మహేష్ బాబు (Mahesh babu) .. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు. ఇప్పుడు మరో ఘనత కూడా సాధించేశాడీ అందాల హీరో. అదేంటంటారా? సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో స్థానం సంపాదించుకున్న.. అతికొద్ది మంది భారతీయుల సరసన నిలిచాడు మహేష్.
ఇప్పటివరకూ మేడమ్ టుస్సాడ్స్‌లో స్థానం సంపాదించుకున్న.. సౌత్ హీరోగా కేవలం ప్రభాస్ మాత్రమే వార్తల్లోకెక్కాడు. ఇప్పుడు ఆ వరుసలో రెండో వ్యక్తిగా చేరాడు మహేష్. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలి మైనపు బొమ్మ రూపంలో.. ప్రభాస్ నిలిచిపోయిన తర్వాత.. ఆ మ్యూజియంలో ఎంటరైన మరో సౌత్ హీరో మహేష్ బాబు కావడం విశేషం.
అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన మ్యూజియంలో తన మైనపు విగ్రహానికి స్థానం సంపాదించుకోవడం మాత్రమే కాదు .. ఎవరూ సాధించని మరో ఘనతనూ సాధించి.. మరో కొత్త రికార్డును బీట్ చేశారు మహేష్ బాబు. అదేంటనుకుంటున్నారా? మహేష్ మైనపు బొమ్మ ఎక్కడో సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కాదు.. ఇక్కడే మన హైదరాబాద్ నడిబొడ్డున కొండాపూర్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ఆవిష్కృతమైంది.
అవును.. మహేష్ బాబు నిర్వహిస్తోన్న ఈ మాల్ ఆవరణలోనే ఆయన మైనపు బొమ్మ ఆవిష్కరణ జరగడం విశేషం. ఇలా మేడమ్ టుస్సాడ్స్ నుంచి వేరే దేశానికి తరలించి మరీ.. ఆవిష్కరించిన విగ్రహాలు అతి కొన్ని మాత్రమే ఉన్నాయి.
భారత్‌లో ఇలాంటి ఘనత సాధించిన మొదటి వ్యక్తి మహేష్ బాబు. అంతేకాదు.. సాధారణంగా ఇలాంటి ఈవెంట్లు నిర్వహిస్తే వాటికి అభిమానులను దూరంగా ఉంచుతారు. కానీ మహేష్ మాత్రం తన అభిమానుల సమక్షంలోనే.. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులను సైతం ఆహ్వానించి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు.. ఈ మైనపు బొమ్మను ఆవిష్కరించే కార్యక్రమం కేవలం టీవీల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ లైవ్‌గా రావడం విశేషం.
నలుపు రంగు సూట్ వేసుకున్నట్లుగా ఉన్న ఈ విగ్రహంలో మహేష్ తన సిగ్నేచర్ పోజ్‌లో నిలిచిపోవడం విశేషం. ఈ విగ్రహంలో సూపర్ స్టార్ ఏదో ఆలోచనలో మమేకమైనట్లు కనిపిస్తారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మహేష్ తన బొమ్మతో సరదాగా సెల్ఫీలు కూడా దిగారు. ఈ కార్యక్రమానికి మహేష్ భార్య నమ్రతతో పాటు పిల్లలు గౌతమ్, సితారలు కూడా వచ్చి హాజరై సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత ఈ మైనపు విగ్రహంతో కలిసి సెల్ఫీలు దిగేందుకు అభిమానులు సైతం పోటీ పడ్డారు. ఆ తర్వాత మహేష్ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు సమాధానాలిచ్చారు.
గతంలో ఈ విగ్రహావిష్కరణ గురించి మహేష్ బాబు స్పందిస్తూ.. “మేడమ్ టుస్సాడ్స్ గురించి నేను ఇంతకుముందు విన్నాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులకు సంబంధించిన విగ్రహాల మధ్య.. నా విగ్రహం కూడా ఉండడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ఈ విగ్రహాన్ని చూడాలంటే నాకు సంతోషం, బాధ, ఆనందం, ఎక్సయిట్‌మెంట్.. ఇలా అన్ని భావాలు ఒకేసారి కట్టగలిసి వచ్చేస్తున్నాయి. నన్ను నేను కలవడం ఎంతో ప్రత్యేకం.
అందుకే సింగపూర్ వెళ్లి అన్ని విగ్రహాల మధ్యలో ఉన్న నా విగ్రహాన్ని నా కుటుంబంతో పాటు చూసే రోజు కోసం వేచి చూస్తుంటా. మేడమ్ టుస్సాడ్స్‌లో నా విగ్రహం పెడుతున్నారంటే నేను ఏదో సాధించానన్న ఆనందం నాలో నిండిపోతోంది.. ” అని వివరించారు మహేష్. ఈ విగ్రహం కోసం రెండు వందల కొలతలు తీసుకున్నామని చెప్పిన మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు.. ఇలా వేరే దేశానికి విగ్రహాన్ని తీసుకురావడం ఇదే మొదటిసారి కాబట్టి.. ఇది తమకూ ఎంతో ప్రత్యేకమని వెల్లడించారు.
ఈ విగ్రహ ఆవిష్కరణ గురించి వార్త వెలువడగానే.. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తమకూ అనుమతినివ్వమని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు మేడమ్ టుస్సాడ్స్‌కి మెసేజ్‌లు చేశారట. అందుకే ముందుగా కొన్ని పోటీలు నిర్వహించి.. అందులో పాల్గొన్న వ్యక్తులలో కొందరిని ఎంపిక చేసింది మేడమ్ టుస్సాడ్స్ యాజమాన్యం.
మహేష్ విగ్రహాన్ని పోలిన స్కెచ్‌లు వేసినవారికి, ఇతర పోటీల్లో నెగ్గినవారికి ముందుగా ఈ విగ్రహంతో సెల్ఫీ తీసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. ఆ తర్వాత ఈ మైనపు విగ్రహం ఈ రోజు సాయంత్రం (25 సాయంత్రం) ఆరు గంటల వరకూ అభిమానులు చూసేందుకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత దీన్ని తిరిగి సింగపూర్ తీసుకెళ్లనున్నారు.
సినిమాల విషయానికొస్తే గతేడాది “భరత్ అనే నేను” సినిమాతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న మహేష్ ప్రస్తుతం “మహర్షి” సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమాస్, వైజయంతి మూవీస్ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా మే 9న విడుదలకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి.
గ్లామర్ వరల్డ్‌కి పరిచయమైనప్పుడు.. ఈ అందాల రాశులు ఎలా ఉన్నారంటే..!
దీపిక అందమైన మైనపుబొమ్మను చూసి.. రణ్‌వీర్ ఏమన్నాడో తెలుసా?
సంప్రదాయబద్ధంగా నిఖాతో ఒక్కటైన ప్రేమజంట.. ఆర్య – సాయేషా..!