భారత జవాన్లపై దాడికి తెగబడి 40 మంది ప్రాణాలను బలిగొన్న పుల్వామా ఘటన జరిగి 15 రోజులు కావస్తోంది. ఆ తర్వాత భారత వాయుదళం పాకిస్థాన్‌లోని బాలాకోట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేయడం.. దానికి ప్రతిగా పాక్ భారత్‌కు చెందిన మిగ్‌ను కూల్చి వేసి.. అందులోని అభినందన్ వర్థమాన్ అనే సైనికుడిని బంధించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయనను భారత్‌కు అప్పగిస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్నే అభినందన్ వర్థమాన్ భారత్‌లోకి అడుగుపెట్టారు.
భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతం యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది. దీనికి తగ్గట్లుగా సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతోమంది ఈ ఘటనల పట్ల స్పందిస్తూ కొందరు యుద్ధంతోనే పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని అంటుంటే; ఇంకొందరు సామరస్యంగా ఉంటూ శాంతిపూర్వకంగా చర్చల ద్వారా పరిస్థితులను చక్కదిద్దుకోవాలని కోరుకుంటున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో నిత్యం ఎవరో ఒకరిని ట్రాల్ చేసే నెటిజన్లు ఈసారి మాత్రం వీరమరణం పొందిన ఒక జవాను భార్యను ఈ వేదికగా రకరకాల కామెంట్స్ చేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే-
ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో అమరులైన 40 మంది భారత జవానుల్లో బబ్లూ శాంత్రా కూడా ఒకరు. ఆయన భార్య పేరు మితా శాంత్రా (Mita Santra). వృత్తిరీత్యా ఆమె ఒక ఇంగ్లిష్ ఉపాధ్యాయిని. మితా శాంత్రా తాజాగా సోషల్ మీడియాలో భారత్ – పాక్ యుద్ధం చేయకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ పోస్ట్ చేశారు. దీంతో కొందరు ఆమెను ట్రాల్ చేయడం మొదలుపెట్టారు.
మీరు చాలా స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తే; ఇది పిరికిపంద చర్యగా అనిపిస్తోందని ఇంకొందరు అన్నారు. భర్తను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె ఈ వ్యాఖ్యల పట్ల ధీటుగానే స్పందించారు. “యుద్ధం జరగడం వల్ల ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని, దాని వల్ల ఇరు దేశాల ప్రజలకు ఇబ్బందులు, నష్టాలే తప్ప ఒరిగేదేమీ ఉండదని.. అందుకే సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నా అభిప్రాయం నేను చెప్పాను. ఈ దేశంలో ఎవరి అభిప్రాయాన్ని వారు వెల్లడించే హక్కు అందరికీ ఉంటుంది. ఇక నేను చేసిన పోస్ట్ పట్ల వ్యాఖ్యానించిన వారి గురించి నేను మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే యుద్ధం జరిగితే ఆ నష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు.” అని ఆమె అన్నారు.
“కొద్ది రోజుల క్రితమే ఉగ్రవాద చర్య కారణంగా నా భర్తను పోగొట్టుకున్నాను. యుద్ధమంటూ జరిగితే నాలానే ఒక భార్య తన భర్తను కోల్పోతుంది.. ఒక తల్లి తన బిడ్డను కోల్పోతుంది.. ఒక సోదరి తన సోదరుడిని కోల్పోతుంది.. ఈ నష్టం ఎవరూ పూడ్చలేనిది. పైగా సమర్థులైన సైనికులను ఇలా యుద్ధం పేరుతో శాశ్వతంగా కోల్పోవడం దేశానికి ఎంత వరకు మంచిది?? ఇదంతా నేను వీరమరణం పొందిన ఒక జవాను భార్యగా చెప్పడం లేదు. చరిత్ర చదివిన ఒక విద్యార్థిగా, బాధ్యతాయుతమైన దేశ పౌరురాలిగానే చెప్తున్నా..” అంటూ తొణకని ధైర్యంతో తన మనసులోని మాటను చెప్తూ ఆమెను ట్రాల్ చేసిన వారికి ధీటైన జవాబిచ్చారు మితా శాంత్రా.
అలాగే దేశ భద్రతా బలగాలు ఎలాంటి కమ్యూనికేషన్ లోపాలు లేకుండా సక్రమంగా పని చేయడం ద్వారా పుల్వామా వంటి ఉగ్రదాడులు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తపడవచ్చు అని అన్నారు. మితా శాంత్రాకు ఆరేళ్ల పాప ఉంది.
సీఆర్పీఎఫ్ జవాన్‌గా తన భర్త వీరమరణం పొందిన తర్వాత ఆమెకు అదే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇస్తే చేస్తారా? అని ప్రశ్నించగా ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. భర్తను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నా యుద్ధం జరిగితే తలెత్తే పరిణామాల గురించి ఇంత చక్కగా చెప్పిన ఆమె అభిప్రాయానికి మద్ధతు తెలుపుతూ కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులు, నెటిజన్లు.. ట్రాలర్స్‌కు దీటుగానే జవాబు చెప్పడం విశేషం.
ఇవి కూడా చదవండి
వీరమరణం పొందిన భర్తకు దేశం గర్వించేలా నివాళి ఇచ్చిన గౌరీ మహదిక్..!
తేజస్‌లో గగనవిహారం చేసిన తెలుగు తేజం.. పీవీ సింధు..!
గణితంలో భారతీయుల సత్తాని ప్రపంచానికి చాటిన .. “హ్యూమన్ కంప్యూటర్” శకుంతలా దేవి