Entertainment

ఫ్రీ హగ్స్ పేరిట ముంబై నగరంలో.. రిచా ఛడ్డా చేసిన వినూత్న ప్రయత్నం మీకు తెలుసా..!

Sandeep Thatla  |  Jan 24, 2020
ఫ్రీ హగ్స్ పేరిట ముంబై నగరంలో.. రిచా ఛడ్డా చేసిన వినూత్న ప్రయత్నం మీకు తెలుసా..!

(Richa Chadda’s Free Hug Campaign in Mumbai City)

సాధారణంగా ఒక నటి జీవితకాలం (వెండితెర పరంగా) చాలా తక్కువ ఉంటుంది. అందుకనే ఎక్కువ శాతం  నటీమణులు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. ఈ క్రమంలో ఎంత వీలైతే అంత ఎక్కువగా సినిమాలు చేస్తూ వాటి ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందేలా చూసుకుంటుంటారు.

‘జొమాటో’లో ఉబర్ ఈట్స్ విలీనం .. ఈ ఆసక్తికర పరిణామం వెనుక కారణాలివే..!

అయితే మరికొంతమంది నటీమణులు మాత్రం, అలా కాకుండా.. నటిగా తమకి వచ్చిన పేరు ప్రఖ్యాతులను సరైన మార్గంలో వినియోగించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి కోవకి చెందిన నటే రిచా చడ్డా . ఆమె తాజాగా చేసిన ఓ ప్రయత్నం ఎంతోమంది దృష్టిని ఆకర్షించగలిగింది.

ముంబై నగరంలో  జనవరి 21 తేదిన నటి రిచా చడ్డా ‘ఫ్రీ హగ్స్’ అంటూ ఒక సైన్ బోర్డు తీసుకుని రోడ్డు పైకి వచ్చింది. ఆ దారి గుండా వెళుతున్న సామాన్య జనానికి ‘హగ్’ ఇస్తానని తెలిపింది. అలాగే వారినందరినీ ఆలింగనం చేసుకుంది కూడా. ‘ఇలా ఎందుకు చేస్తుందబ్బా’ అని అనుకున్నవారూ లేకపోలేదు.

అయితే ఆమె ఇలా హగ్ ఇవ్వడానికి గల కారణం – ఆ రోజున ‘నేషనల్ హగ్స్ డే’ కావడమే. ఈ ప్రపంచంలో హింస, ద్వేషం బాగా పెరిగిపోయి.. మనుషుల మధ్య అసలు ఉండాల్సిన ప్రేమ, శాంతి తగ్గుతున్నాయన్నది సత్యం. ఇదే విషయాన్ని చెబుతూ ఇలా ‘మనుషుల మధ్య ఓ ప్రేమైక బంధానికి నాంది పలకడానికి..  ఫ్రీ హగ్స్ పేరిట ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకుని ప్రేమని పంచాలి’ అంటూ రిచా ఈ ఫ్రీ హగ్స్ (free hugs) క్యాంపెయిన్‌కి శ్రీకారం చుట్టడం జరిగింది.

రిచా ఛడ్డా చేసిన ఈ ప్రయత్నాన్ని ఆమె బాయ్ ఫ్రెండ్ అలీ ఫజల్ ఎంతగానో మెచ్చుకుంటూ.. ‘రిచాని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది’ అంటూ పొగడ్తలతో ముంచెత్తేశాడు. నెటిజన్స్ సైతం రిచా చేసిన ప్రయత్నానికి మద్దతు తెలపడం గమనార్హం. అదే సమయంలో ఆమె ప్రారంభించిన ఈ ‘ఫ్రీ హగ్స్’ క్యాంపెయిన్‌ని అన్ని చోట్లా కూడా ప్రారంభించాలి అంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

శీతాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే ..!

ఇక రిచా ఛడ్డా తన సోషల్ మీడియా పేజీల ద్వారా ఏ అంశం మీదైనా సరే.. ఎటువంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటుంది. అదే సమయంలో ఆమె ఈ క్రమంలో ఎన్నో విమర్శలను సైతం ఎదురుకోవాల్సి వస్తుంది. అయినప్పటికి ఎటువంటి తొట్రుపాటు లేకుండా.. ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరచగలడం తనకే సొంతం.

ఇలా ఒక వినూత్న ప్రయత్నం ద్వారా వార్తల్లో నిలిచింది రిచా ఛడ్డా. ఇక ఆమె తాజాగా ముఖ్యపాత్ర పోషించిన చిత్రం ‘పంగా’. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. ఆమెకి శిక్షకురాలి పాత్రలో రిచా ఛడ్డా మనకి కనిపించనుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఆమె చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుంది మాత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’  చిత్రంతోనే. ఆ చిత్రంలో 20, 30 & 50 ఏళ్ళ మహిళగా కనిపించడం మాత్రమే కాకుండా.. అందులో అద్భుతంగా నటించడంతో ఆమె పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం పాకిపోయింది. ‘ఫుక్రే’ చిత్రంలో ఆమె పోషించిన ‘కామెడీ డాన్’ పాత్ర కూడా ఆమెని చిత్రపరిశ్రమలో నిలిచేలా చేసింది.

ఏదేమైనా.. హీరోయిన్ అంటే కేవలం సినిమాలకే పరిమితమవ్వకుండా.. ఇలా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించడం చూసి రిచాని అభినందించకుండా ఉండలేకపోతున్నారు ప్రజానీకం.

దేశాన్నే అబ్బురపరిచిన.. హైదరాబాదీ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్’ : ఈ టాప్ 5 విశేషాలు మీకోసం                                                                          

Read More From Entertainment