Lifestyle

హైదరాబాద్ మెట్రో వేదికగా.. మహిళల కోసం “తరుణి ఫెయిర్”..!

Sandeep Thatla  |  Apr 19, 2019
హైదరాబాద్ మెట్రో వేదికగా.. మహిళల కోసం “తరుణి ఫెయిర్”..!

మహిళలూ.. ఈ విషయం విన్నారా.. మీరు హైదరాబాద్ మెట్రో స్టేషనులో హాయిగా యోగా చేయవచ్చు. యోగా ఒక్కటే కాదు. మీకు నచ్చిన కళల్లో కూడా శిక్షణ పొందవచ్చు. వివిధ సంప్రదాయ కార్యక్రమాల్లో కూడా హాయిగా పాల్గొనవచ్చు. ఒక రకంగా మీకోసమే ఈ పండగ. మహిళల కోసం హైదరాబాద్ మెట్రో స్టేషన్ నిర్వహిస్తున్న ఒక కొత్త ఉత్సవం. దీని పేరే తరుణీ ఫెయిర్. మరి దీని విశేషాలేమిటో చూడండి మరి..!

హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail) సంస్థ వారు మహిళలకంటూ ప్రత్యేకంగా ఒక మెట్రో స్టేషన్‌ని కేటాయించిన సంగతి విదితమే కదా! ఆ స్టేషన్‌కు తరుణి మెట్రో స్టేషన్ (Taruni Metro Station) అని నామకరణం చేశారు. ఈ క్రమంలో.. వేసవి కాలం రెండు నెలల పాటు తెలంగాణ సాంస్కృతి శాఖక నేతృత్వంలో తరుణి ఫెయిర్‌ని ప్రత్యేకంగా (Taruni Fair) నిర్వహించబోతున్నారు.

అసలు ఆ తరుణి ఫెయిర్ ఏంటి? అక్కడ ఈ రెండు నెలల పాటు ఇక్కడ ఏమి నేర్పిస్తారు? ఈ ఫెయిర్‌లో మనం ఏమి చూడవచ్చు? వంటి ప్రశ్నలకి ఇప్పుడు మనమూ సమాధానాలు తెలుసుకుందాం.

హైదరాబాద్ – సికింద్రాబాద్‌లో ఉండే మహిళల కోసం అమీర్ పేట్ – మియాపూర్ మెట్రో మార్గమైన కారిడార్ – 3 లో ఉండే మధురానగర్ స్టేషన్‌కి (Madhura Nagar Metro Station) తరుణి మధుర నగర్ స్టేషన్ అని నామకరణం చేసి.. అందులో మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించడానికి కేవలం మహిళలనే కేటాయించడం జరిగింది.

ఇప్పుడు ఆ స్టేషన్ క్రింద భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో ఏప్రిల్ 20 నుండి మొదలుకుని 60 రోజుల పాటు మహిళలు,  చిన్నపిల్లలకి సంబంధించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచబోతున్నారు. అలాగే మహిళలు స్వయంసహాయక గ్రూపులుగా ఏర్పడి తయారుచేసిన వస్తువులు, తిండి పదార్ధాలను అక్కడ విక్రయించనున్నారు. 

 

ఈ 60 రోజుల పాటు సాయంత్రం 6.30 తర్వాత.. మెట్రోస్టేషన్ పరిధిలో  వివిధ కళారూపాల ప్రదర్శన‌తో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇక వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ప్రచార కార్యక్రమాల్లో భాగంగా.. ఒగ్గు కథ, బుర్ర కథ & హరికథలను ఆహుతులు.. ఈ తరుణి ఫెయిర్‌లో భాగంగా వీక్షించవచ్చట. మొత్తం 150 స్టాల్స్‌లో తరుణి తారంగం పేరిట వివిధ వస్తువులు, పిండివంటలు ఇచ్చట విక్రయించనున్నారు.

అంతేకాదు.. రోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉచిత యోగా శిక్షణ కూడా ఈ మెట్రో స్టేషనులో ఇవ్వనున్నారట. ఈ యోగ శిక్షణ కోసం ఆసక్తి చూపేవారిని 15 మంది చొప్పున ఒక బ్యాచ్‌గా తీసుకుని.. 15 రోజుల పాటు శిక్షణనిస్తారు. ఇక ఇదే క్రమంలో మహిళలకి, చిన్న పిల్లలకి పెయింటింగ్ & సాఫ్ట్ స్కిల్స్‌లో కూడా ప్రత్యేకంగా శిక్షణఇచ్చేందుకు.. కొన్ని క్రాష్ కోర్సులని సిద్ధం చేసినట్టు సమాచారం.

 

ఇవ్వన్నీ ఒకెత్తయితే.. తరుణి మధురానగర్ మెట్రో స్టేషన్ క్రింది భాగంగాలో కనిపించే.. ఖాళీ ప్రదేశంలో ఈ స్టాల్స్‌ని ఏర్పాటు చేయడంతో పాటు.. ఆ ప్రాంతాన్నంతా తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిభింబించేలా డిజైన్ చేశారట. అలాగే పట్టణాల్లో నివసించే వారికి.. పల్లెటూరి వాతావరణాన్ని పరిచయం చేసేందుకే తాము ఈ కొత్త పద్ధతిని అవలంబించామని హైదరాబాద్ మెట్రో రైల్ ఏం.డి ఎన్వీఎస్. రెడ్డి (NVS. Reddy) తెలిపారు.

ఇక తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ (Mamidi Harikrishna) గారి నేతృత్వంలో పనిచేస్తున్న డిపార్ట్‌మెంట్ కూడా.. ఈ రెండు నెలల పాటు మహిళలకి ఉపయుక్తంగా ఈ తరుణి ఫెయిర్‌ని సిద్ధం చేసేందుకు కృషి చేస్తున్నారు. అలాగే ఈ ఫెయిర్‌ను ప్రధానంగా యువత.. అందులోనూ ఆడపిల్లలు చక్కగా వినియోగించుకోవాలని .. ఇందులో ఏర్పాటు చేసే కుక్కింగ్ & రంగోలి వంటి పోటీలలో పాల్గొని తమలోని సృజనాత్మకతని పెంచుకోవాలని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.

 

హైదరాబాద్ మెట్రో రైల్ రాకతో.. ప్రజానీకం ట్రాఫిక్ బెడద నుండి కాస్త ఉపశమనం పొందగలిగారు అన్నది వాస్తవం. అటువంటిది ఇప్పుడు అదే హైదరాబాద్ మెట్రో రైల్ వారి సౌజన్యంతో మహిళల కోసం ప్రత్యేకంగా ఇటువంటి ఒక ఈవెంట్‌ని చేయనుండడం.. దానికి తరుణి ఫెయిర్ అంటూ పెట్టడం నిజంగా అభినందించాల్సిన విషయం.

ఇక ఈ తరుణి ఫెయిర్  ఏప్రిల్ 20, 2019 తేది సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఇక ఈ ఫెయిర్‌లో భాగంగా శిక్షణా తరగతుల్లో పాల్గొనేందుకు.. ఈ క్రింద ఇచ్చే మెయిల్ అడ్రస్ & ఫోన్ నంబర్స్ ద్వారా ఏప్రిల్ 24 లోపు రిజిస్టర్ చేయించుకోవచ్చు. మెయిల్ – hydmetrorailproject@gmail.com ఫోన్ నంబర్స్ – 040-23388588 / 23388587

మరింకెందుకు ఆలస్యం.. తరుణి ఫెయిర్‌కి తరుణీమణులంతా విచ్చేయండి..!

ఇవి కూడా చదవండి

ఫ్యాన్సీ నెంబర్ల కోసం లక్షలు కుమ్మరిస్తున్న వైనం.. చదివితే అవాక్కవ్వాల్సిందే!

ఆహా.. ఏమి రుచి..! ఈతరం యువతను.. అమితంగా ఆకర్షిస్తున్న కర్రీ పాయింట్స్

బాబోయ్.. పెళ్లి శుభలేఖలను ఎంపిక చేయాలంటే.. చాలా కష్టమే సుమండీ..!

Read More From Lifestyle