Entertainment

అమ్మ మనసుని తెరపై.. హృద్యంగా చూపించిన ‘ఓ బేబీ’

Lakshmi Sudha  |  Jul 5, 2019
అమ్మ మనసుని తెరపై.. హృద్యంగా చూపించిన ‘ఓ బేబీ’

యూటర్న్ సినిమాతో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటించి.. తన స్టామినా నిరూపించుకోవడానికి ప్రయత్నించింది సమంత. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం అనుకున్నంత ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇప్పుడు రెండోసారి ఓ బేబీగా (Oh Baby)  మరో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో మన ముందుకు వచ్చింది సమంత. ఓ బేబీ కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’కి రీమేక్. హేమాహేమీలని చెప్పుకోదగిన నటులతో పాటు ప్రచార చిత్రాలూ ఆసక్తికరంగా ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ అంచనాలను ఓ బేబీ చేరుకోగలిగిందా? సెంటిమెంట్‌తో కూడిన ఫ్యాంటసీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిందా? తెలుసుకుందాం..

నటీనటులు: సమంత, రాజేంద్రప్రసాద్, లక్ష్మి, నాగ శౌర్య, రావు రమేశ్.. తదితరులు

దర్శకత్వం: నందినీరెడ్డి

సంగీతం: మిక్కీ జె మేయర్

ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ

సినిమాటోగ్రాఫర్: విశ్వప్రసాద్ 

నిర్మాత: డి. సురేశ్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వ ప్రసాద్, థామస్ కిమ్ 

ఓ బేబీ సినిమా సెంటిమెంట్, ఫన్ రెండూ కలగలిసిన ఫాంటసీ సినిమా. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని.. అష్టకష్టాలు పడి బిడ్డను సాకుతుంది బేబీ. తన సంతోషాలన్నింటినీ తన నుంచి లాగేసుకున్నాడని దేవుడిపై కోపం ఆమెకు. ఆ దేవుడే వచ్చి ఆమెకు తిరిగి యవ్వనాన్ని అందిస్తే..? డెబ్భై ఏళ్ల బామ్మ పడుచుపిల్లగా మారితే ఏం జరుగుతుంది? ఈ లైన్ మీదే ఓ బేబీ సినిమా తెరకెక్కింది. అసలు కథలోకి వెళితే..

 

సావిత్రి(లక్ష్మి) డెబ్భై ఏళ్ల వృద్ధురాలు. ముద్దు పేరు బేబీ. తన చాదస్తంతో కోడలిని ఇబ్బంది పెడుతుంటుంది. తన వల్లే  కోడలి ఆరోగ్యం చెడిపోయిందని తెలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత బేబీ అనుకోకుండా పాతికేళ్ల పడుచు పిల్లగా మారిపోతుంది. ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమవుతుంది.

ఉత్సాహంగా ఉన్న కొత్త బేబీ (సమంత) వెనక కుర్రకారు పడుతుంటారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన బేబి తన బాల్యమిత్రుడైన చంటి (రాజేంద్రప్రసాద్) ఇంట్లో అద్దెకు దిగుతుంది. పాతికేళ్ల వయసున్న అమ్మాయిగా మారినప్పటికీ మనసు మాత్రం డెబ్భై ఏళ్ల మాదిరిగానే ఆలోచిస్తుంటుంది. అలాగే ప్రవర్తిస్తుంది. అనుకోకుండా సింగర్‌గా మారిన బేబీ జీవితం అక్కడి నుంచి కొత్త మలుపు తిరుగుతుంది. అసలు బేబి మళ్లీ తన కుటుంబ సభ్యులను చేరుకోగులుగుతుందా? కుర్ర బేబీగా ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? తెలుసుకోవాలంటే తెర మీద చూడాల్సిందే.

Movie Still

ఎప్పుడూ సొంత కథలతోనే సినిమా తీసే నందినీ రెడ్డి తొలిసారి రీమేక్ కథను తెరకెక్కించింది. ఈ సినిమా కొరియన్ నేపథ్యమున్నది కావడంతో దాన్ని తెలుగు నేటివిటీకి మార్చే క్రమంలో నందినీ రెడ్డి ఫ్రీహ్యాండ్ తీసుకుంది. ఆ విషయంలో సక్సెస్ అయింది కూడా. సినిమాను హృద్యంగా తెరకెక్కించింది.

70 ఏళ్ల మనసున్న పాతికేళ్ల అమ్మాయిగా సమంత అద్భుతమైన నటన కనబరిచింది. బామ్మలా చమత్కారంగా మాట్లాడటం, హావభావాలు పలికించడం, బాడీలాంగ్వేజ్.. అన్నింటితోనూ ఆకట్టుకుంది. తనకంటే చాలా ఎక్కువ వయసున్న రావు రమేష్‌కి తల్లిలా నటించడమంటే మాటలు కాదు. వీరిద్దరూ కలిసి కనిపించింది ఒకటిరెండు సీన్లలోనే అయినా బిడ్డ పట్ల తల్లికుండే ప్రేమను తన ముఖంలో చాలా చక్కగా పలికించింది. ఈ పాత్రకు సమంత తప్ప మరొకరు సూటవ్వరనేంత బాగా నటించింది.

తన ప్రాణస్నేహితురాలి క్షేమం కోరుకొనే పాత్రలో రాజేంద్రప్రసాద్ జీవించారు. ఇంట్లోంచి వెళ్లిపోయిన తల్లి కోసం ఆరాటంతో వెతుకుతున్న కొడుకుగా రావు రమేష్ కూడా చాలా బాగా నటించారు. తల్లికి దూరమైన కొడుకుగా ఎమోషన్స్‌ని చక్కగా పలికించారు. లక్ష్మి సైతం మనసుకి హత్తుకునేలా నటించారు. నాగశౌర్య తెరపై అందంగా కనిపించాడు. కుర్ర బేబీ ప్రేమికుడిగా తన పాత్రకు న్యాయం చేశాడు.

బాలనటుడిగా మనందరికీ బాగా పరిచయం ఉన్న తేజ ఈ సినిమాలో బేబీ మనవడిగా ఒదిగిపోయాడు. కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రలో జగపతి బాబు మెరిశారు. నాగ చైతన్య, అడవి శేష్ కూడా తెరపై తళుక్కున మెరిశారు. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సమంతల మధ్య వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ కనెక్టయ్యే కథ ఓ బేబీ.

సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. తెర మీద ఆ రిచ్‌నెస్ మనకు కనిపిస్తుంది. మిక్కీ జె మేయర్ అందించిన స్వరాలు బాగున్నాయి. చాంగుభళా, ఆకాశంలోన పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం (బీజీఎమ్) సైతం అద్భుతంగా ఉంది. ఈ సినిమాకున్న మైనస్ పాయింట్ ఏమిటంటే.. రెండో భాగం కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఏం జరగబోతోందో ముందే ప్రేక్షకుడు అంచనా వేయగలుగుతాడు. రెండో అర్థభాగం నిడివి కాస్త తగ్గించి ఉంటే సినిమా మరింతగా ఆకట్టుకుని ఉండేది.

ఈ సినిమా కథ, కథనం, నిర్మాణ విలువలు, ఇతరత్రా విషయాలు పక్కన పెడితే.. ఈ సినిమా మనలోని అమ్మ మనసుని కచ్చితంగా తాకడం మాత్రమే కాదు.. లోలోని అమ్మ ప్రేమను సైతం సులభంగా తట్టి లేపుతుంది. బిడ్డను పెంచే క్రమంలో తాను కోల్పోయిన జీవితం ఏంటో అది అమ్మకు మాత్రమే తెలుసు. సినిమాలో కనీ కనిపించనట్టుగా ఉన్న ఆ ఆర్ధ్రత తల్లి మనసుకి మాత్రమే తెలుస్తుంది. ఆమె మాత్రమే గుర్తించగలుగుతుంది.

పడుచు పిల్లగా మారినా తనలోని అమ్మతనాన్ని అందరికీ పంచడానికే చూస్తుంది బేబి. పాత చింతకాయ పచ్చడి అని మనం తీసి పడేసే పెద్దవాళ్ల విలువ నానీ(రావు రమేశ్), బేబీ(సమంత) పాత్రలు పలికించిన సంభాషణల ద్వారా నందినీ రెడ్డి చక్కగా తెలియజేసింది. అత్తలు తమను బాధపెడుతున్నారనుకునే కోడళ్లు, కోడళ్లు సరిగ్గా పనిచేయడం లేదనుకునే అత్తలకు మన సమాజంలో కొదవ లేదు. ఇలాంటివారూ ఈ సినిమా చూస్తే.. వారి మధ్య అపార్థాలు ఎందుకు వస్తున్నాయో తెలుస్తుంది. అనుబంధం బలపడుతుంది.

ట్యాగ్‌లైన్: అమ్మ మనసుని తడి చేసే అద్భుతమైన కథ ‘ఓ బేబీ’

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

Read More From Entertainment