భోజన ప్రియులకి ప్రతిరోజు.. ఏదైనా ఒక కొత్త వంటకం గురించి తెలుసుకోవాలని ఉంటుంది. అలా తెలుసుకోవడమే కాకుండా వీలైతే వాటిని రుచి కూడా చూడాలని ఉంటుంది. అటువంటి భోజన ప్రియుల కోసమే మేము నాన్ – వెజ్ (non-veg) లో ఒక ప్రముఖమైన వంటకంగా చెప్పుకునే మటన్ పసందా (mutton pasanda) గురించి చెప్పాలని అనుకుంటున్నాం.
అసలు ఈ మటన్ పసందా అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా..? పసందా’ అంటే ఉర్దూలో ‘ఫెవరెట్’ అని అర్ధం. ఈ వంటకం మొఘల్ చక్రవర్తుల వంటశాలలో పుట్టిందని చెబుతుంటారు. అప్పటి రాజులకి ఎంతగానో నచ్చిన వంటకం కాబట్టి, ఈ వంటకానికి ‘మటన్ పసందా’ అనే పేరు వచ్చిందట
శీతాకాలం స్పెషల్ వంటకం.. సీతాఫల్ ఖీర్ తయారీ మీకు తెలుసా?
ఈ వంటకం హైదరాబాద్, ఉత్తర భారతదేశం & పాకిస్థాన్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతాల్లో మటన్ పసందాని చాలా మంది ఇష్టపడుతుంటారు.
ఇక ముందుగా మటన్ పసందా తయారీకి (mutton pasanda recipe) కావాల్సిన పదార్ధాలు ఏంటో తెలుసుకుందాం
తయారీ విధానం
* మటన్ – 500 గ్రాములు
* ఉల్లిగడ్డలు – 2
* అల్లం వెల్లులి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
* పెరుగు – 1/2 కప్పు
* ఇలాచీ – 4
* లవంగాలు – 5
* మిరియాలు – 10
* బిర్యానీ ఆకులు – 2
* ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
* కారం – 2 టేబుల్ స్పూన్స్
* ఉప్పు – 1 టేబుల్ స్పూన్
* గరం మసాలా – 1/2 టీ స్పూన్
* బాదంపప్పులు – 10
* జీడీ పప్పులు – 6
* గసగసాలు – 1 టేబుల్ స్పూన్
* కొబ్బరి పొడి – 1 టేబుల్ స్పూన్
* నూనె – 5 టేబుల్ స్పూన్స్
ఈ పైన చెప్పిన పదార్దాలు ఉంటే, చాలా సులువుగా మీరు మటన్ పసందాని తయారు చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ మటన్ పసందా ఎలా తయారు చేస్తారో (recipe) తెలుసుకుందాం..
ముందుగా ఓ ప్రెషర్ కుక్కర్ తీసుకుని.. అందులో 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తరువాత.. అందులోకి లవంగాలు, ఇలాచీ, దాల్చిం చెక్క, మిరియాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇక అందులోనే అప్పటికే తరిగి పెట్టుకున్న.. 2 ఉల్లిగడ్డల ముక్కలను కూడా వేసుకుని బాగా వేయించాలి. అలా మనం వేసిన ఉల్లిగడ్డ ముక్కలు బంగారు రంగు వచ్చే వరకూ వేయించి.. తర్వాత ఆ మిశ్రమాన్ని మటన్‌తో బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్ వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ అనోఖి ఖీర్ టేస్ట్ చేయండి..!
ఒక 5 నిమిషాల తరువాత ఉల్లి ముక్కలు, మటన్ బాగా కలిసిపోయాక.. మనం ఇందులోకి అల్లం వెల్లులి పేస్ట్, ఉప్పు, కారం, బిర్యానీ ఆకులని వేసుకుని మొత్తం కలపాల్సి ఉంటుంది. ఈ మసాలాలు అన్ని మటన్‌కి పట్టేలా కలుపుకోవాలి. అలా బాగా కలిపిన తరువాత.. ఒక 5 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియంలో ఉంచి.. కొద్దిగా నీరు పోసుకుని ఈ మిశ్రమాన్ని బాగా ఉడకనివ్వాల్సి ఉంటుంది.
ఇక 5 నిమిషాల తరువాత అల్లం వెల్లులి పేస్ట్‌కి మిగిలిన మసాలాలు కలిపి.. అవి మటన్‌కి బాగా పట్టిన తరువాత ఇందులోకి మనం అరకప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఎంతవరకు ఈ మిశ్రమాన్ని కలపాలంటే.. అందులో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయి.. క్రింద ఉన్న నూనె పైకి తేలే వరకు అలా కలుపుతూనే ఉండాలి.
ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడీ పప్పు, గసగసాలు, కొబ్బరి పొడులను బాగా కలిపి పేస్ట్ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత.. ఆ పేస్ట్ కుక్కర్‌లో ఉన్న మిశ్రమంలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ పేస్ట్ మొత్తం కలిసిందని అనుకున్న తరువాత.. ఇందులో 3 నుండి 4 కప్పుల నీరు పోసుకొని.. కుక్కర్ మూత పెట్టి దాదాపు 10 నుండి 15 నిమిషాల పాటు తక్కువ మంట పైన ఉడకనివ్వాలి.
ఈ 15 నిమిషాల సమయంలో కుక్కర్‌లో మనం వేసిన పదార్ధాలన్నీ కూడా.. మటన్‌కి బాగా పట్టడమే కాకుండా.. వాటిలో నుండి వెలువడే ద్రవంతో మటన్ త్వరగా ఉడికిపోతుంది. ఇక 15 నిమిషాల తరువాత.. కుక్కర్ మూత తీసి.. ఒకసారి మరలా ఆ మటన్ మిశ్రమాన్ని కలుపుకుంటే, మన నోరూరించే మటన్ పసందా సిద్దమైనట్లే..
చూశారుగా.. చాలా సులభంగా మనం మన ఇంటిలోనే.. ఈ రుచికరమైన మటన్ పసందాని తయారు చేసుకోవచ్చు. ఈ వంటకాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
హైదరాబాద్ ఖీమా లుక్మీ గురించి మీకు తెలుసా??