సుస్మిత సేన్ (sushmitha sen).. అందమైన రూపం.. అద్భుతమైన నటనతో పాటు అంతకంటే మంచి మనసున్న కథానాయిక ఆమె. విశ్వసుందరిగా గెలిచిన ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌కే కాదు.. చాలామందికి చాలా రకాలుగా స్పూర్తినిస్తోంది. రెనీ, అలీసా అనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్న సుస్మిత.. వారిద్దరి కోసం తన కెరీర్‌ని కూడా పక్కన పెట్టింది. అదేంటని అడిగితే నేను వారికి అమ్మలా ఉండాలనుకున్నా.. కానీ ఇన్వెస్టర్‌లా కాదు అని చెబుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన ఆరోగ్యం గురించి.. తన జీవితంలో చావు దగ్గరకు వెళ్లి తిరిగి వచ్చిన అనుభవం గురించి పంచుకుంది. తన అడ్రినల్ గ్రంథి పనిచేయకపోవడం వల్ల చనిపోయే స్థాయికి చేరుకున్న రోజుల గురించి చెప్పుకొచ్చింది.
2014లో బెంగాలీ సినిమా నిర్భక్ షూటింగ్ పూర్తవగానే నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అసలు ఏమైందో నాకు అర్థం కాలేదు. కళ్లు తిరిగి పడిపోయాను. హాస్పిటల్‌కి తీసుకువెళ్లిన తర్వాత పదుల సంఖ్యలో టెస్టులు చేశారు. తర్వాత నా అడ్రినల్ గ్రంథి కార్టిసాల్ తయారుచేయడం మానేసిందని చెప్పారు.
ముందే కళ్లు తిరిగి పడిపోవడం వల్ల ఈ సమస్య బయటపడింది. నాకు ఆ సమస్య ఉందని తేలింది. ఆ తర్వాత నా అవయవాలు ఒకదాని తర్వాత మరొకటి పనిచేయడం మానేసి.. దాని ద్వారా నేను చనిపోతానని చెప్పేశారు. అయితే స్టెరాయిడ్స్ ఉపయోగించి నా జీవితాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. నేను ప్రతి ఎనిమిది గంటలకోసారి హైడ్రోకార్టిసోన్ అనే స్టెరాయిడ్ (steroid) ఉపయోగించాల్సి ఉంటుంది. నా శరీరం ఆ హార్మోన్‌ని విడుదల చేయలేదు కాబట్టి.. ప్రతి ఎనిమిది గంటలకోసారి 60 ఎంజీ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు నేను నరకం అనుభవించాను. ఎందుకంటే నేను మాజీ విశ్వ సుందరిని.. ఎప్పుడూ మీడియా కళ్లు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. నేను చాలా అందమైన అమ్మాయిని అని అంతా భావిస్తుంటారు. కానీ నా అందం రోజురోజుకీ తగ్గిపోయేది. జుట్టు రాలిపోతూ బట్టతలలా మారిపోయేది. కళ్లు ఉబ్బినట్లుగా కనిపించేవి.
వీటితో పాటు బరువు పెరగడం, ఎముక సాంద్రత తగ్గడం, రక్తపోటు వంటి సమస్యలు కూడా వచ్చేవి. వీటితో అటు నా శరీరంలో స్టెరాయిడ్ నిల్వలు పెరిగిపోతున్నాయి. ఆరోగ్యపరంగా బలహీనంగా మారడంతో పాటు నా ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింది. నేను ఇలా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నా.. నా కెరీర్ గురించి అన్నింటికంటే ముఖ్యంగా నా ఇద్దరు కూతుళ్ల గురించి బాధపడేదాన్ని. వారికి నా అవసరం ఉన్నప్పుడల్లా వారితో ఉండలేకపోయేదాన్ని.
అలా సమస్యతో బాధపడుతూ ఓ రోజు నాకు నేనే ప్రశ్నించుకున్నా. ఇలా ఓ ఆరోగ్య సమస్య నా శక్తినంతా పీల్చి పిప్పి చేసేస్తోంది. దాన్ని ధైర్యంగా ఎదుర్కొని పోరాడలేక.. నేను దానికి లొంగిపోవడం ఏంటి? అని నాకు నేనే ప్రశ్నించుకున్నా.. అందుకే లండన్, జర్మనీ వెళ్లి చికిత్స తీసుకున్నా. అక్కడ సినాక్తిన్ టెస్ట్ అనే పరీక్షను రెండు సార్లు చేశారు. ఈ రెండుసార్లు స్టెరాయిడ్ పై ఆధారపడి బతకాల్సిందే అని చెప్పారు. అంతేకాదు.. మిగిలిన రోజులు నా ప్రొఫెషన్ మార్చుకొని జీవించడం మంచిదని సలహా ఇచ్చారు. కానీ నేను మాత్రం వాటిపై ఆధారపడి, నా కెరీర్ మార్చుకొని బతకాలనుకోలేదు. నా కంటి చూపు కూడా బలహీనం అవుతూ వస్తోంది. ఈ వ్యాధి ఒకవేళ నన్ను చంపేస్తే.. ఇతరులకు నేను ఎలాంటి దాన్ని అన్న విషయం ఎప్పటికీ అర్థం కాదు. అందుకే నాకు నేను సాధ్యమైనంత వరకూ ప్రయత్నించి చూస్తాను. ఓటమిని మాత్రం ఒప్పుకోను అని భావించా.
నా శరీరంలో ఏసీటీహెచ్ (అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్), కార్టిసాల్ తక్కువగా ఉండడం వల్ల యాంటీ గ్రావిటీ ఎక్సర్ సైజ్‌లు చేయడం సరికాదని వైద్యులు చెప్పారు. దీని వల్ల నా మెదడుకి రక్త ప్రసరణ సరిగ్గా జరగదని తేల్చేశారు. కానీ నేను ఓటమి ఒప్పుకోదల్చుకోలేదు. వెంటనే నా కోచ్‌కి ఫోన్ చేసి రేపటి నుంచి మనం యాంటీ గ్రావిటీ జిమ్నాస్టిక్స్ ప్రారంభిద్దాం అని చెప్పాను. కేవలం బతకడానికే అన్నీ మానుకొని ఉండడానికి నా మనసు ఒప్పుకోలేదు. అందరికీ ఇది సరికాకపోవచ్చు. కానీ నేను మాత్రం వైద్యులు చెప్పింది పాటించాలనుకోలేదు.
ఆ తర్వాత డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు ఏరియల్ సిల్క్, యోగా వంటివి ప్రయత్నించా. నా శరీరానికి ఏం కావాలో నిర్ణయించుకొని ఆ దిశగా అడుగులు వేసేదాన్ని. అయినా సరే.. 2016 అక్టోబర్‌లో మరోసారి నేను తిరిగి అనారోగ్యం బారిన పడ్డా. అబుదాబిలోని ఓ హాస్పిటల్‌లో నన్ను చేర్చారు. ఈసారి మరోసారి సినాక్తిన్ టెస్ట్ చేసి డాక్టర్ నాతో మాట్లాడారు. “సుస్మిత.. నువ్వు ఈ ఉదయం స్టెరాయిడ్స్ తీసుకున్నావా?” అని అడిగారు. నేను ఇంకా తీసుకోలేదు. ఏదో ఒకటి తిని తీసుకోవాలనుకున్నా అని చెప్పాను. అయితే వీటిని కొద్దికొద్దిగా తగ్గిస్తున్నా అని చెప్పా.. అప్పుడు డాక్టర్ నాకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు.
నువ్వు ఇక స్టెరాయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్లు చెప్పగానే నేను ఎందుకు? అని అడిగా. ఎందుకంటే నీ శరీరం దాన్ని ఉత్పత్తి చేస్తోంది. నీకు ఈ విషయం చెప్పేముందు నేను మూడు సార్లు పరీక్ష చేసి చూశాను. నాకే ఆశ్చర్యంగా అనిపించింది. నా 35 సంవత్సరాల కెరీర్లో ఇలా ఒకసారి హార్మోన్ విడుదల ఆగిపోయిన తర్వాత.. మళ్లీ తిరిగి ప్రారంభమవడం ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఇక నెమ్మదిగా ఈ స్టెరాయిడ్స్ తీసుకోవడాన్ని తగ్గించేయవచ్చు. ముందు కాస్త ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కానీ అది స్టెరాయిడ్స్ వాడడం మానేయడం వల్లే కాబట్టి.. కాస్త ఓర్చుకో అని చెప్పారు.
ఆ మాటలు వినడానికి నేను ఎంతగానో వేచి చూశాను. ఆ రోజు నుంచి స్టెరాయిడ్లు మానేసి దాని ప్రభావం నా శరీరంపై లేకుండా చేయడానికి నాకు రెండేళ్లు పట్టింది. ఇదంతా నన్ను శారీరకంగా, మానసికంగా చాలా ప్రభావితం చేసింది. అయితే స్టెరాయిడ్స్ ప్రభావం నాపై ఉంచుకోవడం నాకిష్టం లేదు. అందుకే చాలా కఠినమైన ఫిజికల్ ట్రైనింగ్ చేసి తిరిగి మామూలు స్థితికి చేరుకున్నా.
“దీనికి నా మనో ధైర్యంతో పాటు.. మన దేశంతో పాటు వివిధ దేశాల్లోని వైద్యులకు నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే..” అంటూ ఎంతో ధైర్యంగా.. తను ఏ విధంగా ఓ అరుదైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొని బయటకు వచ్చిందో తన కథ ద్వారా పంచుకుంది సుస్మిత. మనో ధైర్యం, ఆత్మ విశ్వాసం ఉంటే చాలు.. ఎంత పెద్ద సమస్యనైనా.. చివరికి చావునైనా ఎదురించి నిలబడొచ్చని సుస్మిత నిరూపించింది.
ఇవి కూడా చదవండి.
ఆ నిమిషం నేను సినిమాలు వదిలేసి మెడిసిన్ చేద్దామనుకున్నా : సాయి పల్లవి
“చైతూకి నాపై ఉన్న కంప్లైంట్.. అదొక్కటే” : సమంత
అమ్మా.. నా జీవితం నాశనం చేసినందుకు థ్యాంక్స్: సినీనటి సంగీత
Images : Instagram
Read More From Entertainment
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే
Sandeep Thatla