Celebrity Life

ప్రముఖ టాలీవుడ్ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

Babu Koilada  |  Dec 12, 2019
ప్రముఖ టాలీవుడ్ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

(Veteran Telugu actor, writer Gollapudi Maruthi Rao passes away)

పేరుకు సినిమా నటుడైనా.. ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. “కళ్లు” నాటకంతో బడుగు జీవుల బతుకు చిత్రాన్ని గీసిన ఆయన.. ఆ తర్వాత “పిడికెడు ఆకాశం” అనే నవలతో జీవిత సత్యాలనూ చెప్పకనే చెప్పారు. ఇంకా రెండు రెళ్లు ఆరు, పతిత, కరుణించని దేవతలు, కాలం వెనక్కి తిరిగింది, ఆశయాలకు సంకెళ్లు మొదలైన ఆయన నాటకాలకు అవార్డులు, రివార్డులు లభించాయి. ఒక వైపు రచయితగా రాణిస్తూనే.. సినిమాలలో కూడా బహుముఖ పాత్రలు పోషించారు గొల్లపూడి మారుతీరావు.

అమ్మ ప్రేమను తెలిపే సినీ గీతాలు మీకోసం

సంసారం ఒక చదరంగం, ఆలయ శిఖరం, అభిలాష, ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య మొదలైన చిత్రాలలో గొల్లపూడి నటన నిజంగానే నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఉంటుంది. కామెడీని పండించే విలనిజాన్ని ఆయన  నటించిన కొన్ని పాత్రలలో మనం కచ్చితంగా చూడవచ్చు. ఇక రైతు కుటుంబం, అన్నదమ్ముల అనుబంధం, దొరబాబు, ఓ సీత కథ, శుభలేఖ, ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య, కళ్లు మొదలైన హిట్ చిత్రాలకు సంభాషణలు రాసిన గొల్లపూడి.. ఆ తర్వాత దర్శకుడిగా కూడా మారారు. అది కూడా ఓ విషాద సంఘటన కారణంగా జరిగింది.

ఈ దేశ‌భ‌క్తి పాట‌లు వింటే.. మిమ్మల్ని మీరే మైమ‌రచిపోతారు..!

తొలుత మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ “ప్రేమ పుస్తకం” చిత్రానికి దర్శకుడిగా పరిచయమయ్యారు. కానీ ఆయన అర్థాంతరంగా మరణించారు. ఆ బాధ నుండి చాలాకాలం కోలుకోలేకపోయారు గొల్లపూడి. అయినా సరే.. ఆ బాధను దిగమింగుకొని.. “ప్రేమ పుస్తకం” చిత్రానికి సంబంధించిన మిగతా భాగాన్ని పూర్తి చేశారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి ఆఖరి సినిమా కూడా అదే. తన కుమారుడు మరణించాక.. ఆయన పేరు మీద ప్రతీ సంవత్సరం ఓ కొత్త దర్శకుడికి “గొల్లపూడి శ్రీనివాస్” స్మారక అవార్డును ఇవ్వడానికి సంకల్పించారు కూడా.

 

అమీర్ ఖాన్, ఇంద్రగంటి మోహనక్రిష్ణ, కొంకణా సేన్ శర్మ లాంటి దర్శకులు గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డులను అందుకున్న వారిలో ఉండడం విశేషం. ఇక సినిమాలలో తనదైన ముద్ర వేసిన గొల్లపూడి మారుతీరావు.. టెలివిజన్ రంగంలో కూడా రాణించారు. అలాగే విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో రేడియో ప్రయోక్తగా , జర్నలిస్ట్‌గా కూడా కొంతకాలం పనిచేశారు.  గురజాడ వారి కన్యాశుల్కం సీరియల్‌లో కూడా నటించారు. విజయనగర వాసి అయిన గొల్లపూడికి.. విశాఖపట్నంతో కూడా ఎంతో అనుబంధం ఉంది. ఆంధ్రా యూనివర్సిటి థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్ వారి కోసం ఆయన.. “తెలుగు నాటక రంగం” అనే పాఠ్య పుస్తకాన్ని కూడా రాశారు.

ఈ బాలీవుడ్ చిత్రాలు.. మీలో దేశ‌భ‌క్తిని మ‌రింత పెంచుతాయి..!

అలాగే గొల్లపూడి ఆత్మకథ “అమ్మ కడుపు చల్లగా” పేరుతో కొద్ది సంవత్సరాల క్రితం విడుదలైంది.  అలాగే ప్రతిధ్వని అనే కార్యక్రమానికి  వ్యాఖ్యాతగా కూడా గొల్లపూడి కొన్నాళ్లు వ్యవహరించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి.. ఇటీవలే చెన్నై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఈ రోజు అక్కడే తుదిశ్వాస విడిచారు. గొల్లపూడి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో జరుగుతాయని ఆయన రెండో కుమారుడు రామకృష్ణ మీడియాకి తెలియజేశారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.                                                                                      

Read More From Celebrity Life