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన మరొక విజయాన్ని నటి హేమ సాధించారు. సినీనటుల సంఘానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా రెండు గ్రూపులుగా విడిపోయి అభ్యర్థులు పోటీ పడుతూ ఉంటారు. ఈసారి కూడా అలానే జరిగింది. కానీ ఈ రెండు గ్రూపులకు అతీతంగా హేమ స్వతంత్రంగా ఉపాధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ముందు నుంచీ ముక్కుసూటి మనస్తత్వం కలిగి ఉన్న మహిళగా హేమకు చక్కని గుర్తింపు ఉంది. దీనికి తోడు గతేడాది పని చేసిన కార్యవర్గం రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీగా ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు కూడా అందరికీ సమాన దూరంగా ఉంటూనే తన వర్షన్‌ని చక్కగా చెప్పుకొచ్చారు. ఈసారి హేమ స్వతంత్రంగా పోటీ చేసిన ప్రత్యర్థిపై చక్కని మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. రెండు మెయిన్ ప్యానెల్స్‌ను కాదని స్వతంత్రంగా పోటీ చేసి ఇంత మెజారిటీతో గెలవడం ఓ నూతన రికార్డు అని మా వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా విడుదలైన “మా” ఎలక్షన్ ఫలితాల ప్రకారం అధ్యక్షుడిగా నరేష్, జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్ (Rajasekhar), ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy), హేమ, కోశాధికారిగా రాజీవ్ కనకాల (Rajeev Kanakala), జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు (Goutham Raju), శివబాలాజీ (Siva Balaji) గెలుపొందారు. దాదాపు 800 మంది సభ్యులుగా ఉన్న “మా”లో ఈసారి 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇప్పటివరకు ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు పోల్ కావడం ఇదే కావడం విశేషం. అయితే బ్యాలెట్ పద్ధతి ద్వారా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించడంతో పూర్తి ఫలితాలు వెలువడే సరికి ఈ రోజు ఉదయం 5 గంటల సమయమైంది.
ఇక నూతనంగా ఎన్నికైన కార్యవర్గంలో మహిళల సంఖ్య కూడా పోయిన సారితో పోలిస్తే గణనీయంగా పెరిగిందని చెప్పచ్చు. ఈ సారి మొత్తం 5 గురు మహిళా సభ్యులు ఎన్నికకావడం, తామంతా చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
అమీర్ ఖాన్ “దంగల్” సినిమా.. హాలీవుడ్‌లో విల్ స్మిత్ చిత్రానికి ప్రేరణ..?
తెలంగాణలో తొలి విమెన్ కమాండో టీంని ప్రారంభించిన కరీంనగర్ అధికారులు..!