Lifestyle

మీ బాయ్ ఫ్రెండ్ ఇలా చేస్తుంటే.. మిమ్మల్ని మోసం చేస్తున్నాడనే అర్థం..!

Lakshmi Sudha  |  Mar 18, 2019
మీ బాయ్ ఫ్రెండ్ ఇలా చేస్తుంటే.. మిమ్మల్ని మోసం చేస్తున్నాడనే అర్థం..!

మనం ప్రేమించే వ్యక్తిపై మనకు చాలా నమ్మకం ఉంటుంది. వారు మనల్ని మోసం చేయరని.. ఎప్పటికీ మనతోనే కలిసి ఉంటారని విశ్వసిస్తాం. అందరి జీవితంలోనూ ఇలాగే జరిగితే చాలా బాగుంటుంది. కానీ కొంతమంది మాత్రం భాగస్వామి చేతిలో మోసపోతుంటారు. అయితే అలాంటి రిలేషన్లో ఉన్నామని మనం ముందుగా గుర్తించలేమా? ముందే జాగ్రత్తగా వ్యవహరించి టాక్సిక్ రిలేషన్ నుంచి బయటకు రాలేమా? భాగస్వామి మోసం చేస్తున్నాడనే విషయం మనం ముందుగా గుర్తించలేమా?

కచ్చితంగా అవన్నీ చేయచ్చు. మరి.. అందుకోసం గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి? ముందు ఇలాంటి అనుమానం వచ్చినప్పుడు.. ఆయా వ్యక్తి సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలించాలి. అవేనండి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అతడు ఎలా ఉంటున్నాడో తెలుసుకొంటే.. మీతో అతడి ప్రవర్తన ఏవిధంగా ఉందో అంచనా వేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో తెలుసుకొందాం.

సాధారణంగా సోషల్ మీడియాలో (social media) మీ బాయ్ ఫ్రెండ్ (boyfriend) చేసే పనులను మొదట మీరు గుర్తించలేరు. రెండోది గుర్తించినా మీకు మీరు సర్ది చెప్పుకోవడానికి మీ దగ్గర కారణాలుంటాయి. మూడోది అతడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని మీరు గ్రహించినా.. మీ బంధాన్నితెంచుకోవడానికి మీరు ఇష్టపడరు. ఎందుకంటే అతని సాన్నిహిత్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అయితే ఇవన్నీపక్కన పెట్టి ముందు అతను మీతో ఎలా ఉంటున్నాడో ఓ సారి పరిశీలించండి. సోషల్ మీడియాలోనే కాదు.. వాస్తవంగానూ అతను చేసే కొన్ని పనులు మీపై అతనికున్న అభిప్రాయాన్ని పరోక్షంగా తెలియజేస్తాయి.

Also Read: ఓ నిర్ణయానికి వచ్చేముందు.. మీ బాయ్ ఫ్రెండ్‌ను ఈ ప్రశ్నలు అడగండి

1. మీతో ఛాటింగ్ చేయడం తగ్గిస్తారు.

కొన్ని రోజుల క్రితం వరకు ఎంత బిజీగా ఉన్నా ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మిమ్మల్ని ప‌ల‌క‌రించి, రోజులో అప్పుడప్పడూ మీతో కాసేపు చాటింగ్ చేసే వ్యక్తి ఉన్నట్టుండి మిమ్మల్ని కనీసం  పలకరించడం మానేస్తే..? మీరు మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వకపోతే..? కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఏమంటారు?

2. ఫోన్ టచ్ చేస్తే చాలు ఫైర్ అవుతుంటే..

సాధారణంగా తన భాగస్వామి ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఖాతాల్లోకి లాగిన్ అవ్వాలని ప్ర‌తి అమ్మాయి భావిస్తుంది. అదో సరదా అంతే. ఆ చిన్ని సరదాను సైతం తీర్చడానికి చాలా ఆలోచిస్తుంటారు కొందరు. మీ బాయ్ ఫ్రెండ్ కూడా అంతేనా? అఫ్ కోర్స్ ప్రతిఒక్కరికీ పర్సనల్ స్పేస్ ఉంటుంది. దానిలోకి మనం ఎంటరవకూడదు. ఓకే. కానీ మరీ ఫోన్ కూడా ముట్టుకోనివ్వకుండా.. మీకు అందనంత దూరంగా ఉంచుతుంటే.. ఏదో దాస్తున్నట్టే కదా..?

Also Read: టీనేజ్ క్రష్.. కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్.. అచ్చం సినిమా లాంటి ప్రేమకథ

3. ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడపుతున్నారని అనడం

ఇలా మిమ్మల్ని మీ బాయ్ ఫ్రెండ్ అంటున్నాడంటే మీ మీద ప్రేమ ఎక్కువై.. పొసెసివ్‌గా ఆలోచించి అలా చేస్తున్నారనుకొంటే పొరపాటే. ఎక్కువ సమయం ఫోన్‌తోనే గడుపుతున్నారని.. సమయం వేస్ట్ చేస్తున్నారని మిమ్మల్ని ఓ మాట అంటే ఫర్వాలేదు. కానీ తరచూ అలా ప్రవర్తిస్తుంటే మాత్రం మీరు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే.. అతడు ఈ విషయంలో మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. ఈ కారణం చెప్పి మీ బంధానికి తిలోదకాలు ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ముందుగానే ఈ విషయం గుర్తించడం మంచిది.

4. వేరే అమ్మాయిల ఫొటోలను లైక్ చేయడం

సాధారణంగా స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల ఫొటోలకు లైక్స్, కామెంట్స్ పెట్టడం సాధారణమైన అంశమే. అలా కాకుండా మరెవరో అమ్మాయి ఫొటోకి లైక్ కొట్టి క్యూట్ అనో.. బ్యూటిఫుల్ అనో కామెంట్ పెడితే మాత్రం.. కాస్త అనుమానించాల్సిన విషయంగానే పరిగణించాలి. అక్కడితో ఆగకుండా.. వారితో చాటింగ్ చేయడానికి ఎక్కువగా తాపత్రయపడుతున్నా.. తరచూ వారితో మెసేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా తీవ్రంగా పరిగణించాల్సిన విషయంగా మీరు భావించాలి.  అతడు త్వరలోనే మీ మనసుని బాధపట్టే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం.

Also Read: మీ బాయ్ ఫ్రెండ్ క‌ల‌లోకి వ‌స్తున్నాడా? దాని అర్థం ఏంటో మీకు తెలుసా??

5. ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి డిలీట్ చేయడం..

మీ బాయ్ ఫ్రెండ్ లేదా మీ జీవిత భాగస్వామి సోషల్ మీడియా ఖాతాలో మిమ్మల్ని అన్ ఫ్రెండ్ చేశారా? కొన్ని జంటలు తమ భాగస్వామి ఫేస్బుక్‌లో ఇతరులతో ఫ్రెండ్స్‌గా ఉండటాన్ని అంతగా ఇష్టపడవు. దానికి వారి కారణాలు వారికుంటాయి. మీ ఇద్దరూ కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చి.. ఒకరినొకరు అన్ ఫ్రెండ్ చేసుకొంటే అది మామూలుగా జరిగినట్లే భావించాలి. అలా కాకుండా.. మీ సమ్మతి లేకుండా.. మీ ఇద్దరూ గొడవ పడకుండా.. మిమ్మల్ని అన్ ఫ్రెండ్ చేస్తే.. ఏదో జరగడానికి అవకాశం ఉందని గుర్తించాలి. అలా చేయడానికి మీకు తెలియకుండా అతనేదో చేస్తున్నాడనే అర్థం.

6. డేటింగ్ యాప్స్ వాడుతుంటే..

నిజమే.. సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ రెండూ వేర్వేరు. కానీ అతని మొబైల్‌లో డేటింగ్ యాప్స్ ఉంటే.. అతడు వాటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటే.. అతడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడనేది సుస్పష్టమైన అంశం. ఎందుకంటే.. అతని జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా మీరు చోటు సంపాదించుకొన్న తర్వాత అతడికి వాటితో పనేమీ ఉండదు. అయినా వాటిని వాడుతుంటే.. మిమ్మల్ని వదిలేయడానికంటే ముందు ఇంకెవరినో అతడు వెతుక్కొంటున్నట్లే.

ఇవన్నీ మిమ్మల్ని మీ భాగస్వామి మోసం చేస్తున్నాడనే విషయాన్ని తెలియజేసే సూచనలు మాత్రమే. ఈ విషయంలో మీకు స్పష్టత వస్తే అతన్ని నిలదీయడానికి వెనుకాడకండి. ఎందుకంటే.. ఇది మీ జీవితం. మొహమాటానికి పోయి దాన్ని నాశనం చేసుకోవద్దు.

Featured Image: pexels.com

Images: Unsplash.com

Read More From Lifestyle