Lifestyle

‘మిస్ ఇండియా’ను ప్రేమించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’.. మహేష్, నమ్రతల అద్భుత ప్రేమకథ మీకు తెలుసా?

Soujanya Gangam  |  Aug 29, 2019
‘మిస్ ఇండియా’ను ప్రేమించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’.. మహేష్, నమ్రతల అద్భుత ప్రేమకథ మీకు తెలుసా?

మహేష్ బాబు (Mahesh Babu), నమ్రత (Namrata).. టాలీవుడ్ సూపర్ హిట్ జంట. వీరి మాదిరిగానే తమ దాంపత్యం కూడా అన్యోన్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం. వీరి ప్రేమ అలాంటిది మరి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అమ్మాయి.. మహేష్ లాంటి భర్త తనకు రావాలని కోరుకుంటుందంటే అతిశయోక్తి కాదు. అయితే దీనికి కారణం ఆయన అందం ఒక్కటే కాదు.. తన భార్యకు మహేష్ ఇచ్చే విలువ.. కుటుంబం పై చూపించే ప్రేమ కూడా. 2005లో గాఢంగా ప్రేమించుకొని.. ఆ తర్వాత పెళ్లి పీటలెక్కిన ఈ జంట ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. వీరి ముద్దుల పిల్లలు గౌతమ్, సితారలు కూడా టాలీవుడ్‌లో ఇప్పుడు బాగా ఫేమస్. అయితే, ఇలా అందరి దృష్టి ఆకర్షించడమే కాదు.. ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడిన ఈ జంట ప్రేమ కథ గురించి తెలుసుకుందాం రండి..

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. ‘రాజకుమారుడు’ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు. అదే సమయానికి బాలీవుడ్‌లో తన కెరీర్ ప్రారంభించింది నమ్రత. అయితే మహేష్ కంటే ఆమె నాలుగేళ్లు పెద్ద. అంతేకాదు.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. మిస్ యూనివర్స్ పోటీల్లో ఆరో స్థానంలో నిలిచింది. మిస్ ఆసియా పసిఫిక్ పోటీల్లో అయితే మొదటి రన్నరప్‌గా నిలిచి తన సత్తా చాటింది. ఆ తర్వాత 1998లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నమ్రత.. సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయినా మంచి పాపులారిటీని మాత్రం సాధించింది.

2000 సంవత్సరంలో విడుదలైన ‘వంశీ’ చిత్రంలో కలిసి నటించారు మహేష్, నమ్రత. వారిద్దరూ మొదటిసారి ఒకరినొకరు చూసుకుంది ఆ సినిమా ముహూర్తం షాట్‌లోనే. ఆ తొలిచూపే ఒకరిపై మరొకరికి మంచి ఇంప్రెషన్ కలిగేలా చేసిందట. ఆ తర్వాత.. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడింది. ఇద్దరూ చాలా సింపుల్ వ్యక్తులు. ఆ సింప్లిసిటీయే వారిద్దరినీ ఎదుటివారితో ప్రేమలో పడేసింది.

ఆ సినిమా తర్వాత కూడా వారిద్దరి ప్రేమ కొనసాగింది. అయితే నమ్రత బాలీవుడ్ స్టార్.. మహేష్ టాలీవుడ్ స్టార్..దీంతో వీరిద్దరి ప్రేమ గురించి మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నాలుగేళ్ల పాటు తమ ప్రేమ బంధాన్ని కొనసాగించిన ఈ జంట.. ఒక్కసారి కూడా మీడియా కంట్లో పడకపోవడం విశేషం. నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ.. 2004లో పెద్దల అనుమతి తీసుకున్న తర్వాత తమ ప్రేమ విషయాన్ని బయట ప్రపంచానికి వెల్లడించారు.

2005 లో వీరిద్దరి వివాహం తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా జరిగింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. నమ్రత, మహేష్ ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల వీరి పెళ్లి పనులన్నీ నమ్రత కుటుంబ సభ్యులే నిర్వహించారు. పెళ్లికి ముందు రోజు రాత్రి వరకూ సినిమా షూటింగ్‌లో పాల్గొని.. ఆ రాత్రి ఫ్లైట్‌లో ముంబై వెళ్లి తన పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు మహేష్.

తనకు కాబోయే భర్తకు తాను పెళ్లి తర్వాత పనిచేయడం ఇష్టం లేకపోవడంతో.. పెళ్లికి ముందే తన షూటింగ్‌లన్నీ పూర్తి చేసుకుందట నమ్రత. పెళ్లికి వారం రోజుల ముందు వరకూ.. షూటింగ్‌లలో పాల్గొంటూనే ఉంది నమ్రత. ఆమెకు ఏమాత్రం సమయం లేకపోవడంతో.. పెళ్లి దుస్తుల నుంచి ఏర్పాట్ల వరకూ అన్నీ నమ్రత సోదరి, బావ, ఆమె తల్లిదండ్రులు చేశారట.

ముంబైలోని మారియట్ హోటల్లో ఫిబ్రవరి 10 2005 తేదిన మహేష్, నమ్రతల వివాహం జరిగింది. దీనికోసం మంత్రాలు చదవడానికి తిరుమల దేవస్థానానికి చెందిన పండితులు ముంబైకి చేరుకున్నారు. పెళ్లికి నమ్రత తెలుగు సంప్రదాయం ప్రకారం.. ఆకుపచ్చని బోర్డర్ ఉన్న తెలుపు రంగు పట్టు చీర కట్టుకుంటే.. మహేష్ తెలుపు రంగు పట్టు కుర్తా, ధోతి ధరించాడు. వీరి పెళ్లయిన సంవత్సరానికి 2006లో గౌతమ్ పుట్టాడు.

పెళ్లి అయిపోతే.. ప్రేమ కథ పూర్తయిపోతుందని అంతా అనుకుంటారు. కానీ ప్రేమ అంటే నిరంతరం ప్రయత్నిస్తూ బంధాన్ని నిలబెట్టుకోవడమే అని ఈ జంట నిరూపించింది. పెళ్లయిన మూడేళ్లకు అంటే.. 2008లో వీరిద్దరి బంధం బీటలు వారిందని, ఇద్దరూ విడిపోయారని వార్తలొచ్చాయి. ఈ వార్తలకు తగ్గట్లే నమ్రత తన కొడుకుతో పాటు ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో.. అటువంటి సంఘటనలు ఈ భార్యభర్తలు ఇక విడిపోయారని అంతా నమ్మేలా చేశాయి. కానీ వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం వారిని ఆ కఠినమైన పరిస్థితుల్లోనూ కలిపాయి.

దీని గురించి నమ్రత మాట్లాడుతూ “పెళ్లి తర్వాత మూడో సంవత్సరం మా ఇద్దరికీ పెద్ద ఛాలెంజ్‌లా గడిచింది. అప్పటికి మహేష్‌కి సినిమాలు లేవు. మా అమ్మా,నాన్న చనిపోయారు. తన బామ్మ కూడా పోయారు. మహేష్ కూడా ఎలాంటి సినిమా ఒప్పుకోవాలో.. తనకు అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాడు. అప్పుడు మా ఇద్దరికీ కొన్ని గొడవలు జరిగాయి. అయితే ఇవన్నీ మమ్మల్ని మరింత దగ్గర చేశాయి.

మా బంధాన్ని మరింత బలంగా మార్చాయి. ఈరోజు మా ఇద్దరి బంధానికి సంబంధించిన పునాదులు చాలా బలంగా ఉన్నాయంటే.. అలాంటి గొడవలు కూడా దానికి కారణమే” అంటూ చెబుతుంది నమ్రత. 2007లో ‘అతడు’ సినిమా తర్వాత కెరీర్ గ్యాప్ తీసుకున్న మహేష్.. తిరిగి 2010లో ఖలేజా చిత్రంలో నటించాడు. వీరి గొడవల తర్వాత తిరిగి కలిసి ఉండడం ప్రారంభించిన కొన్నేళ్లకు.. 2012లో వారికి సితార పుట్టింది. మహేష్, నమ్రత తమ పిల్లలతో ఎంతో ప్రేమగా ఉండడమే కాదు.. సమయం దొరికితే చాలు.. టూర్లకు వెళ్లడానికి కూడా ఆసక్తి చూపిస్తుంటారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Lifestyle