తాప్సీ పన్ను (Tapsee Pannu).. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్‌లోకి (bollywood) అడుగుపెట్టి వరుసగా హిట్ సినిమాలతో పాటు ఎన్నో మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించిన ఘనత ఆమె సొంతం. బాలీవుడ్లో ‘పింక్’ చిత్రంతో తన విజయాల పరంపరను మొదలు పెట్టిన ఆమె.. ఆ తర్వాత నామ్ షబానా, మిషన్ మంగళ్, సాండ్ కీ ఆంఖ్, బద్లా లాంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
తాజాగా గోవాలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కార్యక్రమంలో సెలబ్రిటీ గెస్ట్‌గా పాల్గొంది తాప్సీ. ఇందులో భాగంగా తన సినిమా జర్నీ గురించి.. దక్షిణాది చిత్రాల పట్ల తనకున్న ఇష్టం గురించి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత హిందీలో మాట్లాడమంటూ ఒత్తిడి చేసిన ఓ వ్యక్తికి.. తనదైన రీతిలో సమాధానం చెప్పింది తాప్సీ.
నేను చిన్నతనం నుండీ చాలా బాగా చదివేదాన్ని. డిగ్రీ పూర్తి కాగానే క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం కూడా వచ్చింది. కానీ ఎంబీయే చదవాలన్న కోరికతో ఆ ఉద్యోగం వదిలేశాను. నాటకాలంటే నాకెప్పుడూ ఆసక్తి లేదు. వాటిని చూసి నేను నవ్వుకునేదాన్ని. కానీ అనుకోకుండా పాకెట్ మనీ కోసం చేసిన మోడలింగ్ ఫొటోలు చూసి.. నాకు సినిమాల్లో ఆఫర్లు అందించారు. ముందు ‘ఏదో సరదాగా చేద్దాం’ అనుకున్నా కానీ.. ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత మాత్రం.. ఇదే రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్నా. దక్షిణాది సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత.. బాలీవుడ్ నుంచి అవకాశం వచ్చింది.
డేవిడ్ ధావన్ చిత్రం కాబట్టి వెంటనే ఒప్పుకున్నా. అయితే ఒక సినిమాలో నటించిన తర్వాత.. అక్కడ ఆపై ఎలా నిలదొక్కుకోవాలో అర్థం కాలేదు. ఒక బాలీవుడ్ నటికి ఉండాల్సిన అందం, మద్దతు రెండూ నాకు లేవు. అందుకే ఏదైనా విభిన్నమైన దారిలో వెళ్లాలని నిర్ణయించుకొని.. అలా ముందుకెళ్లాను. ప్రేక్షకులకు నా పాత్ర ఎంతలా గుర్తుండిపోతుందన్న విషయాన్ని.. నేను గమనించి మాత్రమే సినిమాలు ఒప్పుకుంటాను. సినిమా రంగానికి చెందిన కుటుంబం నుంచి నేను రాలేదు. కాబట్టి మనసుకు నచ్చిన సినిమాలు వచ్చినంత కాలం పనిచేస్తాను. బోర్ కొడితే ఆపేస్తాను. నన్ను ‘ఇలా ఎందుకు చేశావు’ అని ఎవరూ అడగరు. అయితే నా పిల్లలు.. నా సినిమాలు చూసి గర్వపడాలని మాత్రం నా కోరిక.
“దక్షిణాది సినీ పరిశ్రమ అంటే నాకెంతో ఇష్టం. దానిపై కృతజ్ఞతా భావం ఉంది. బాలీవుడ్లో అవకాశాలు వచ్చినంత మాత్రాన ఈ పరిశ్రమను వదిలేయను. చాలా తక్కువ మంది నటులు ఇటు టాలీవుడ్, కోలీవుడ్.. అలాగే అటు బాలీవుడ్‌లోనూ మంచి పేరు సాధించారు. నాకొచ్చిన ఆ పేరును నేను వదులుకోదలచుకోలేదు. కథ నచ్చితే.. ఎప్పుడైనా ఏ పరిశ్రమలో అయినా నటిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.
“వుమన్ ఇన్ లీడ్” అనే చర్చలో పాల్గొన్న తాప్సీ.. ఆ తర్వాత విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇంగ్లిష్‌లో ఇస్తుండగా.. ఓ వ్యక్తి ఆమెను “మీరు హిందీ నటి కాబట్టి.. హిందీలో సమాధానం ఇవ్వండి” అని అడిగాడు.
“ఇక్కడున్నవారందరికీ హిందీ అర్థం కాకపోవచ్చు. అందుకే నేను హిందీలో మాట్లాడడం లేదు” అని తాప్సీ చెప్పినా ఆ వ్యక్తి అలాగే పట్టుబట్టడంతో…
“నేను హిందీ మాత్రమే కాదు.. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటిని కూడా. నాకు తెలుగు, తమిళం భాషలు కూడా వచ్చు. ఆ భాషల్లో మాట్లాడమంటారా?” అంటూ నవ్వుతూనే గట్టి సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఓ వ్యక్తి “హిందీలో మాట్లాడితే ఎలైట్ (ఉన్నత వర్గం) వ్యక్తులు అనిపించుకోలేరు కదా.. అందుకే ఇంగ్లిష్‌లోనే” మాట్లాడతారు అంటూ ట్వీట్ చేశారు.
దీనికి తాప్సీ “ఉన్నత వర్గం (ఎలైట్) అనేది మాట్లాడే భాషను బట్టి కాదు.. మన ఆలోచనా తీరును బట్టి ఆధార పడి ఉంటుందని” సమాధానం ఇవ్వడం విశేషం. ఆమె ఇచ్చిన ఈ సమాధానం కూడా.. నెటిజన్ల మనసును ఆకట్టుకుంటోంది.
దీపావళి సందర్భంగా “సాండ్ కీ ఆంఖ్” సినిమాలో ఎనభైల వయసున్న ప్రకాశీ తోమర్ పాత్రలో మెరిసి అందరినీ ఆకట్టుకున్న తాప్సీ ప్రస్తుతం తడ్కా, తప్పడ్ సినిమాల్లో నటిస్తోంది. టాప్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథతో సినిమా రూపొందుతోందని.. ఆ సినిమాలో తాప్సీ కథానాయికగా కనిపించనుందని కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమై 2021లో విడుదల కానుందట.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.