Celebrations

ఎస్ ఎస్ రాజమౌళి సెల్యూలాయిడ్ మ్యాజిక్.. “మగధీర”కు 10 ఏళ్లు..!

Babu Koilada  |  Jul 31, 2019
ఎస్ ఎస్ రాజమౌళి సెల్యూలాయిడ్ మ్యాజిక్.. “మగధీర”కు 10 ఏళ్లు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో వచ్చిన “మగధీర” (Magadheera) చిత్రం ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అనేది మనకు తెలియని విషయం కాదు. ఈ రోజుతో ఆ చిత్రం విడుదలై పదేళ్లు కావస్తోంది. ఈ సందర్భంగా ట్విటర్‌లో చెర్రీ అభిమానులతో పాటు, రాజమౌళి అభిమానులు కూడా ఆ సినిమా టీమ్‌కు శుభాాకాంక్షలు చెబుతున్నారు. రాజమౌళికి “బాహుబలి” లాంటి సూపర్ డూపర్ హిట్ లభించక మునుపే.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రంగా “మగధీర” ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఈ రోజు ఈ చిత్రం పదో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా.. మనం కూడా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..

గీతా ఆర్ట్స్ బ్యానరుపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. అప్పట్లోనే దాదాపు రూ.35 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటికే రాజకీయాలలో ఉన్న చిరంజీవి ఈ చిత్రంలో “బంగారు కోడిపెట్ట” సాంగ్‌లో కామియో రోల్‌లో కనిపించారు. ఈ చిత్రానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా శివశంకర్ మాస్టర్.. జాతీయ పురస్కారాన్ని అందుకోగా.. ఈ చిత్రానికి పనిచేసిన విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ కూడా నేషనల్ అవార్డును కైవసం చేసుకోవడం విశేషం. 

ఛత్రపతి శివాజీకి ప్రాణ మిత్రుడైన తానాజీ మాలుసురేకి సంబంధించిన ఓ మరాఠీ చిత్రాన్ని చూసిన రచయిత  విజయేంద్ర ప్రసాద్‌కి ఓ ఐడియా వచ్చిందట. చనిపోయిన అంగరక్షకుడు మళ్లీ జన్మించి.. పగను తీర్చుకుంటే ఎలా ఉంటుందన్న ఆయన ఆలోచనకు ప్రతిరూపమే “మగధీర” చిత్రంలోని.. కాలభైరవుడి పాత్ర. 100 మందిని చంపి గానీ.. తాను చావడన్న లాజిక్‌తో ఈ క్యారెక్టరును డిజైను చేసుకున్నారు విజయేంద్రప్రసాద్. అలాగే 1976లో విడుదలైన సూపర్ హిట్ కన్నడ చిత్రం “రాజ నన్న రాజ” చిత్రాన్ని చూసిన విజయేంద్ర ప్రసాద్.. అందులోని పునర్జన్మ కాన్సెప్ట్ తనకు బాగా నచ్చడంతో.. ఆ దిశగా కథను అల్లారట. 

“చిరుత” నుండి “రంగస్థలం” వరకు.. అలుపెరగని పయనం: హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్

ఒక వైపు విజయేంద్రప్రసాద్ ఛత్రపతి శివాజీ స్నేహితుడైన తానాజీ కథను ప్రేరణగా తీసుకొని.. అలాగే కన్నడలో రాజకుమార్ నటించిన “రాజ నన్న రాజ” సినిమాను చూసి ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ తయారుచూస్తే.. ఆ స్క్రిప్ట్‌ను సినిమాగా మార్చడానికి.. అందుకు అనువైన మార్పులు చేయడానికి రాజమౌళి చాలా కష్టపడ్డారట. సినిమాలో సస్పెన్స్‌ను నడపడం కోసం.. పదే పదే ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ డివీడీలు కూడా చూశానని.. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

ఈ సినిమాకి తొలుత కథానాయికగా తమన్నాను అనుకున్నారట. అయితే.. కొన్ని ఇతరత్రా కారణాల వల్ల ఈ అవకాశం కాజల్ అగర్వాల్‌కి దక్కింది. చిత్రమేంటంటే.. కాజల్‌ను “యమదొంగ” సినిమా సమయంలోనే కథానాయికగా రాజమౌళి తీసుకోవాలని భావించారట. ఆ టైంలో మిస్సయిన అవకాశం.. కాజల్‌కు “మగధీర” సమయంలో దక్కింది. ఈ చిత్రంలో రాజకుమారి మిత్రవిందగా.. అలాగే కాలేజీ అమ్మాయిగా రెండు విభిన్న పాత్రలలో కాజల్ నటించడం గమనార్హం. 

‘థాంక్యూ.. రామ్ చరణ్’.. ‘సైరా’ పై సుదీప్ మదిలోని మాట..!

ఇక ఈ చిత్రానికి కీరవాణి అందించిన మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్. ఆయన కంపోజ్ చేసిన ఆరు పాటలు కూడా సూపర్ డూపర్ హిట్టే. ఇక సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందమైన లోకేషన్లలో చిత్రీకరించిన పాటలు, జానపద సన్నివేశాలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాయి. ఇదే చిత్రం తమిళంలో “మావీరన్”గా, మలయాళంలో “ధీర”గా విడుదలైంది. తర్వాత బెంగాలీలో కూడా “యోధ” పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. 

6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 9 నంది అవార్డులు, 10 సిని”మా” అవార్డులు కైవసం చేసుకున్న “మగధీర” చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా 1250 థియేటర్లలో విడుదల చేయబడింది. ఈ చిత్రంలో నటించిన శ్రీహరికి షేర్ ఖాన్ పాత్ర తెచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. రాజస్థాన్ ఎడారుల్లో, గుజరాత్ కచ్ ప్రాంతంలో.. అలాగే కర్ణాటకలోని బాదామిలో.. అలాగే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటిలో ఈ సినిమా షూటింగ్ మొత్తం జరిగింది. 

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ & ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ??

Read More From Celebrations