Lifestyle

భార్యాభ‌ర్త‌ల బంధం ఎలా ఉండాలో ఈ అక్కినేని జంటను చూసి నేర్చుకోవాల్సిందే..

Lakshmi Sudha  |  Feb 27, 2019
భార్యాభ‌ర్త‌ల బంధం ఎలా ఉండాలో ఈ అక్కినేని జంటను చూసి నేర్చుకోవాల్సిందే..

నాగార్జున.. వెండి తెర కింగ్, అభిమానులకు నవ మన్మథుడు. అమల.. ఒకప్ప‌టి స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సామాజిక కార్యకర్త. వీరిద్దరి అనుబంధం వయసు పాతికేళ్లు పైనే..! సాధారణంగా సినిమా రంగానికి చెందినవారు ప్రేమ వివాహం చేసుకొంటే.. వారి మధ్య కచ్చితంగా గొడవలు వస్తాయని.. విడిపోతారనే అభిప్రాయం మనలో ఉంది. దానికి ఎన్నో ఉదాహరణలు సైతం మనం చూపిస్తాం. కానీ నాగార్జున, అమల దీనికి పూర్తిగా భిన్నం. దాదాపు పాతికేళ్ల నుంచి వారిద్దరూ ఒక్కటిగా జీవనం సాగిస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరి దారులూ వేరయినా.. ఒక్కటిగానే నడుస్తున్నారు. అందుకే ఈ ఎవర్ గ్రీన్ జంట అన్యోన్య దాంప‌త్యం విష‌యంలో మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రేమబంధం అంటే ఇలా ఉండాలని చూపిస్తున్నారు. మనకు Relationship goals నిర్దేశిస్తున్నారు.

అమల, నాగార్జున ఇద్దరూ కలసి నిర్ణయం, ప్రేమ యుద్ధం, కిరాయిదాదా, చిన్నబాబు, శివ వంటి సినిమాల్లో నటించారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. వీరి స్నేహం ప్రేమగా మార‌డానికి దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. తన మనసులో అమలపై పెరిగిన ప్రేమను చెప్పడానికి ప్రత్యేకంగా ప్లాన్ చేసి మరీ తెలియజేశారట నాగ్. ఆ తర్వాత చెన్నైలో చాలా సింపుల్ గా వివాహం చేసుకొన్నారు. జూన్ 11, 1992న భార్యాభర్తలుగా వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇప్పటికే సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకొన్న ఈ జంటను చూస్తే.. చాలా యంగ్ గా నిన్నో మొన్నో పెళ్లయిన నవ దంపతుల మాదిరిగా కనిపిస్తారు. అందుకే అనుబంధాన్ని నిలబెట్టుకోవడంలో అమల, నాగార్జున జంట నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం. ఆచరిద్దాం. ఆనందంగా జీవితాన్ని సాగిద్దాం.

అర్థం చేసుకొనే తత్వం

అమల సామాజిక కార్యకర్త. బ్లూ క్రాస్ సంస్థ ద్వారా జంతువుల సంక్షేమం కోసం కృషి చేస్తుంటారు. వీటి కారణంగా కలిగే ఒత్తిడిని ఆవిడ ఇంటికి కూడా వెంట తీసుకెళుతుంటారట. ఈ విషయాన్ని నాగ్ చాలా సంతోషంగా చెబుతారు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే.. ఏం జరిగి ఉండేదో తెలీదు కానీ.. నాగ్ మాత్రం ఆమెను అర్థం చేసుకొన్నారు.

నమ్మకమే పునాది

నాగ్ మాత్రమేనా.. అమల కూడా ఈ విషయంలో కింగ్ కి ఏ మాత్రం తక్కువ కాదు. కింగ్ నాగ్ హీరోయిన్లతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకే ఆయనపై రూమర్లు ఎక్కువగా వస్తుంటాయి. అయితే అమల ఈ విషయంలో నాగ్ ను అర్థం చేసుకొన్నారు. నాగ్ పై అమలకు నమ్మకం బాగా ఎక్కువ. అందుకే రూమర్స్ ను అసలు పట్టించుకోరు. ఈ పుకార్లన్నింటినీ కొట్టిపారేస్తారు అమల. నాగార్జున పక్కా ఫ్యామిలీ మ్యాన్ అంటారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా ఉండటానికి నమ్మకం కంటే గట్టి పునాది ఏముంటుంది?

అన్యోన్యతకు ప్రతిరూపం

వీరిద్దరూ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్. ఇలా ఉంటే కచ్చితంగా ఇద్దరి మధ్య పొరపొచ్చాలు రావాలి. ఒకరినొకరు డామినేట్ చేసుకోవాలి.  కాని ఎప్పుడూ అలా కనిపించదు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇలా ఉండాలంటే అది అక్కినేని జోడీకి మాత్రమే సాధ్యం.

వెన్నుతట్టి.. వెంట నడిచి..

అమల జంతు ప్రేమికురాలు. గాయపడిన జంతువులకు ఆమె ఇంట్లోనే ఆశ్రయం కల్పించేవారు. అలా చేస్తే  ఎవరైనా అయితే విసుక్కొంటారు. కానీ నాగ్ అలా చేయలేదు. ఆమెకు దిశానిర్దేశం చేశారు. ఆయన కారణంగానే అమల బ్లూ క్రాస్ సంస్థను స్థాపించారు.

తోడూనీడగా ఉంటామని ప్రమాణం

పెళ్లినాడు జీవితాంతం తోడుంటామని ప్రమాణాలు చేసుకొంటారు. ఆ తర్వాత వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోం. కానీ నాగ్, అమల అలా కాదు. ప్రతి పెళ్లిరోజూ ఆనాటి ప్రమాణాలు మళ్లీ చేసుకొంటారు.

సింపుల్ గా..

ఇద్దరూ పెద్ద స్టార్స్ అయినా.. చాలా సింపుల్ గా ఉండటానికే ఇష్టపడతారు. నాగ్ తెరపై చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తారు. కానీ నిజ జీవితంలో చాలా సింపుల్ గా ఉంటారు. ఇంట్లో ఎప్పుడూ పైజామాలోనే ఉంటారు. అమల ఎక్కువగా చేనేత చీరలే ధరిస్తారు. నగలు కూడా పెట్టుకోరు. వారిలా సింపుల్ గా ఉండటం మనకు సాధ్యమేనా?

భిన్న వ్యక్తిత్వాలు

నాగ్ చాలా జోవియల్ గా ఉంటారు. చాలా విషయాల్లో లిబరల్ గా ఉంటారు. కానీ అమల చాలా సీరియస్. తనపై వేసిన చిన్న జోక్ ను కూడా ఉపేక్షించరు. అంటే వ్యక్తిత్వపరంగా ఇద్దరూ భిన్న ధృవాలు. అందుకేనేమో ఇద్దరూ ఒక్కటిగా ఉన్నారు.

Images: Nagarjuna Akkineni Twitter, Akhil Akkineni Twitter

 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కథనాలు చదవచ్చు.

మీరు సోషల్ మీడియాలో రాక్ స్టార్ గా వెలుగిపోతున్నారా? అయితే Plixxo లో వెంటనే చేరిపోండి – www.plixxo.comఇండియాలోనే అతి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నెట్వర్క్ లో చేరి టాప్ బ్రాండ్స్ తో కలసి పనిచేసే అవకాశం అందుకోండి. 

Read More From Lifestyle