Lifestyle

భర్త వైద్యం కోసం.. మారథాన్ లో 72 ఏళ్ళ వృద్ధురాలి పరుగులు

Sandeep Thatla  |  Jan 28, 2020
భర్త వైద్యం కోసం..  మారథాన్ లో 72 ఏళ్ళ వృద్ధురాలి పరుగులు

భర్త కోసమే భార్య.. భార్య కోసమే భర్త అని ఎవరైనా అంటుంటే.. ఆ!! ఇలాంటి మాటలకు ఇప్పుడు కాలం చెల్లిందిలే! అనుకుంటాం. నేడు భార్యాభర్తల బంధం కూడా ఎన్నో బంధాల మాదిరిగానే కృత్రిమంగా మారిపోయింది. 

ఎకో ఫ్రెండ్లి పెళ్లి చేసుకుంటూ… ఆదర్శంగా నిలుస్తున్న హీరో చేతన్

ఇటువంటి వాతావరణంలో.. మహారాష్ట్రలోని (maharashtra) పింప్రి అనే గ్రామంలో నివసించే లతా కరే (latha kare) ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆమె వయసు 72 ఏళ్లు. ఈ వృద్దాప్యంలో తన భర్త భగవాన్  వైద్య ఖర్చుల కోసం ఆమె డబ్బును సమకూర్చే క్రమంలో  ఓ మారథాన్ రేసులో పాల్గొని.. అందులో విజేతగా నిలవడం గమనార్హం. 

పూర్తి వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని పింప్రిలో నివసించే లత, భగవాన్ కరే (bhagwan kare) దంపతులు స్వతహాగా రైతు కూలీలు. వీరికి నలుగురు సంతానం. తమ కష్టార్జితంతో ఆ నలుగురుని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేసారు. ఇలా సాగుతున్న వారి జీవితంలో ఒకరోజు  భగవాన్ అనారోగ్యం  కుదుపులా వచ్చి పడింది. డాక్టర్లని సంప్రదిస్తే, ఆయనకు హృద్రోగ సమస్య ఉందని తేల్చడం జరిగింది. ఈ క్రమంలో ఈ వైద్యానికి ఎంతో డబ్బు అవసరం అవుతుందని లతకు అర్థమైంది. 

అయితే ఈ 70 ఏళ్ళ వయసులో ఆమె ఏ పని చేసి డబ్బు సంపాదించగలదు ? అలాగే వారి సంతానంలో కూడా అందరూ వీరి మాదిరిగానే రైతు కూలీలే కావడం వల్ల.. వారు కూడా ఏమి చేయలేని నిస్సహాయులుగా చూస్తుండిపోయారు. ఈ తరుణంలో ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్త ఆ వృద్ధురాలిని ఆకర్షించింది. అదే.. లోకల్ మారథాన్‌లో గెలిచినవారికి 5 వేల రూపాయలు ఇస్తారనే ప్రకటన. 

ఈ వార్తను చదివిన తరువాత లత మదిలో ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనలో భాగంగానే ఆమె ఓ నిర్ణయం కూడా తీసుకుంది. స్వతహాగా లతకు ఎక్కువ దూరం నడిచే అలవాటు ఉంది.  గతంలో ఆమె తన కూతుళ్ళకు పక్కనే అయిదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లలోనే సంబంధాలు చూసి పెళ్లి చేసింది. వారిని చూడడానికి ఎప్పుడూ నడిచే వెళ్లేది. అందుకే నడవడానికి కూడా డబ్బులిస్తారు..? అనే వార్త చూడగానే ఆమె ఆశ్చర్యపోయింది. తను వంతుగా ఓ ప్రయత్నం చేయాలని భావించింది. అందుకే సదరు మారథాన్‌లో పాల్గొని విజేతగా నిలవాలని నిర్ణయం తీసుకుంది.

ఫ్రీ హగ్స్ పేరిట ముంబై నగరంలో.. రిచా ఛడ్డా చేసిన వినూత్న ప్రయత్నం మీకు తెలుసా..!

అయితే లత తన నిర్ణయాన్ని మారథాన్ (marathon) నిర్వాహకులకి చెప్పేసరికి.. వారు ఇందుకు ససేమిరా అన్నారట. 70 ఏళ్ల వయసులో ఇది సాధ్యపడదు అని చెప్పి.. ఆమెకి మారథాన్‌లో తొలుత పాల్గొనే అవకాశం ఇవ్వలేదు. అయితే లత  తన పరిస్థితిని వివరించి.. డబ్బు తనకి ఎంత అవసరమో చెప్పి వారిని ఒప్పించి మారథాన్‌లో పాల్గొనేందుకు సిద్దమయింది.

కానీ సరిగ్గా మారథాన్‌కి ఒకరోజు ముందు ఆమెకి జ్వరం వచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో ఆమె మారథాన్‌లో పాల్గొనడమే గొప్ప అని అనుకుంటుంటే.. ఆమె అంతటి జ్వరంతో పోటీలో పాల్గొనడమే కాకుండా.. విజేతగా నిలిచి 5 వేల రూపాయలను సొంతం చేసుకుంది. ఇక ఆమె మారథాన్‌లో పాల్గొనడానికి వచ్చే సరికి.. పోటీదారులందరూ  తమకు సౌకర్యంగా ఉండే టీ షర్ట్స్, షార్ట్స్ & ట్రాక్ ప్యాంట్స్‌ ధరిస్తే.. ఈమె మాత్రం కేవలం చీరతోనే.. అది కూడా కాళ్ళకి షూస్ కూడా లేకుండా పాల్గొనడంతో.. ఆమె ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.

మొదటి మారథాన్‌లో గెలవడం ద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసంతో.. ఆమె తర్వాత మరొక రెండు మారథాన్స్‌లో కూడా పాల్గొని విజేతగా నిలవడం విశేషం. ఈమె స్ఫూర్తిప్రదాయమైన కథ ఆధారంగా మరాఠీలో ఒక చిత్రాన్ని  తీయగా.. ఆ చిత్రంలో తన పాత్రని తానే పోషించింది లత.

తన భర్త (husband) పైన ఉన్న ప్రేమే.. ఆమెని 70 ఏళ్ల వయసులో కూడా ఇంతటి సాహసానికి పురికొల్పిందంటే.. ఆమెకి తన భర్త అంటే ఎంత ప్రేమో మనకి తెలిసిపోతుంది కదా. ఈమె ఈతరం ఆలుమగలకు స్ఫూర్తి అని నూటికి నూరు శాతం మాత్రం కచ్చితంగా చెప్పేయగలం. 

శీతాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే ..!

Read More From Lifestyle