Entertainment

రజినీకాంత్ స్టామినాని.. మరోసారి రుచి చూపించిన “పేట” (సినిమా రివ్యూ)

Sandeep Thatla  |  Jan 10, 2019
రజినీకాంత్  స్టామినాని.. మరోసారి రుచి చూపించిన “పేట” (సినిమా రివ్యూ)

‘పేట’ (Petta) చిత్రం చూసాక సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) వయసు 68 అంటే నమ్మబుద్ధి కాదు. అలాగే ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో రజినీకాంత్ వయసు గురించిన సందర్భం వస్తే “ఏంటి? ఆ మనిషి వయసుకి ..చేసిన పనికి సంబంధం లేదా?” అనే డైలాగ్ కూడా ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తుంది. దీన్నిబట్టి మనం రజినీకాంత్ నటన ఈ సినిమాలో ఏ విధంగా ఉందో ఊహించవచ్చు.

పేట విడుదలకి ముందే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) మాట్లాడుతూ – “రజినీకాంత్ అభిమానిగా తన అభిమాన హీరోని తెర పై ఎలా చూడాలనుకుంటున్నానో అలానే ఆయనని చూపించాను” అని చెప్పడం గమనార్హం. ఈ చిత్రం విడుదలయ్యాక ఆయన సగటు అభిమాని సంతృప్తి పడేలా ఆయన కనిపిస్తారు అని చెప్పాడు. మనం ఈ చిత్రం చూసాక కార్తీక్ చెప్పిన మాటలతో ఏకీభవించాల్సిందే. ఎందుకంటే రజనీ గతంలో తెరపైన ఎంత చురుకుగా నటించాడో.. అంతే జోష్‌తో ఎక్కడా కూడా ఆయనలోని స్టైల్‌ని తగ్గించకుండా ఈ చిత్రంలో మనకి కనిపిస్తారు.

ఇక ‘పేట’ కథ & కథనాల విషయానికి వస్తే, ఇది ఒక రొటీన్ కమర్షియల్ ఫార్ములా చిత్రమని చెప్పాలి. హీరో ఉన్నటుండి ఒక ప్రాంతానికి రావడం.. అక్కడ ఉన్నవారిని కాపాడుతుండడం.. అలా కాపాడే క్రమంలో ఇంటర్వెల్ రావడం.. ఇవన్నీ మనకు కొన్ని గత చిత్రాలను గుర్తుకు తెస్తాయి. ఆ తరువాత ద్వీతీయార్ధంలో అతని ఫ్లాష్ బ్యాక్ తెలియడం.. ఇక్కడికి అతను ఎందుకు వచ్చాడో అన్నది మనకి అర్ధంకావడం.. క్లైమాక్స్‌లో ఆ పనిని హీరో పూర్తి చేయడం లాంటి అంశాలు “బాషా” చిత్రాన్ని పోలిన రివెంజ్ డ్రామానే తలపిస్తాయి. అయితే ఇందులో ప్రధానపాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించారు కాబట్టి..ఈ సాధారణ కథకి కూడా కాస్త హైప్ రావడం సహజమే.

రజినీకాంత్ కేంద్రంగానే కథ నడుస్తున్నప్పటికీ.. అక్కడక్కడా కొన్ని పాత్రలకు కూడా దర్శకుడు ప్రాధాన్యాన్ని కల్పించారు. జిత్తుగా నటించిన విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మరోసారి తన విలక్షణతని చాటే ప్రయత్నం చేశాడు. ఇక మాలిక్‌గా చేసిన శశి కుమార్ కూడా పర్వాలేదనిపించారు. అయితే నవాజుద్దీన్ సిద్ధికి (Nawazuddin Siddiqui)వంటి నటుడిన సరిగ్గా ఉపయోగించుకోలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన పాత్ర ఒక సాధారణ విలనీలా ఉంది తప్పితే.. మరే ప్రత్యేకత లేకుండా పోయింది. అలాగే సిమ్రాన్ (Simran) & త్రిష (Trisha) పాత్రలు కూడా తెరపైన మనకి ఎక్కువసేపు కనిపించవు. ఒకరకంగా పేట యూనిట్ భాషలో చెప్పాలంటే.. ఇది రజినిఫైడ్ చిత్రం అంటే.. అంతా రజనీని ఫోకస్ చేసిన చిత్రం మాత్రమే.

ఇంతలా రజినీ మేజిక్ ఈ చిత్రంలో ఉన్నప్పటికీ తన నేపధ్య సంగీతంతో అనిరుధ్ (Anirudh) తన ప్రత్యేకతని నిలబెట్టుకున్నాడు. సూపర్ స్టార్‌కి తగ్గ నేపధ్య సంగీతం అందిస్తూ అసలు ఈ చిత్రానికే హైలెట్ మ్యూజిక్‌ని అందించాడు. ఈయనకి తోడుగా ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వహించిన తిరు (Tirru).. ఆయన పనిని అద్భుతంగా పూర్తి చేశారు. ఇక రచన విషయానైకి వస్తే, దర్శకుడే కథకుడు కావడంతో రజినీకాంత్ స్టైల్‌ని ఎలివేట్ చేసే సన్నివేశాలు బాగానే రాసుకున్నాడు. మొదటి భాగం ఆద్యంతం రజినీకాంత్‌ని అభిమానులు మెచ్చేలా చూపించడంలో ఎక్కువ ఆసక్తి చూపించాడు. దీనివల్ల ప్రేక్షకులకు మొదటి భాగం బాగా నచ్చే అవకాశముంది.

ఇక ద్వితీయార్ధంలోని కథనంలో కాస్త సాగదీత కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. అయితే క్లైమాక్స్ వచ్చేసరికి.. కార్తీక్ సుబ్బరాజ్ తనదైన మార్క్‌ని తెర పైన చూపెట్టాడు. రెండవ భాగంలో కథనం ఇంకాస్త కట్టుదిట్టంగా రాసి ఉంటే సాధారణ ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా ఉండేది. ఈ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే ఈ సినిమాని చాలా తక్కువ వ్యవధిలో దర్శకుడు తెరకెక్కించే విధంగా నిర్మాణ సంస్థ సహకరించింది.

మొత్తానికి ఈ చిత్రం పండగ పూట రజినీ అభిమానులకి ఆయన చెప్పినట్టుగానే ఒక స్వీట్ తిన్నట్టుగా ఉంటుంది. మిగతా ప్రేక్షకులకి మాత్రం ఒకసారి చూడదగ్గ చిత్రం.

ట్యాగ్ లైన్ – తలైవా అభిమానులకి ‘పేట’ ఒక స్వీట్.

ఇవి కూడా చదవండి

అభిమానులకు పైసా వసూల్.. ఎన్టీఆర్ “కథానాయకుడు” (సినిమా రివ్యూ)

‘అంతరిక్షం’ రివ్యూ ఏమిటో తెలుసుకోవాలని ఉందా … ?

బాహుబలికి షాక్ ఇచ్చిన.. సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0

 

 

Read More From Entertainment