Lifestyle

గర్భిణిలూ.. మీ శరీరంలో వస్తున్న మార్పులను ప్రేమించండి..!

Lakshmi Sudha  |  Apr 18, 2019
గర్భిణిలూ.. మీ శరీరంలో వస్తున్న మార్పులను ప్రేమించండి..!

గర్భం దాల్చిన విషయం తెలుసుకొన్నది మొదలు.. ప్రసవం జరిగేంత వరకు చాలా జాగ్రత్తగా ఉంటుంది మహిళ. తాను తీసుకొనే ఆహారం దగ్గరి నుంచి చేసే పనుల వరకు తన బిడ్డపై ప్రభావం చూపుతాయేమోననే ఆలోచనతో చాలా శ్రద్ధగా ఉంటుంది. తన గర్భంలో పెరుగుతున్న బిడ్డకు హాని తలపెట్టే వాటికి దూరంగా ఉంటుంది. ఇలా ప్రతిక్షణం తన బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటుంది.

ఇలా చేయడం పుట్టబోయే బిడ్డకు మంచే చేస్తున్నప్పటికీ.. కొంత మీ గురించి కూడా పట్టించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. పుట్టబోయే బిడ్డపై ప్రేమను పెంచుకోవడంతో పాటు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం(love yourself) కూడా ముఖ్యమేనంటున్నారు. మరి దానికోసం గర్భం దాల్చిన మహిళ ఏం చేయాలి? ఎలా ఉండాలి? అసలు తనను తాను ఎందుకు ప్రేమించుకోవాలి? తెలుసుకొందాం.

బరువు పెరగడం సహజమని గుర్తించాలి..

గర్భం(pregnancy) దాల్చిన తర్వాత ప్రతి మహిళ బరువు పెరుగుతుంది. ఇది అందరిలోనూ సర్వసాధారణమే. అలాగే బరువు సైతం ఒకేసారి పెరగదు. తొమ్మిది నెలల పాటు క్రమంగా పెరుగుతుంది. ఇలా పెరిగిన బరువు ప్రసవం అయిన వెంటనే తగ్గిపోదు.

ఇది కూడా నెమ్మదిగా జరిగే ప్రక్రియే. కాబట్టి బరువు పెరిగిపోతున్నానేమో.. మళ్లీ తగ్గనేమో అనే అనవసర భయం పెట్టుకోవద్దు. గర్భం దాల్చినప్పుడు బరువు పెరగడం అవసరం కూడా. వైద్యులు సైతం మీ బరువు పెరుగుదలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ఏదైనా సమస్య ఉంటే వారు చెబుతారు కాబట్టి బరువు పెరిగే విషయంలో అనవసర ఆందోళన చెందవద్దు.

దుస్తుల విషయంలో

గర్భిణిగా(pregnant) ఉన్నప్పుడు అన్ని రకాల దుస్తులు వేసుకోవడానికి వీలు కుదరకపోవచ్చు. జీన్స్, టైట్స్ వేసుకోవడం అంత శ్రేయస్కరం కూడా కాదు. ఈ సమయంలో మీరెలాంటి దుస్తులు వేసుకొన్నా అవి మీకు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి.

అవి యోగా ప్యాంట్స్ అయినా.. వదులుగా ఉన్న టాప్ అయినా.. వెయిస్ట్ లెస్ జీన్స్ అయినా.. మ్యాక్సీ డ్రస్ అయినా.. ఏ రకమైన దుస్తులు అయినా సరే.. చూడటానికి బాగోదేమో? ఎవరైనా ఏమైనా అనుకొంటారేమో అనుకోవద్దు. మీ సౌకర్యానికే ప్రాధాన్యమివ్వండి.

నచ్చినవి తినండి

గర్భం(pregnancy) దాల్చిన మహిళలకు ఆహారం ఎక్కువ తినమని చెబుతారు. ఎందుకంటే తనతో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు అవసరమైన పోషకాలను అందించే ఆహారం తీసుకోవాలి. అందుకే మన పెద్దవారు ‘నువ్వు  ఇద్దరి కోసం తినాలి’ అంటూ గర్భిణులను(pregnants) హెచ్చరించడం చూస్తుంటాం.

అయితే కొంతమంది మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా ప్రవర్తిస్తారు. ఎక్కువ తింటే లావుగా అయిపోతామేమో అని తక్కువ తింటుంటారు. ఇలా చేయడం వల్ల మీతో పాటు.. మీకు పుట్టబోయే బిడ్డకు సైతం నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి బరువు పెరిగిపోతానేమో అని భయం వదిలిపెట్టి.. మీకు నచ్చిన ఆహారం తినేయండి. ఆరోగ్యంగా ఉండండి.

కాస్త వ్యాయమం అవసరమే..

గర్భం ధరించిన తర్వాత చాలామంది చేసే మరో పొరపాటు ఏంటంటే.. వ్యాయామానికి దూరంగా ఉండటం. సాధారణంగా మనదేశంలో గర్భం ధరించిన తర్వాత వారికి పెద్దగా పనులేమీ అప్పచెప్పరు. వారు ఎక్కడ అలసిపోతారో అనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. అలాగని పూర్తిగా శారీరక శ్రమకు దూరం కావడం కూడా మంచిది కాదు. అందుకే కాస్త వ్యాయామం చేయడం మంచిది.

అలాగని శరీరాన్ని అతిగా శ్రమపెట్టేవి కాకుండా.. తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. వాకింగ్, మెడిటేషన్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండవచ్చు. ఇటీవలి కాలంలో మెటర్నిటీ యోగా బాగా ప్రాచుర్యం పొందుతోంది. దాన్ని కూడా మీరు ప్రయత్నించవచ్చు. అయితే వీటిని మీరు నిపుణుల సమక్షంలో, వారి సూచనల మేరకు చేయడం మంచిది.

గర్భం దాల్చినప్పుడు మీ శరీరంలో మార్పులు వచ్చినప్పటికీ ప్రసవం తర్వాత మీ శరీరం పూర్వపు స్థితికి వస్తుంది. కాబట్టి అనవసరమైన విషయాల గురించి అతిగా ఆలోచించకుండా.. మిమ్మల్ని మీరూ కాస్త ప్రేమించడం మొదలుపెట్టండి. మీ శరీరంలో వస్తున్న మార్పులను ప్రేమించండి. మారుతున్న మీ అలవాట్లను ప్రేమించండి. అప్పుడే మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

ఒత్తిడి నివారణకు ఈ యోగాసనాలు.. గర్భిణులకు ప్రత్యేకం

ఆ మాత్రలు గర్భం రాకుండా ఆపుతాయా? వాటిని ఉపయోగించడం శ్రేయస్కరమేనా?

పీరియడ్ ట్రాకర్ పీరియడ్స్ గురించి ఏం చెబుతుందో తెలుసా?

Read More From Lifestyle