మన దేశంలో జరిగే వివాహాల్లో పెళ్లి(wedding)కి ముందు జరిగే వేడుకలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. పెళ్లి కూతురినే(Bride) కాదు.. కుటుంబ సభ్యులందరినీ పెళ్లి కోసం సిద్ధం చేస్తాయీ ఫంక్షన్లు. ఇందులో ముఖ్యంగా మెహెందీ, హల్దీ (haldi) వంటివి ఉత్తర భారత దేశంలో పెద్ద వేడుకగా జరుపుకోవడం తెలిసిందే.
ప్రత్యేకించి ఫంక్షన్‌గా కాకపోయినా పెళ్లికి ముందు గోరింటాకు పెట్టడం, పసుపు రాసి మంగళస్నానం చేయించడం మన పెళ్లిళ్లలోనూ ఉన్నదే. ప్రస్తుతం ఉత్తరాదిని ఫాలో అవుతూ అంతా దీన్నో పెద్ద వేడుకగా కూడా చేస్తున్నారు. అయితే అసలు పెళ్లిళ్లలో పెళ్లి కూతురికి పసుపు ఎందుకు పెడతారో మీకు తెలుసా? పసుపు వల్ల పెళ్లికూతురికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి.. అసలు మన పెద్దవాళ్లు ఈ సంప్రదాయాన్ని ఎందుకు ప్రారంభించారో తెలుసుకుందాం రండి..
1. శుభానికి ప్రతీక..
మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏ మంచి పని మొదలు పెట్టాలన్నా.. అందులో పసుపును తప్పనిసరిగా భాగం చేస్తారు. ఇది మంగళప్రదమైనది. దీన్ని ఉపయోగించడం వల్ల మంచి జరుగుతుందని భావించడమే దీనికి కారణం. పసుపు మంచి యాంటీబయోటిక్.. ఇది మన చర్మానికి మాత్రమే కాదు.. జీర్ణశక్తి మెరుగుపర్చడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని వల్ల ఉన్న లాభాలు లెక్కలేనన్ని. అందుకే ఎన్ని ఆయుర్వేద మొక్కలున్నా.. పసుపునే అన్ని శుభకార్యాల్లోనూ భాగం చేశారు.
2. పెళ్లి కళ వచ్చేందుకు..
పసుపు మన చర్మానికి ఎంతో మంచిది. అందుకే చర్మానికి సంబంధించిన ఉత్పత్తులు తయారుచేసే చాలా సంస్థలు దీన్ని వాటి ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నాయి. పెళ్లి సమయంలో సాధారణంగా కేవలం పసుపు మాత్రమే కాకుండా చందనం, పాలు లేదా రోజ్‌వాటర్‌ని కలిపి మిశ్రమంగా చేసి దాన్ని పెళ్లి కూతురికి రాస్తారు. మరికొందరు ఇందులో పెరుగు, శెనగపిండి కూడా కలుపుతారు. దీన్ని రాసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు, మొటిమల వంటి సమస్యలు లేకుండా చర్మం తాజాగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పటి పెళ్లికూతుళ్ల బ్యూటీ పార్లర్ ఇదే.. ఇప్పుడు బ్యూటీ పార్లర్లు, స్పాలు ఎన్ని వచ్చినా పసుపు ఇచ్చే పెళ్లి కళను ఇవేవీ అందించలేవనే చెప్పవచ్చు.
3. ఒత్తిడిని తగ్గిస్తుంది.
చాలామంది వధూవరులు పెళ్లికి ముందు కాస్త ఒత్తిడిగా ఫీలవ్వడం సహజమే.. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నప్పుడు తమ భవిష్యత్తు గురించి ఆలోచించి కాస్త నెర్వస్‌గా ఫీలవ్వడం సహజమే. కానీ పెళ్లికి ముందు పసుపు పెట్టడం వల్ల ఆ ఒత్తిడి తగ్గుతుందట. పసుపులోని కర్కుమిన్ ఒత్తిడిని తగ్గించడం మాత్రమే కాదు.. యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. మన పెద్దవాళ్లకు ఈ ఒత్తిడి సంగతి ముందే తెలుసేమో.. అందుకే పెళ్లికి ముందు పసుపును ఉపయోగించే సంప్రదాయాన్ని ప్రారంభించారు.
4. డీటాక్సిఫికేషన్ కోసం..
పసుపు చక్కటి డీటాక్సిఫైయర్, క్లెన్సర్ మరియు ఫ్యూరిఫైయర్. దీన్ని మన చర్మానికి అప్లై చేయడం వల్ల మలినాలన్నీ తొలగిపోతాయి. వధూవరులు ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించే ముందు పసుపు పూయడం చక్కటి డీటాక్సిఫికేషన్ మసాజ్‌లా పనిచేస్తుంది. అందుకే పసుపు రాసి పెళ్లి కూతురిని చేసిన తర్వాత బయటకు వెళ్లకూడదు అని చెబుతుంటారు పెద్దలు. మలినాలన్నీ తొలగిపోయిన తర్వాత పెళ్లి వరకూ బయట తిరగకపోవడం వల్ల పెళ్లిలో ఎంతో అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చని వారి నమ్మకం.
5. పసుపంటే సంతోషం..
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ.. అంటూ పాడిన పాట మనకు తెలిసిందే. పసుపు ముఖానికే కాదు.. జీవితానికి కూడా మంచి కళను, కాంతిని తీసుకొస్తుంది. పసుపు రంగు ఆనందానికి చిహ్నం. కొత్త జీవిత ప్రారంభానికి, ఆనందానికి, వసంతానికి గుర్తుగా వాడే పసుపును పెళ్లి కూతురికి రాస్తూ.. ఆమె కొత్తగా ప్రారంభించబోయే జీవితం కూడా ఆనందంగా రోజూ వసంతంలా సాగాలని ఆశీర్వదించడమే ఈ వేడుక ముఖ్యోద్దేశం. అందుకే కొత్త జీవితాన్ని ప్రారంభించేటప్పుడు కూడా చాలామంది పసుపు బట్టలతోనే ఏడడుగులు నడుస్తారు.
పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు వధువుకి ఆశీర్వాదాలు అందిస్తూ.. తనని అసలు వేడుకైన పెళ్లి కోసం సిద్ధం చేయడంతో పాటు.. అందం, ఆరోగ్యం, ఆనందం అందించడమే ఈ వేడుక ప్రధానోద్దేశం.
ఇవి కూడా చదవండి.
పచ్చని కొండలనే.. పెళ్లి వేదికగా చేసుకున్న ప్రేమ జంట..!
పెళ్లికి ముందే ఈ ఎమర్జెన్సీ కిట్.. సిద్ధం చేసుకోవడం మర్చిపోవద్దు..
అమ్మానాన్నలను వదులుకోవడం నచ్చక.. సంప్రదాయాన్నే కాదన్న వధువు ..!
Images : Brides of AP Instagram, Brides of Hyderabad Instagram