Family

తన జీవితంలో జరిగే ఈ సంఘటనలను ఏ ఆడపిల్ల ఎప్పటికీ మరచిపోదు..

Lakshmi Sudha  |  Feb 14, 2019
తన జీవితంలో జరిగే ఈ సంఘటనలను ఏ ఆడపిల్ల ఎప్పటికీ మరచిపోదు..

ఇంట్లో ఆడపిల్ల(girl) ఉంటే ఆ అందమే వేరు. తన ముద్దు ముద్దు మాటలతో.. చిలిపి అల్లరితో ఇంట్లో ఆనందాన్ని నింపేస్తుంది. అందుకే చాలామంది తమ ఇంట్లో ఆడపిల్ల ఉంటే బాగుండునని భావిస్తారు. అలాంటి అమ్మాయి జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని కొన్ని తీపి గుర్తులుంటాయి(memorable moments). వాటిలో కొన్ని నవ్వు తెప్పించేవి ఉంటాయి. మరికొన్ని కంటతడి పెట్టించేవీ ఉంటాయి. అలాంటి కొన్ని అందమైన మజిలీల సమాహారమే ఈ కథనం.

కాలేజీలో అడుగుపెట్టిన రోజు..

స్కూల్లో ఉండే వాతావరణం వేరు. కాలేజీ వాతావరణం వేరు. మన మిత్రులు, మనల్ని నిరంతరం పర్యవేక్షించే టీచర్ల వల్ల స్కూల్ వాతావరణం చాలా సెక్యూర్డ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు దాన్నుంచి బయటకు వచ్చి.. ఎలా ఉంటుందో తెలియని కాలేజీలోకి అడుగుపెట్టే క్షణంలో మనసులో ఎన్నో ఆలోచనలు చెలరేగుతాయి. సీనియర్లు ర్యాగింగ్ చేస్తారేమో.. లెక్చరర్లు స్ట్రిక్ట్ గా ఉంటారేమో. కాలేజ్ లో అడుగు పెట్టాం కదా.. ఇక నేను చాలా ఫ్రీగా ఉండొచ్చు అని ర‌క‌ర‌కాలుగా అనుకుంటాం.. ఇలా ఆత్రుత, భయం, ఆనందం అన్నీ కలగలసిన మానసిక భావనలోనే ఆ రోజంతా గడిపేస్తాం. అందుకే.. ఈ రోజు ఎప్పటికీ మన మనసులో గుర్తుండిపోతుంది.

సినిమాలో ఉన్నట్టు కాలేజీ జీవితం ఉండదమ్మా..

మొదటి స్టేజ్ పర్ఫార్మెన్స్

స్కూల్ లేదా కాలేజీలో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మొదటిసారి స్టేజ్ ఎక్కిన క్షణం ఇప్పటికీ మీకు గుర్తుంది కదా.. భయంభయంగా స్టేజ్ ఎక్కినా.. ధైర్యం తెచ్చుకొని మీరిచ్చిన ప్రదర్శనకు మోగిన చప్పట్ల మోత ఇప్పటికీ మీకు వినిపిస్తోంది కదా..! ‘ఈ అమ్మాయి డ్యాన్స్ ఇరగదీసిందిరా’. ‘పాట భలే పాడింది. అలా వింటూనే ఉండిపోవాలనిపించింది’. ఇలాంటి మాటలు మీలో మరింత ఉత్సాహాన్ని నింపే ఉంటాయి కదా..!  

అమ్మ చీర కట్టుకొన్నప్పుడు

టీనేజ్ లో ఉన్నప్పుడు స్కూల్ లేదా కాలేజీలో జరిగే ఫంక్షన్లకు అమ్మ చీర కట్టుకెళ్లిన జ్ఞాప‌కం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు ఏ చీర కట్టుకొన్నారో కూడా ఇప్పటికీ మీకు గుర్తుంది కదా! ఆ చీర ఎంపిక చేయడానికి అమ్మ వార్డ్ రోబ్ మొత్తం వెతికేస్తాం. నా ఫ్రెండ్  రెడ్ కలర్ చీర కట్టుకొస్తానంది. నేను కూడా రెడ్ కలరే కట్టుకెళతా అని మంకు పట్టు పడుతుంటే.. ఆ చీర కాదు.. ఈ చీర నీకు బాగుంటుంది. అని మనకు సూటయ్యే చీర కడుతుంది అమ్మ. ఆ తర్వాత అమ్మ చెప్పింది నిజమే. అందరి కంటే నేనే బాగున్నా అని అనుకనే ఉంటాం కదా..!

అమ్మ చీరతో అందంగా ఇలా..

మొదటిసారి ఐబ్రోస్ చేయించుకొన్నప్పుడు

సాధారణంగా కాలేజీలోకి అడుగుపెట్టిన తర్వాతే అమ్మాయిలకు తమ అందంపై కాన్సట్రేషన్ పెరుగుతుంది. చక్కగా సిద్ధం అవ్వాలని, మ‌న‌ల్ని అందంగా కనిపించేలా చేసే దుస్తులు వేసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇందుకోసం బ్యూటీపార్ల‌ర్ కు వెళ్ల‌డం కూడా మొద‌లుపెడ‌తారు. వెళ్లడమంటే వెళతాం కానీ.. మ‌న‌సులో ఎన్నో అనుమానాలుంటాయి. అమ్మో.. నా ముఖం మారిపోతుందేమో.. పార్లర్ కి వెళ్లానని అమ్మ తిడుతుందేమో.. అని రకరకాలుగా ఆలోచిస్తుంటాం. ఇవి కాదు కానీ.. అసలు హడావుడి ఐబ్రోస్ చేయించుకొనేటప్పుడు మొదలవుతుంది. మీరు పెట్టే కేకలకు పార్లర్ లేడీ బెదిరిపోవడం మీకు గుర్తుండే ఉంటుంది కదా..!

మొదటి ఇంటర్వ్యూ

తొలిసారి ఇంటర్వ్యూకి వెళ్లిన రోజు మీకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది కదా.. అసలు ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో తెలియదు. అక్కడ ఏమి అడుగుతారో తెలీదు.. నేను సెలక్టవుతానా అనే కంగారు ఓవైపు.. వీటన్నింటి మధ్య ఏదో ఒకలా ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని బయటపడిన క్షణం తల మీద మోస్తున్న బరువంతా ఒక్కసారిగా తీసి అవతల పడేసినట్లవుతుంది. ఆ ఇంటర్వ్యూలో సెలక్టయినా.. అవ్వకపోయినా.. ఆ రోజు ఇప్పటికీ మెదడులో నిక్షిప్తమైపోయి ఉంటుంది. ఎందుకంటే.. కెరీర్ విషయంలో మనం వేసే తొలి అడుగు అదే కదా..

మొదటి జీతం అందుకొన్న క్షణం

మన కష్టార్జితం మన చేతుల్లోకి వచ్చిన రోజు ఎప్పటికీ మరచిపోలేనిది. చెప్పాలంటే.. ఆ రోజే డబ్బు విలువ మనకు తెలుస్తుంది. అందుకే ఇంతకు ముందులా కాకుండా చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చుపెడుతుంటాం. మొదటి జీతం అందుకొన్న రోజు మనం చేసే మొదటి పని.. అమ్మానాన్నలకు బట్టలు కొనడం. అప్పటి వరకు వారే మన అవసరాలన్నీ తీరుస్తారు. మీరు తీసుకొచ్చిన బహుమతిని చూసిన క్షణం వారి కళ్ల్లల్లో కనిపించిన ఆనందం మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

మొదటిసారి వంట చేసినప్పుడు

ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ వంట చేసే అవకాశం రాదు. మనకు కావాల్సినవన్నీ అమ్మే మనకు చేసిపెడుతుంది. ఇక వంట గదిలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? అందుకే ఉద్యోగం నిమిత్తం ఇంటి నుంచి దూరంగా వచ్చిన తర్వాత వంట చేసుకొనే విషయంలో చాలా ఇబ్బంది పడతారు. ఏదో ఒకలా వంట కానిచ్చేశామనిపించినా.. అది తినాలంటే చాలా ధైర్యం చేయాల్సిందే. అందులోనూ మొదటిసారి వంట చేశాం.. వచ్చీరానట్టు చేసిన వంటాయే. ఇక చూస్కోండి అది తిన్న వారి పరిస్థితి. బాగుందనలేరు. బాగోలేదని చెప్పలేరు. ఆ రోజు తలచుకొంటే ఇప్పటికీ నవ్వొస్తుంది కదా..!

పెళ్లి రోజు..

ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి ఎంతో ప్రత్యేకమైన రోజు. ఆ రోజే ఆమె జీవితం అందమైన మలుపు తిరుగుతుంది. పెళ్లితో ఒక అమ్మాయి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకొంటాయి. తన జీవనశైలి మారిపోతుంది. కొత్త కుటుంబంలోకి అడుగుపెడుతుంది. కొత్త సంబంధబాంధవ్యాలు ఏర్పరచుకొంటుంది. అందుకే ప్రతి అమ ్మాయికి ఈ రోజు ఎంతో ప్రత్యేకం.

తల్లిగా మారిన వేళ..

అమ్మతనం ఓ వరం. అందుకే పెళ్లయిన ప్రతి అమ్మాయి అమ్మ కావాలని కలలు కంటుంది. గర్భం దాల్చినది మొదలు ప్రతి క్షణం పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తుంటుంది. అంతేకాదు.. తన బిడ్డ ఈ లోకంలోకి ఎప్పుడు వస్తుందా అని ఆర్తిగా ఎదురుచూస్తుంటుంది. ఆమె కడుపులోని బిడ్డను తన  చేతుల్లోకి తీసుకొన్న క్షణం ఆమె అప్పటి వరకు పడిన కష్టమంతా మరిచిపోతుంది. ఇక అప్పటి నుంచి ఆమెకు ప్రతి రోజూ పండగ రోజే.

ఒంటరిగానే ఉన్నా.. అయినా వాలెంటైన్స్ డే హ్యాపీగా జరుపుకొంటా

Featured Image: Pexels.com

GIFs: Giphy, Tumblr

Read More From Family