Entertainment

కమల్ హాసన్, అక్షయ్ కుమార్ బాటలోనే.. మాధవన్ కూడా..!

Sandeep Thatla  |  Jan 22, 2019
కమల్ హాసన్, అక్షయ్ కుమార్ బాటలోనే.. మాధవన్ కూడా..!

ప్రోస్థ‌టిక్ మేక‌ప్ (Prosthetic Makeup).. తెలుగులో ఈ ప‌దం ఎక్కువ‌గా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) ద్వారానే అని చెప్ప‌చ్చు. వెండితెర‌పై వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లు పోషించాల‌న్నా, ఆయా పాత్ర‌ల‌కు త‌గిన‌ట్లుగా త‌న ఆహార్యాన్ని మేక‌ప్ స‌హాయంతో మార్చుకోవాల‌న్నా అందుకు ఆయ‌న ఎప్పుడూ సిద్ధ‌మే! ముఖ్యంగా 23ఏళ్ల క్రితం విడుద‌లైన ‘భారతీయుడు’ (Indian) చిత్రంలోని సేనాపతి (Senapathi) పాత్ర కోసం క‌మ‌ల్ వేసుకున్న మేకప్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ త‌ర్వాత ద‌శావ‌తారం చిత్రంలో భాగంగా ఏకంగా 10 పాత్ర‌లు పోషించి అంద‌రితోనూ ఔరా అనిపించుకున్న అద్భుత న‌టుడు ఆయ‌న‌.

ఆ త‌ర్వాత సినీప‌రిశ్ర‌మ‌లో క‌మ‌ల్ వేసిన ఈ బాట‌లో అడుగులు వేసిన న‌టీన‌టులు చాలామందే ఉన్నారు. నాలుగేళ్ళ క్రితం ఐ చిత్రం కోసం విక్రమ్ దాదాపు మూడు వైవిధ్యమైన పాత్ర‌లు పోషించారు. వాటి కోసం ఆయన బరువు తగ్గడమే కాకుండా ప్రోస్థటిక్స్ సైతం ఉప‌యోగించుకున్నారు. అలాగే శంక‌ర్ రూపొందించిన 2.0 సినిమాలో ప‌క్షిరాజు పాత్ర కోసం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సైతం (Akshay Kumar) ప్రోస్థ‌టిక్ మేక‌ప్‌ని ఉప‌యోగించిన‌వారే! ఇందుకోసం 4 గంట‌ల పాటు ఎటూ క‌ద‌ల‌కుండా ఒకే చోట కూర్చొని మేక‌ప్ వేయించుకునేవాడిన‌ని ఆయ‌నే స్వ‌యంగా 2.0 విడుద‌ల స‌మ‌యంలో అంద‌రితోనూ పంచుకున్నారు.

ప్ర‌స్తుతం ఈ ప్రోస్థ‌టిక మేక‌ప్‌ని మ‌రో ఇద్ద‌రు గొప్ప న‌టులు ఉప‌యోగించుకోనున్నారు. వారిలో ఒక‌రు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కాగా; మ‌రొక‌రు విభిన్న‌మైన పాత్ర‌ల‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోసే మాధ‌వ‌న్. భార‌తీయుడు చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న ఇండియ‌న్ 2 (Indian 2) చిత్రంలో మ‌రోసారి సేనాప‌తి పాత్ర‌లో క‌నిపించేందుకు క‌మ‌ల్ ఈ మేక‌ప్‌ని ఆశ్ర‌యించ‌గా; మాధ‌వ‌న్ (Madhavan) ఆయ‌న న‌టించ‌నున్న ఓ ప్రాజెక్ట్ కోసం దీనిని ఉప‌యోగించుకుంటున్నారు.

భార‌తీయ ఇస్రో (ISRO) శాస్త్రవేత్త అయిన నంబి నారాయ‌ణ‌న్ (Nambi Narayanan) జీవితం ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం రాకెట్రి- ది నంబి ఎఫెక్ట్ (Rocketry- The Nambi Effect). ఈ చిత్రంలో నంబి పాత్ర‌లో న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌కుడిగా కూడా మారారు మాధ‌వ‌న్. ఇందులో పాత్ర‌కు త‌గిన‌ట్లుగా నంబిలా క‌నిపించాల‌నే ఉద్దేశంతో ప్రోస్థ‌టిక్ మేక‌ప్ వేసుకున్నారు. ఇందుకోసం ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ట‌! ర‌క‌ర‌కాల లుక్స్‌ని ప్ర‌య‌త్నించి ఆఖ‌రికి మాధ‌వ‌న్‌కు న‌ప్పిన ఒక లుక్‌ని ఎంపిక చేసుకున్నార‌ట‌! మ‌రి, ఆ మేక‌ప్ లుక్ పూర్తి కావ‌డానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందో మీకు తెలుసా??? 14 గంట‌లు..! అవునండీ.. 14 గంట‌లు ఎటూ క‌ద‌ల‌కుండా ఒక చోట కూర్చుంటేనే అది సాధ్య‌ప‌డుతుంద‌ని మేక‌ప్ నిపుణులు చెప్పార‌ట‌!

48 ఏళ్ల మ్యాడీ 77ఏళ్ల నంబి పాత్ర‌లో ఆయ‌న‌లా క‌న‌పించేందుకు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో ఓ వీడియో తయారుచేసి ఆయ‌నే సోష‌ల్ మీడియా వేదిక‌గా అంద‌రితోనూ పంచుకున్నారు. నంబి, మాధ‌వ‌న్ ప‌క్క‌ప‌క్క‌న నిల‌బ‌డి ఉన్న ఫొటోల‌ను షేర్ చేసి వీరిలో ఎవ‌రు అస‌లైన నంబి క‌నుక్కోండి చూద్దాం?? అంటూ అభిమానుల‌కు ఓ చిన్న టెస్ట్ కూడా పెట్టాడు మ్యాడీ. అంతేకాదు.. నంబిలా క‌నిపించేందుకు, ఆయ‌న‌లా హావ‌భావాలు ప‌లికించేందుకు రెండేళ్ల నుంచి మాధ‌వ‌న్ ప్ర‌త్యేకంగా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారంటే.. ఆయ‌న కెరీర్‌లో ఇది ఎంత ప్ర‌త్యేక‌మైన చిత్ర‌మో మ‌ళ్లీ చెప్పాలా?? అయితే ఇలా ఈ పాత్ర కోసం మేక‌ప్ వేసుకోవ‌డంలో భాగంగా 14 గంట‌లు స‌మయం వెచ్చించి క‌మ‌ల్ రికార్డుని బ‌ద్ద‌లు కొట్టారు మాధ‌వ‌న్.

న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా సినిమా భారాన్ని త‌న భుజ స్కందాల‌పై వేసుకొని ముందుకెళ్తున్న మాధ‌వ‌న్‌ని చూస్తే ఎవ‌రైనా స‌రే.. ఆయ‌న్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇంతగా శ్ర‌మిస్తున్న మాధ‌వ‌న్‌కు అందుకు తగిన ఫ‌లితం కూడా ద‌క్కాల‌ని కోరుకుందాం.

Image Courtesy: Instagram

ఇవి కూడా చ‌ద‌వండి

దక్షిణాది చిత్రపరిశ్రమ పై కన్నేసిన అమితాబ్ & అభిషేక్

కమల్ “భారతీయుడు” చిత్రానికి.. వెంకటేష్, రాజశేఖర్‌కి సంబంధమేమిటి..?

ద‌టీజ్ మ‌హాల‌క్ష్మితో.. టాలీవుడ్ క్వీన్‌గా మార‌నున్న‌ త‌మ‌న్నా!

Read More From Entertainment