Entertainment

బాహుబలికి షాక్ ఇచ్చిన.. సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0

Sandeep Thatla  |  Dec 10, 2018
బాహుబలికి షాక్ ఇచ్చిన..  సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0

2.0 సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) బాక్స్ ఆఫీస్ రికార్డులని తిరగరాసేస్తున్నాడు. ఈ సినిమా విడుదలై ఇప్పటికే 11 రోజులు గడుస్తున్నా.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు.

ఈ సినిమాకి సంబంధించిన హిందీ, తెలుగు, తమిళ వెర్షన్స్ వసూళ్ళ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోతున్నాయని ట్రేడ్ వర్గాల టాక్. 11 రోజుల్లో ఒక్క చెన్నై సిటీలోనే ఈ చిత్రం రూ. 18.41 కోట్ల వసూళ్లను సాధించింది. అలాగే.. ఇప్పటివరకు చెన్నై సిటీలో అత్యధిక కలెక్షన్ల రికార్డు బాహుబలి – 2 పేరిట ఉండగా.. అది ఇప్పుడు రజినీకాంత్ 2. 0 పేరిట రేపో ఎల్లుండో మారిపోనుంది .

బాహుబలి – 2 చిత్రం చెన్నై సిటీలో దాదాపు. రూ 19 కోట్లు (లైఫ్ టైం) వసూలు చేయగా.. ఇప్పుడు 2. 0 చిత్రం కేవలం 12-13 రోజుల్లోనే ఆ రికార్డుని చెరిపేయనుంది. హిందీలో సైతం ఇప్పటికే ఈ చిత్రం.. భారీ కలెక్షన్లు సాధించిన టాప్ 5 సినిమాల సరసన చేరగా.. మొత్తం లైఫ్ టైం కలెక్షన్స్ వచ్చే సమయానికి ఇది కచ్చితంగా రూ. 200 కోట్ల క్లబ్బులో చేరిపోనుంది అని ట్రేడ్ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి.

లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. హిందీలో డబ్బింగ్ చేయగా ఆ హక్కులను కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ హిందీలో ఈ చిత్రానికి నిర్మాణ సారధ్యం వహించడం విశేషం. రజినీకాంత్ ఈ చిత్రంలో శాస్త్రవేత్త వశీకరన్ పాత్రతో పాటు రోబో చిట్టి పాత్రలో కనిపించారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో ప్రొఫెసర్ పక్షి రాజన్ పాత్రలో అలరించారు. సెల్ ఫోన్ టవర్స్ వెదజల్లే రేడియేషన్స్ వలన పక్షులు మరణించడంతో.. ఆ సమస్యకు పరిష్కారం కోసం పక్షి రాజన్ ఉద్యమం చేస్తారు. అయితే తన పోరాటంలో ఆయన విజయం సాధించకపోవడంతో .. ఆత్మహత్య చేసుకొని మరణిస్తారు.

అలా మరణించిన ఆయన.. పక్షుల ఆత్మల ప్రోద్బలంతో ఒక పెద్ద శక్తిగా మారి సెల్ ఫోన్లను, సెల్ ఫోన్ టవర్లను నాశనం చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఈ పక్షిరాజన్ శక్తిని అంతమొందించడం కోసమే.. ప్రభుత్వం రోబో చిట్టిని మళ్ళీ రంగంలోకి దింపుతుంది. రోబో నీల (అమీ జాక్సన్).. చిట్టికి సహాయంగా పక్షి రాజన్ ని చంపే ప్రాజెక్టులో భాగస్వామిగా మారుతుంది.

గతంలో ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, ఐ, శివాజీ లాంటి వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించిన శంకర్ ఈ చిత్రానికి కూడా డైరెక్షన్ చేయడంతో రజినీ అభిమానులకు కూడా ఆసక్తి పెరిగింది. అయితే టెక్నాలజీకి వేసినంత పెద్దపీట ఈ చిత్రంలో కథకు దర్శకుడు వేయలేదని విమర్శలు రావడంతో తొలుత ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కాకపోతే విమర్శకుల అంచనాలను కూడా తలక్రిందులు చేసి ఈ చిత్రం కలెక్షన్ల సునామీని కురిపించింది.

ఎందుకంటే .. సూపర్ స్టార్ మేనియా అంటే మాటలు కాదు కదా.

 

 

Read More From Entertainment