NTR – ఈ మూడు అక్షరాలు తెలుగు జాతి ఉన్నంతవరకు నిలిచి ఉంటాయి అని అంటుంటారు. అలా అనడానికి కారణాలేంటి అనేది ఎన్టీఆర్ కథానాయకుడు (Kathanayakudu) చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు క్రిష్.
ఒక గొప్ప మనిషి చరిత్ర చెప్పాలంటే అతని పుట్టుకతోనే చెప్పాల్సిన అవసరం లేదని.. అతనిలో ఏ దశ నుండి మార్పు వచ్చింది అన్నప్పటి నుండి కూడా కథ మొదలపెట్టవచ్చు అని దర్శకుడు ఈ చిత్రం ద్వారా చెప్పకనే చెప్పారు. ఎన్టీఆర్ ఉద్యోగం నుండి ఈ కథని మొదలుపెట్టి.. ఆయన రాజకీయాల్లోకి చేరినంత వరకు ఈ చిత్రంలో ఆయన పయనాన్ని మనకి చూపించారు.
అయితే ఎన్టీఆర్ గురించి మనం ఇప్పటికే చాలా విషయాలు విన్నాం. అలాగే చాలామంది చెప్పగా చూసాం. సాధారణంగా ఎన్టీఆర్ వ్యక్తిత్వం ఎలా ఉండేది.. ఆయన పలు నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి.. అనే విషయాలను మనకి విపులంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక ఎన్టీఆర్ జీవితంలో ముఖ్య ఘట్టమైన ఆయన సినీ ప్రస్థానంలో.. ఆయన ప్రయాణం గురించి వివరిస్తున్నప్పుడు మనకి మరెంతోమంది ప్రముఖులు తారసపడతారు. అలా మనం ఈ చిత్రంలో తెలుగు సినీ ప్రపంచానికి సేవ చేసినవారి పాత్రలు వెండితెరపైన చూడవచ్చు.
పాత్రలు & నటన విషయానికి వస్తే, నందమూరి తారకరామారావుగా.. ఆయన సుపుత్రుడు హీరో అయిన బాలకృష్ణ (Balakrishna) జీవించాడు అనే చెప్పాలి. ప్రధానంగా ఆయన సినీ పాత్రల్లో కన్నా.. బయట సన్నివేశాల్లో తన తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యంగా ప్రజల మధ్యలో నటించే సన్నివేశాలు, తోటి కళాకారులతో, అలాగే తన కుటుంబసభ్యులతో కనిపించే సమయంలో అసలు ఎన్ఠీఆర్ ఇలానే వ్యవహరించి ఉంటారు అని మనం అనుకునేలా అయన నటన కొనసాగింది. ఇక దానవీరశూరకర్ణలోని డైలాగ్ వచ్చే సమయంలో థియేటర్‌లోని ప్రేక్షకులు ఈలలు వేస్తూ మరీ ఎంజాయ్ చేశారు. ఇక కృష్ణుడి రూపంలో బాలకృష్ణ కనిపించే సన్నివేశాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతం. ఈ సన్నివేశం మొత్తం చిత్రానికే హైలైట్ అని చెప్పాలి.
ఈ చిత్రంలో తారకరామరావుకి ఆయువుపట్టుగానే కాకుండా.. ఈ చిత్రానికి సైతం ఒక స్తంభంలా నిలిచిన పాత్ర ఆయన సతీమణి బసవ రామ తారకంది కావడం గమనార్హం. ఆ పాత్రలో నటించిన విద్యా బాలన్ (Vidya Balan) అభినయం అద్భుతమే అని చెప్పాలి. తెలుగు భాష రాకపోయినప్పటికీ.. ఆ పాత్ర పలికే సంభాషణలు తెలుసుకుని మరి.. తాను చేసిన పాత్రకి నూటికి వెయ్యి శాతం ఆమె న్యాయం చేసింది అనే చెప్పాలి. ఇదిలా వుండగా విద్యా బాలన్ – బాలకృష్ణల జంట తమ శక్తిమేర.. ప్రేక్షకులని మెప్పించే రీతిలో న్యాయం చేశారు.
మిగతా పాత్రల్లో అంటే – ఏఎన్నార్‌గా సుమంత్, త్రివిక్రమరావుగా దగ్గుబాటి రాజా, హరికృష్ణగా కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ మేన మామగా వెన్నెల కిషోర్, కేవీ రెడ్డిగా క్రిష్, చక్రపాణిగా మురళి శర్మ, నాగి రెడ్డి పాత్రలో ప్రకాష్ రాజ్(Prakash Raj), సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ (Nithya Menen), శ్రీదేవిగా రకుల్ ప్రీత్ (Rakul Preet), కృష్ణకుమారిగా ప్రణీత (Pranitha), పీతాంబరంగా సాయి మాధవ్ బుఱ్ఱా, కమలాకర కామేశ్వర రావుగా ఎస్వీ కృష్ణారెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి, చంద్రబాబునాయుడుగా రానా (Rana).. ఇలా చెప్పుకుంటే పోతే అనేకమంది మనకి ఈ చిత్రంలో కనిపిస్తారు.
సాంకేతిక వర్గం పనితీరు ఒకసారి గమనిస్తే – టైటిల్స్ పడడం నుండే మనకి నేపధ్యసంగీతం ప్రాధాన్యత అర్ధమవుతుంది. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకి ఒక వెన్నెముక అని చెప్పాల్సిందే. అలాగే ఛాయాగ్రహణం అందించిన జ్ఞానశేఖర్ (Gnanasekhar) గురించి మనం తప్పక ప్రస్తావించాల్సిందే. ఆయన కెమెరాపనితనం వల్లే మనం ఈ సినిమాలో లీనమయ్యే ఆస్కారం కలిగింది. అలాగే VFX కూడా చక్కగా కుదిరింది. అప్పటి రోజుల్లోని వాతావరణం చూపించడంలో ప్రొడక్షన్ డిజైన్ విభాగం కూడా చక్కగా పనిచేసింది.
ఇక ఎన్టీఆర్ అంటేనే డైలాగ్స్‌కి పెట్టింది పేరు. అలాంటిది.. ఆయన మీదనే సినిమాని తీసినప్పుడు ఇక ఆ చిత్రంలో మాటలకి ఎంత ప్రాధాన్యం ఉంటుందన్నది మనం ఊహించవచ్చు. సాయి మాధవ్ బుఱ్ఱా (Sai Madhav Burra) మరోసారి తన కలం బలాన్ని ఈ చిత్రం ద్వారా మనకి చూపిస్తారు. మరీ ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో ఎన్టీఆర్ పలికే సంభాషణలు సినిమా చూస్తున్న ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచునేలా చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక ఈ చిత్రాన్ని ఒక అందమైన పూలదండలా అమర్చడంలో దాదాపు క్రిష్ (Krish) కృతకృత్యుడయ్యాడు అనే చెప్పాలి. ఒక వ్యక్తి కథని ఆయన కుటుంబసభ్యుల చేతనే చెప్పిస్తూ.. అలాగే ఆయన జీవితంలోని ఎత్తు పల్లాలని సమాంతరంగా చూపిస్తూ ..కథనాన్ని నడిపించిన తీరుని అభినందించకుండా ఉండలేం.
ఎన్ఠీఆర్ కథానాయకుడి చిత్రంలో.. ఎన్టీఆర్ నాయకుడిగా మారడానికి గల కారణాలని, అందుకు గల పరిస్థితులని మనం చూడవచ్చు. నాయకుడిగా మారిన తరువాత ఆయన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు.. వాటికి ప్రేరేపించిన మనుషుల గురించి ఈ చిత్రంలో పరిచయం చేసి విడిచిపెట్టాడు. ఒకరకంగా రెండవ భాగం అనగా “ఎన్టీఆర్ మహానాయకుడు” ఈ చిత్రం కన్నా మరింత రంజుగా ఉంటుందనే భావన.. మనకి ఈ చిత్రం చూసాక కలుగుతుంది.
ఏదేమైనా ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలని.. దాని వెనుక జరిగిన సంఘర్షణని మనం చూడవచ్చు. అయితే ఎన్టీఆర్ మహానాయకుడి చిత్రంలోని ఆయన పాత్ర మరింత ఆకట్టుకునే విధంగా ఉంటుంది అన్న భావన మాత్రం ఉంది.
ట్యాగ్ లైన్: సమాజం కోసం ఎన్టీఆర్ పడిన సం’ఘర్షణ’
ఇవి కూడా చదవండి
Read More From Entertainment
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే
Sandeep Thatla