Lifestyle

మీ భర్త సెక్స్ పట్ల ఆసక్తి చూపించడం లేదా? దానికి కారణం ఏంటో మీకు తెలుసా?

POPxo Team  |  Apr 10, 2019
మీ భర్త సెక్స్ పట్ల ఆసక్తి చూపించడం లేదా? దానికి కారణం ఏంటో మీకు తెలుసా?

డేటింగ్ చేసిన రోజుల్లో లేదా పెళ్లయిన కొత్తలో భర్తలు భార్యల చుట్టూ తిరుగుతుంటారు. ఏకాంతంగా సమయం గడపడానికి ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు. అయితే రోజులు గడిచే కొద్దీ వారికి శృంగారం(Sex) పట్ల ఆసక్తి తగ్గిపోతుంటుంది. చాలామంది మగవారిలో ఇది సాధారణంగా కనిపించే లక్షణమే. అందుకే దంపతుల మధ్య హాట్ హాట్ వాతావరణాన్ని కల్పించడానికి ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు ప్రయోజనం కనిపించకపోవచ్చు.

అయితే వారు ఇలా ప్రవర్తించడానికి కొన్ని కారణాలుండవచ్చని చెబుతున్నారు నిపుణులు. వారి పరిస్థితిని అర్థం చేసుకొని కాస్త తోడ్పాటునందిస్తే.. వారు మునుపటిలా తయారవుతారని కూడా అంటున్నారు. అయితే ముందుగా మీ భాగస్వామి (partner) శృంగారం పట్ల అనాసక్తి కనబర్చడానికి ప్రధాన కారణాలేంటో తెలుసుకోవడం ముఖ్యం.

బెడ్రూంని కార్యాలయంగా మార్చేయడం..

కెరీర్‌లో విజయవంతంగా దూసుకెళుతున్న పురుషులు చాలా సంతోషంగా ఉంటారు. పని విషయంలో వారు అందుకొనే పొగడ్తలు ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. దీంతో మరింత ఎక్కువగా పని చేయడానికి ప్రయత్నిస్తుంటారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా పని చేస్తూ ఉంటారు. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా కొన్నిసార్లు బెడ్రూంనే ఆఫీసు రూంగా మార్చేస్తుంటారు. పక్కనే ఉన్న ఇల్లాలిని, ఆమె మనసుని సైతం పట్టించుకోరు. అలా పనిచేసుకొంటూనే ఉంటారు. ఏ మధ్యరాత్రో నిద్ర వస్తే  పడుకొంటారు.

లేదా అలాగే ఆఫీసుకి సంబంధించిన ఏదో ఒక పనిచేసుకొంటూనే ఉంటారు. దీని ప్రభావం శారీరక ఆరోగ్యం పైనే కాదు..మానసిక, లైంగిక ఆరోగ్యంపై కూడా పడుతుంది. మీ భర్త కూడా ఇలాగే చేస్తున్నారా? అయితే మీ మాటలతోనే వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఆఫీసు వర్క్ చేసే విషయంలో కొన్ని నిబంధనలు విధించండి. వ్యక్తిగత, వృత్తి జీవితం మధ్య సమతౌల్యం పాటించాల్సిన అవసరాన్ని వారికి అర్థమయ్యేలా వివరించండి. ముఖ్యంగా ఆఫీసు పనిని బెడ్రూం లోపలికి తీసుకురాకుండా జాగ్రత్తపడండి.

ఒత్తిడి ప్రభావాన్ని అనుభవించడం..

కార్యాలయంలో పని ఎక్కువగా చేయాల్సి రావడం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం వల్ల కొన్న సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీని వల్ల సెక్స్ విషయంలో విముఖత చూపించే అవకాశాలున్నాయి. అయితే అది తాత్కాలికమే. మీ భర్త ఎదుర్కొంటున్న సమస్యను మీరు పరిష్కరించలేకపోవచ్చు కానీ.. వారికి మానసికంగా వెన్నుదన్నుగా నిలబడండి. మీ భర్తలో  కచ్చితంగా మార్పు కనిపిస్తుంది.

హార్మోన్ల అసమతౌల్యం

ప్రస్తుత తరంలో అనారోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. దీనిలో వారి తప్పు కూడా ఏమీ లేదనే చెప్పుకోవాలి. అధిక పని ఒత్తిడి, షిఫ్టు పద్ధతుల్లో పనిచేయాల్సి రావడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, శారీరక వ్యాయామం చేయకపోవడం కారణంగా హార్మోన్ల విడుదల సరిగ్గా జరగకపోవచ్చు. పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయులు తక్కువగా ఉన్నట్లయితే.. వారిలో శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుంది. కాబట్టి భార్యగా మీ భర్త ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించండి. సరైన సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకొనేలా చూడండి. కచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అలాగే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

మేల్ మెనోపాజ్ అయ్యి ఉండొచ్చు..

మేల్ మెనోపాజ్..? మగవారికి మెనోపాజా? అని ఆశ్చర్యపోవద్దు.. మనలాగే వారికీ మెనోపాజ్ వస్తుంది. కానీ దాన్ని ఆండ్రోపాజ్ అని పిలుస్తారు. సాధారణంగా ఇది నలభై ఏళ్లు దాటినవారిలో కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ శరీరంలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. క్రమంగా ఇది ఆండ్రోపాజ్‌కి దారి తీస్తుంది. ఇది పూర్తిగా శారీరకపరమైన సమస్య. ఇలాంటి సమస్య మీ భాగస్వామిలో సైతం కనిపిస్తే.. మీరు కూడా అలాగే ప్రవర్తించకుండా మీ లైంగిక అవసరాలను వారికి చెప్పడంతో పాటు.. వారి సెక్సువల్ ఫీలింగ్స్ గురించి తెలుసుకోండి. దీని వల్ల ఏదైనా ఫలితం కనిపించవచ్చు.

ఆరోగ్యపరమైన సమస్యలుండవచ్చు.

మీ భాగస్వామి శృంగారం పట్ల ఆసక్తి కనబరచకపోవడానికి వారి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం కూడా కారణం అయి ఉండవచ్చు. శరీరంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు అతడి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్, ప్రొస్టేట్ క్యాన్సర్, హృద్రోగ సమస్యలు కారణమై ఉండొచ్చు. కాబట్టి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ముఖ్యం. అలాగని అన్ని సందర్భాల్లోనూ అనారోగ్యమే కారణమై ఉండకపోవచ్చు. ముందుగా మీ భర్త సమస్యను స్నేహపూర్వకంగా అడిగి తెలుసుకొని.. దాన్ని తొలగించే ప్రయత్నం చేయండి.

అధిక బరువు

మీ భాగస్వామి అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లయితే అతనిలో శారీరక కలయిక పట్ల ఆసక్తి, ఇష్టం తగ్గిపోతుంది. స్థూలకాయం, శారీరక వ్యాయామం లేకపోవడం కారణంగా 43 శాతం మంది మహిళలు, 31 శాతం మంది పురుషుల్లో లైంగిక సామర్థ్యం, సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిపోతుందని గుర్తించారు. కాబట్టి ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. రోజూ తగినంత వ్యాయామం చేసే దిశగా మీ భాగస్వామిని ప్రోత్సహించండి.

అతడు కోరుకొన్న ప్రేమను మీరు అందించలేకపోవడం..

భాగస్వామి కోసం  ప్రత్యేకంగా సమయం కేటాయించడం, వారి పట్ల శ్రద్ధ కనబర్చడం, ప్రేమ పూర్వకంగా వ్యవహరించడం ద్వారా మీపై అతడికి ఇష్టం పెరుగుతుంది. వీటితో పాటు ఫిజికల్ కాంటాక్ట్ సైతం చాలా అవసరం. శరీరాన్ని తాకడం ద్వారా మీ మీద మరింతగా ప్రేమ పెరుగుతుంది. అయితే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ తగ్గినట్లయితే.. మీ భర్తలోనూ సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి రోజూ మీ భాగస్వామిని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, వీపు నిమరడం వంటివి చేయండి.

ఇవి కూడా చదవండి

ఫిమేల్ కండోమ్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

మీ బాయ్ ఫ్రెండ్ ఇలా చేస్తుంటే మిమ్మల్ని మోసం చేస్తున్నాడనే అర్థం..

ఆ మాత్రలు గర్భం రాకుండా ఆపుతాయా? వాటిని ఉపయోగించడం శ్రేయస్కరమేనా?

Featured Image: Shutterstock

Running Images: Pixabay

Read More From Lifestyle